ఐఫోన్ కోసం నెలల పాపను..
ఖరీదైన సెల్ఫోన్, బైక్ కోసం రోజుల పసికందును అమ్ముకున్నాడో ప్రబుద్ధుడు. ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ రాష్ట్రానికి చెందిన డ్యూన్ (19) తన 18 రోజులు ఆడబిడ్డను సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టాడు. సుమారు రూ. 2.34 లక్షలకు అమ్మేశాడు. ఈ విషయం అధికారుల చెవిన పడటంతో దంపతులిద్దరూ కటకటాలపాలయ్యారు.
డ్యూన్ స్థానిక ఇంటర్నెట్ సెంటర్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య అనుకోకుండా గర్భం దాల్చి, పాపకు జన్మనిచ్చింది. పాపను అమ్మి ఐ ఫోన్, బైక్ కొనుక్కోవాలని ప్లాన్ వేశాడు. అతడి బేరంతో.. పాపను కొనుక్కొన్న వ్యక్తి డబ్బులు చెల్లించాక ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. కానీ వ్యవహారం ఎలాగో పోలీసులకు చేరింది. విచారణ జరిపిన పోలీసులు యువ దంపతులిద్దర్నీ జైలుకు పంపించారు. కోర్టులో ప్రవేశపెట్టగా తల్లికి రెండున్నర సంవత్సరాలు, తండ్రి డ్యూన్కి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
కాగా విషయం తెలుసుకున్న తర్వాత పాపను కొనుక్కున్న వ్యక్తి పోలీసులు ముందు హాజరయ్యి, బిడ్డను వారికి స్వాధీనం చేశాడు. అయితే బిడ్డను అమ్మడం నేరమని తనకు తెలియదని తల్లి జియావో మెయి (18) పోలీసులకు చెప్పింది. ఆర్థికపరిస్థితి బాగోలేని కారణంగా ఇలా చేసినట్టు తెలిపింది. తాను కూడా పెంపకానికి వెళ్లానని, తన చుట్టుపక్కల బిడ్డలను వేరేచోటికి పంపిన వాళ్లను చాలా మందిని చూశానని చెప్పింది.