beejapur
-
సరిహద్దుల్లో భయం భయం
చర్ల: ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని ఆదివాసీ పల్లెల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోనూ పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. అయితే పోలీసులకు కొరియర్లుగా వ్యవహరిస్తున్నారని, తమ సమాచారం పోలీసులకు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలను మావోయిస్టులు కిడ్నాప్ చేసి, ప్రజాకోర్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలువురిని హతమారుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బీజాపూర్ జిల్లాలోని పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలను వారం వ్యవధిలో 16 మందిని హతమార్చినట్లు సమాచారం. మావోయిస్టుల చేతిలో మృతి చెందిన వారిలో బట్టిగూడెం, కౌరగట్ట, కోడేపాల్, బీమారంపాడు, పూసుబాక గ్రామాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిసింది. కాగా ఇన్ఫార్మర్ల హత్యల విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తెలియనీయవద్దని, ఎవరైనా చెబితే వారిని కూడా శిక్షిస్తామని మావోయిస్టులు హెచ్చరించినట్లు సమాచారం. ఆయా గ్రామాల నుంచి పామేడుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇస్తారనే అనుమానంతో పామేడు – ధర్మారం మధ్యలో ఉన్న వాగులపై నడిచే పడవలను సైతం మావోయిస్టులు నిలిపివేసినట్లు తెలిసింది. అలాగే ఆదివాసీల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆయా గ్రామాలకు చెందిన ఆదివాసీలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎంత మందిని హతమారుస్తారోనని భయపడుతున్నారు. 28న బంద్‌కు మావోయిస్టుల పిలుపు వివిధ ప్రాంతాల్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈనెల 28న రాష్ట్రవ్యాప్త బంద్ పాటించాలని జయశంకర్ భూపాలపల్లి – ములుగు – మహదేవపూర్ – వరంగల్ – పెద్దపల్లి డివిజన్ల సీపీఐ (మావోయిస్టు) కార్యదర్శి వెంకటేశ్ పేరిట శనివారం ఓ ప్రకటన విడుదలైంది. చెన్నాపురం, కదంబ పూసుగుప్ప, దేవార్లగూడెంలలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లను ఖండించాలని పేర్కొన్నారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లలో శంకర్, శ్రీను, ఐతు, చుక్కాలు, బాజీరావు, జోగయ్య, రాజే, లలితను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లపై హక్కుల సంఘాలు నిజనిర్ధారణ కొనసాగించి బాధ్యులైన వాళ్లకు శిక్షలు పడేలా చూడాలని ఆయన కోరారు. -
నక్సల్స్ దాడిలో ఇద్దరు పోలీసులు మృతి
రాయ్‌పూర్/నాగపూర్: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో శనివారం నక్సలైట్ల దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. తిప్పాపురం గ్రామానికి మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు పోలీసులపై నక్సల్స్ కాల్పులు జరిపినట్లు డీఐజీ సుందరరాజ్ తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా నక్సలైట్లు మరణించినట్లు పోలీసు అధికారి చెప్పారు. వీరిలో ఒకరిని రామ్‌కో అలియాస్ కమ్లా మంకు నరోటె (46)గా గుర్తించినట్లు తెలిపారు. ఈమె తలపై 16 లక్షల రివార్డు ఉంది. -
మావోలకు మరో ఎదురు దెబ్బ
చర్ల/మల్కన్‌గిరి: మావోయిస్టులు వరుస నష్టాలు చవిచూస్తున్నారు. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన సందర్భంగా పలువురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు గుర్తించిన అక్కడి పోలీసు యంత్రాంగం.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం ఉదయం బిజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మరిమల అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు పోలీస్ బలగాలపైకి కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో .. ఇద్దరు పురుషులు, ఆరుగురు మహిళా మావోయిస్టులు చనిపోగా మిగతా వారు పరారయ్యారు. ఘటన స్థలం నుంచి ఒక ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, రివాల్వర్‌తోపాటు నాలుగు ఎస్‌బీబీఎస్ తుపాకులు, ఆరు రాకెట్ లాంచర్లు, ఆరు గ్రనేడ్లు, పది కిట్ బ్యాగులు, నాలుగు జతల ఆలివ్ గ్రీన్ దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను హెలికాప్టర్లో బిజాపూర్ ఆస్పత్రికి తరలించారు. గాలింపు చర్యల్లో తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. -
ఏం చేస్తారో..? ఆ నలుగురు
భువనేశ్వర్: బిజేపూర్ ఉపఎన్నికకు అధికార పక్షం బిజూ జనతా దళ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రత్యర్థుల వ్యూహాత్మకచర్యల్ని పటిష్టంగా ఎదుర్కొనేందుకు బిజూ జనతా దళ్ పకడ్బందీ సన్నాహాలు చేస్తోంది. ఉప ఎన్నిక ఆద్యంతాల్లో ప్రత్యర్థులు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడి ఓటరును తప్పుదారి పట్టించకుండా చేసేందుకు పార్టీ వ్యూహాత్మక కార్యాచరణ ఖరారు చేసింది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన నాటినుంచి ఎంటి మీద కునుకు లేకుండా అధికార పార్టీ వర్గాలుశ్రమిస్తున్నాయి. బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను సొంతం చేసుకునేందుకు బీజేడీ యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో 3 అంచెల్లో పరిశీలకులు, పర్యవేక్షకుల్ని నియమించింది. అసెంబ్లీ, సమితి, పంచాయతీ స్థాయిలో పర్యవేక్షక బృందం కృషి చేస్తోంది. వీరితో పాటు ఒక్కో స్థానిక నాయకుడు ప్రతి 10 కుటుంబాలకు బాధ్యత వహించేందుకు వ్యూహాత్మక పరిశీలన ఏర్పాట్లను బీజూ జనతా దళ్ పూర్తి చేసింది. ఈ వ్యవహారాలకు పార్టీ నుంచి ఎంపిక చేసిన నలుగురు ప్రముఖుల్ని బీజేడీ ఖరారు చేసింది. వీరిలో సుశాంత సింగ్,సంజయ్ కుమార్ దాస్ వర్మ, ప్రణబ్ ప్రకాశ్ దాస్, నిరంజన్ పూజారి ఉన్నారు. మంత్రి సుశాంత్ సింగ్, ప్రణబ్ ప్రకాశ దాస్ బిజేపూర్ సమితి వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారు. బర్పాలి సమితిబాధ్యతల్ని మాజీ మంత్రి సంజయ్ కుమార్ దాస్ వర్మకు కేటాయించగా గైసిలేట్ సమితి బాధ్యతల్ని మంత్రి నిరంజన్ పూజారికి కేటాయించారు. ఎంఎల్‌ఏలకూ పనే వీరితోపాటు పార్టీ ఎమేల్యేలంతా వరుస క్రమంలో బిజేపూర్ నియోజకవర్గాన్ని ప్రత్యేక్షంగా సందర్శించేందుకు పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశించారు. వీరంతాఅసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ప్రతి పంచయతీని సందర్శిస్తారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆధీనంలో కొనసాగిన బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పాగా వేసేందుకు కాంగ్రెస్‌తో ఉభయ బిజూజనతా దళ్, భారతీయ జనతా పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్ ఇంతవరకు తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. గాలింపు కొనసాగిస్తోంది. ప్రతి పంచాయతీపై గట్టి నిఘా బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రతి పంచాయతీపై ఎమ్మెల్యేలంతా గట్టి నిఘా వేయాలని పార్టీ అధ్యక్షుడు ఆదేశించారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 59 పంచాయతీలు ఉన్నాయి.ఒక్కో పంచాయతీ బాధ్యతను ఒక్కో ఎమ్మెల్యేకి కేటాయించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రతి పంచాయతీని ప్రత్యక్షంగాసందర్శించేందకుకార్యక్రమం ఖరారు చేశారు. -
ఎదురు కాల్పుల్లో జవాను మృతి
భద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక జవాను మృతిచెందారు. బీజాపూర్ జిల్లా మిర్తుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోరాలి ప్రాంతంలో శుక్రవారం ఉదయం పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో బీఎస్ఎఫ్ దళానికి చెందిన జవాను మృతిచెందగా మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.