Begambajar
-
బేగంబజార్.. బేజార్!
నవంబర్ 8కి ముందు నిత్యం వంద కోట్ల వ్యాపారం నేడు సగానికి తగ్గిన వాణిజ్యం.. రూ.50 కోట్లు దాటని వైనం ♦ గత 8 రోజులుగా రూ.400 కోట్ల వ్యాపారానికి నష్టం ♦ పని లేకపోవడంతో సిబ్బందిని తొలగిస్తున్న వ్యాపారులు ♦ కూలీ దొరకక వందల మంది అవస్థలు ♦ బహిరంగ విపణిలో పలు రంగాలపై పెను ప్రభావం చూపుతోన్న నోట్ల రద్దు సాక్షి, హైదరాబాద్: బేగంబజార్... ‘బేర్’మంటోంది. హైదరాబాద్‌లోనే అత్యంత రద్దీగా ఉండే మార్కెట్. రోజూ ఇసుక వేస్తే రాలనట్లు ఉండే జనం. అగ్గిపుల్ల, సబ్బుబిల్లా, ఉప్పు, పప్పు, బియ్యం, సౌందర్యసాధనాలు.. గృహోపకరణాలు, ఆటోమోబైల్స్, ఇలా అన్ని వస్తువులకు ఇది నెలవు. హోల్‌సేల్ నుంచి రిటైల్ దాకా రోజూ కోట్ల రూపాయల వ్యాపార కేంద్రం. నగరంలోని ఇతర ప్రాంతాలే కాదు... జిల్లాల వ్యాపారులకు కూడా ఇదే పెద్ద హోల్‌సేల్ మార్కెట్. వందల కోట్ల లావాదేవీలు సాగే ఈ మార్కెట్ ఇప్పుడు బోసిపోతోంది. పెద్ద నోటు ‘కాటు’తో కోలుకోలేక అవస్థలు పడుతోంది. కొందరి వ్యాపారం దెబ్బతినగా... మరికొందరికి కూలీ కరువైంది... ఇంకొందరికి ఉపాధి లేకుండా పోయింది. కళ తప్పిన బేగంబజార్ మార్కెట్‌పై బుధవారం ‘సాక్షి’ బృందం పరిశీలనాత్మక కథనం... ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు అవసరమైన వస్తువుల కొనుగోళ్లు.... వేలాది మంది వ్యాపారుల రాకపోకలతో నిత్యం కళకళలాడే ఈ మార్కెట్ ఇప్పుడు వెలవెలబోతోంది. పెద్ద నోట్ల రద్దుతో ఈ బహిరంగ మార్కెట్లో హోల్‌సేల్, రిటైయిల్ వ్యాపారం దారుణంగా పడిపోయింది. నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దుకు ముందు బేగంబజార్, సిద్ధి అంబర్‌బజార్, మహరాజ్‌గంజ్, కిషన్‌గంజ్, ముక్తార్‌గంజ్ తదితర ప్రాంతాల్లో నిత్యం వందల కోట్ల వ్యాపారం జరిగేది. ప్రస్తుతం రూ.50 కోట్లు దాటడం లేదు. దేశంలో 14 శాతం మేర ఉన్న నల్ల కుబేరుల భరతం పట్టేందుకు 86 శాతం మేర ఉన్న సామాన్యులపై సర్జికల్ స్ట్రైక్స్ చేయడం దారుణమని వాపోయారు. 8 రోజులుగా రూ.400 కోట్ల నష్టం... బేగంబజార్‌లోని ఏడు డివిజన్ల పరిధిలో సుమారు ఐదువేల హోలోసేల్ దుకాణా సముదాయాలుంటాయి. ఇందులో కిరాణా, జువెల్లరీ, వస్రా్తలు, స్టీలు, సిమెంటు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు, టైర్లు, ఎలక్ట్రికల్, పప్పు దినుసులు, మసాలా, డ్రైఫ్రూట్స్, ఆటోమోబైల్స్, నూనెలు, లూబ్రికెంట్స్, పాన్‌మసాలా, ఫర్టిలైజర్, కాస్మోటిక్స్, స్టెయిన్లెస్స్టీల్ తదితర రంగాలకు సంబంధించిన దుకాణాలున్నాయి. వీటిల్లో నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దుకు ముందు రోజువారీగా సుమారు రూ.100 కోట్ల వ్యాపారం జరిగేది. నిత్యం సుమారు లక్షమంది రిటైల్ వ్యాపారులు, కొనుగోలుదారులు ఈ మార్కెట్‌కు వచ్చిపోయేవారు. కానీ పెద్ద నోట్ల రద్దుతో సీన్ రివర్సైంది. మార్కెట్లో కొనుగోళ్లు పడిపోయాయి. కొనుగోలు దారులు, రిటైలర్ల రాకపోకలు సగానికి పైగా తగ్గాయి. రూ.500, రూ.వెయ్యి నోట్ల రద్దుతో ఈ నోట్లను వ్యాపారులు స్వీకరించకపోవడంతో అమ్మకాల విలువ నిత్యం రూ.50 కోట్ల మేరకు పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. అంటే 8 రోజులుగా రూ.400 కోట్ల మేర మార్కెట్‌కు నష్టం వాటిల్లిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ వినియోగదారులు తమ వద్ద ఉన్న నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకే ప్రాధాన్యతనివ్వడంతో వ్యాపారం అనూహ్యంగా దెబ్బతిందని వాపోయారు. ప్రస్తుతం బేగంబజార్‌లోని పలు వీధులు కొనుగోలుదారులు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. అంతేకాదు పలు దుకాణాల్లో వ్యాపారులు మినహా కొనుగోలు దారులు లేకపోవడం గమనార్హం. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే తాము నెలవారీ దుకాణ అద్దెలు, పనివాళ్ల వేతనాలు చెల్లించడమూ కష్టతరమౌతోందని పలువురు వ్యాపారులు వాపోయారు. బేగంబజార్‌లోని జయశ్రీ మ్యాచింగ్ సెంటర్. అన్ని రకాల మ్యాచింగ్ వస్రా్తలతో పాటు, రెడీమేడ్ దుస్తులు విక్రయిస్తారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వ్యాపారులు, నగరంలోని వినియోగదారులు ఈ మ్యాచింగ్ సెంటర్ నుంచి పెద్ద మొత్తంలోనే కొనుగోలు చేస్తారు. అలాంటి జయశ్రీ మ్యాచింగ్ సెంటర్లో వారం రోజులుగా అమ్మకాలు నిలిచిపోయాయి. దివాలా తీస్తున్నాం రోజుకు 10 మంది వినియోగదారులు కూడా రావడం లేదు. చిల్లర కొరత పెద్ద సమస్యగా మారింది. రోజుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిగిన వ్యాపారం ఇప్పుడు ఏకంగా రూ.5000లకు పడిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్కర్లు ఎలాంటి పని లేకుండా కాలక్షేపం చేయాల్సి వస్తోంది. హోల్‌సేల్‌గా కొనుగోలు చేసేవాళ్లు కూడా రావడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో సర్జికల్ దాడి జరిగింది నల్ల డబ్బు ఉన్న వాళ్లపైనా, లేక వ్యాపారులు, సగటు పేద, మధ్య తరగతి వర్గాలపైనా అనేది అంతుబట్టకుండా ఉంది. – నారాయణ, షాపు నిర్వాహకుడు గోటి జ్యువెలర్స్. పెళ్లిళ్లు, వేడుకలకు, అన్ని రకాల శుభకార్యాలయాలకు అవసరమైన బంగారు, వెండి ఆభరణాలను అందజేస్తారు. నిజానికి బేగంబజార్‌లో దొరకని వస్తువంటూ లేదు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. బట్టలు, బంగారు ఆభరణాలకు మంచి గిరాకీ ఉండే రోజులు ఇవి. కానీ గోటీ జ్యువెలర్స్ వ్యాపారం స్తంభించింది. వ్యాపారం సున్నా ఒక్కటంటే ఒక్క ఆభరణం కూడా ఈ వారంలో అమ్మలేదు. ప్రతి రోజు ఉదయం షాపు తెరుస్తున్నాము.రాత్రి మూసేస్తున్నాము. అంతే. వ్యాపారం సున్నా. చాలా కష్టంగా ఉంది. ఎంతకాలం ఇలా ఉంటుందో తెలియదు. రూ.లక్షల్లో వ్యాపారం చేసిన వాళ్లం ఇప్పుడు రూ.వేలల్లో కూడా విక్రయించలేకపోతున్నాము. – అనిల్, షాపు నిర్వాహకుడు వెయ్యినోటు ఇస్తున్నారు.. చాయ్ పత్తా వ్యాపారం దివాలా తీసింది. హోల్‌సేల్‌గా కంటే ఇంటి అవసరాల కోసం కొనుగోలు చేసే వినియోగదారులే మా షాపునకు ఎక్కువగా వస్తారు. ఇప్పుడు ఒక్కరిద్దరు వస్తున్నారు. కానీ వాళ్లు కూడా పెద్ద నోట్లు తెస్తున్నారు. రూ.300 కిలో టీ పొడి కోసం రూ.1000 నోటు తెస్తే మిగతా రూ.700 నేను ఎక్కడి నుంచి తేవాలి. చిల్లర లేక గిరాకీని వదులుకుంటున్నాను. – ప్రేమ్ డాగా, టీ పొడి వ్యాపారి 50 శాతం పడిపోయింది చాలా ఏళ్లుగా అన్ని రకాల స్టీలు, రాగి, ఇత్తడి సామగ్రి హోల్‌సేల్‌గా, రిటేల్‌గా విక్రయిస్తున్నాము. ఇటీవల కాలంలో ఇలాంటి కుదుపును చూడలేదు. సగానికి సగం గిరాకీ దెబ్బతింది. పెళ్లిళ్ల సీజన్ కదా. ప్రతి రోజు మా షాపు కస్టమర్లతో కిక్కిరిసిపోయేది. ప్రతి రోజు రూ.లక్షల్లో వ్యాపారం చేసే వాళ్లం ఇప్పుడు రూ.50 వేల కంటే ఎక్కువ బిజినెస్ కావడం లేదు. – సయ్యద్ ఫరీద్, స్టీల్ దుకాణం వ్యాపారి వస్త్రాల వ్యాపారానికి కష్టకాలమే 6 నెలల క్రితమే షాపు తెరిచాం. రంజాన్, దసరా, దీపావళి పండుగలకు మంచి గిరాకీ ఉండింది. చాలా సంతోషంగా అనిపించింది. కానీ వారం, పది రోజుల నుంచి దారుణంగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ కదా మంచి గిరాకీ ఉంటుందనుకున్నాము. హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక నుంచి రిటైల్ వ్యాపారులు ఇక్కడికి వస్తారు. వారం నుంచి ఎవ్వరూ రావడం లేదు. – శైలేందర్, వస్త్రాల వ్యాపారి ఇల్లు గడవడమే కష్టం.. ఐదారేళ్ల నుంచి ఇక్కడ హమాలీగా పని చేస్తున్నాను. ఏ రోజూ ఇలాంటి ఇబ్బంది రాలేదు. రోజుకు రూ.400 కూలీ దొరికేది. ఇప్పుడు వారం నుంచి కూలీ లేదు. పూట గడవడం కష్టంగా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదు. – జహీరుద్దీన్, హమాలీ -
ఆర్బీఐ నిబంధనలు పాటించని మహేశ్ బ్యాంకు!
అబిడ్స్: ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా మహేశ్ బ్యాంకు యాజమాన్యం సామాన్య జనాలను ఇబ్బంది పెడుతోందని పలువురు ఆరోపించారు. ఆదివారం బేగంబజార్‌తోపాటు పలు చోట్ల ఉన్న మహేశ్‌బ్యాంకు శాఖలకు నగదు మార్పిడి కోసం వచ్చిన జనాలను సిబ్బంది పట్టించుకోలేదు. కేవలం ఖాతాదారులకు మాత్రమే తాము నగదు మార్పిడి చేస్తామని చెప్పకొచ్చారు. దీంతో గంటలతరబడి క్యూలో నిల్చున్న వారు ఇబ్బందిపడ్డారు. ఈ విషయమై బేగంబజార్ మహేష్ బ్యాంక్ వద్ద గంటల తరబడి లైన్లో నిలబడ్డ పాతబస్తీకి చెందిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మహేష్ బ్యాంక్‌పై ఆర్బీఐలో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. మహేష్బ్యాంక్లో ఉన్న సీసీ ఫుటేజీలను చూస్తే బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, ప్రజలకు డబ్బులు ఇవ్వకుండా వెనక్కు పంపుతున్న దృశ్యాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు. -
టపాసుల గోడౌన్లో అగ్ని ప్రమాదం
అబిడ్స్/దత్తాత్రేయనగర్: బేగంబజార్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫీల్‌ఖానా నింబూ మార్కెట్ ఎదురుగా ఉన్న టపాసుల గోడౌన్లో శనివారం మధ్యాహ్నం భారీ మంటలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దుకాణ యజమాని టపాకాయలు విక్రయిస్తుండగా మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల్లోనే భారీ శబ్దాలు రావడంతో స్థానిక వ్యాపారులు, కొనుగోలుదారులు పరుగులు పెట్టారు. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు రెండో, మూడో అంతస్తుల్లోని టాయిస్ గోడౌన్‌లోకి విస్తరించాయి. తోటి వ్యాపారులు దుకాణాలను మూసేసి మంటలు ఆర్పేందుకు సహకరించారు. లెసైన్ ్సలతోనే... శ్రీనివాస ఏజెన్సీ పేరిట రమేష్ గుప్తా చెన్నై ఎక్స్‌ప్లోజివ్ శాఖ లెసైన్స్‌తో టపాసుల హోల్‌సేల్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. మొదటి అంతస్తులో నిబంధనలకు విరుద్ధంగా గోడౌన్ పెట్టడంతో ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఇనుప బక్కెట్లు, నీరు, మంటలు ఆర్పే పరికరాలు లేకపోవడంతో ఫైరింజన్లు వచ్చేవరకు మంటలు అదుపులోకి రాలేదు. దాదాపు రూ.4 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు. యజమానిపై కఠిన చర్యలు - డీసీపీ దుకాణ యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించి మంటలను ఆర్పేందుకు సహకరించిన వ్యాపారులు, స్థానికులను ఆయన ప్రశంసించారు. టపాకాయల దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైదానాల్లోనే తాత్కాలిక టపాకాయల దుకాణాలకు అనుమతిస్తామన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో దుకాణాలకు అనుమతి ఎలా వచ్చిందో పూర్తి విచారణ చేపడతామన్నారు. రమేష్ గుప్తా పై కేసు నమోదుచేసినట్లు డీసీపీ తెలిపారు. నిబంధనలు పాటించండి-ఫైర్ అధికారి టపాసుల దుకాణాల వారు నిబంధనలు పాటించి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ అసిస్టెంట్ ఫైర్ అధికారి ఎం.భగవాన్‌రెడ్డి పేర్కొన్నారు. సమాచారం అందింన వెంటనే ఆరు ఫైరింజన్లను రప్పించామన్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పినట్లు వివరించారు. సంఘటనలు ఎన్నెన్నో... ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో టపాసుల దుకాణాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. 2002లో ఉస్మాన్‌గంజ్‌లోని శాంతి ఫైర్ వర్క్స్ టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించి 13 మంది మృతి చెందారు. ఐదేళ్ల క్రితం గోషామహాల్ చందన్‌వాడీలో ఓ ఇంట్లో టపాకాయలు తయారు చేస్తుండగా నలుగురు మృతి చెందారు. అలాగే మూడేళ్ల క్రితం బేగంబజార్ ఛత్రీ ప్రాంతంలోని హోల్‌సేల్ దుకాణంలో మంటలు చెలరేగి టపాకాయలు కాలిబూడిదయ్యాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. శాంతి ఫైర్ వర్క్స్ ఘటన సమయంలో మంత్రులు, ఉన్నతాధికారులు పలు ప్రకటనలు చేసినా అవి నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో వ్యాపారం.. అనుమతులు చెన్నైలో.. టపాకాయల హోల్‌సేల్ వ్యాపారం నిర్వహించాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెన్నైలో ఎక్స్‌ప్లోజివ్ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. ఈ అనుమతి ఉంటేనే హోల్‌సేల్ దుకాణాలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ శాఖ అనుమతి సునాయాసంగా తీసుకువస్తున్న కొంతమంది, జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రద్దీ ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేయకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఈ రేయి మల్లెలది..
సమయం అర్ధరాత్రి 12.30. బేగంబజార్ ప్రాంతం.. పొద్దంతా ఎడతెగని లావాదేవీలతో కోలాహలంగా ఉండే ఆ ప్రాంతం నిశిరాత్రిలో నిశ్శబ్దంలోకి జారుకుంటుంది. జామురాతిరి జాబిలమ్మ నీలాకాశంలో వెన్నెల పరచిన వేళ.. నింగిలోని తారకలను గేలి చేస్తూ.. బేగంబజార్‌లో మల్లెలు వికసిస్తాయి. ఆ పూల పరిమళాలు.. వలపు సీమలో కొత్త తలపులకు తలుపులు తెరుస్తాయి. మాలికగా మారిన మల్లికలు.. మధుమాసాన్ని మన ముందుంచుతాయి. అటుగా వెళ్తే చాలు.. గమ్మత్తయిన పరిమళం గుబాళిస్తూ మనసును గుమ్మెత్తిస్తుంది. - త్రిగుళ్ల నాగరాజు హేమంతానికి చామంతులు నేస్తాలైతే, వసంతానికి మలె ్లలు దోస్తులు. బేగంబజార్ వీధులకు మాత్రం మల్లెలు, సన్నజాజులు నిత్య అతిథులు. మలి సంధ్య వెలుగు మసకబారుతున్న వేళలో పరిమళాలు వెదజల్లుతూ మల్లెలు అక్కడకు చేరుకుంటాయి. అమ్మకానికి రోడ్డు పక్క బుట్టలు బుట్టలుగా సిద్ధమవుతాయి. రాత్రి పొద్దుపోయే వరకు ఆ దారిలో వచ్చి పోయేవారికి సువాసన విసురుతుంటాయి. కొనుగోలుదారుల్లో కోటి ఆశలు చిగురింపజేస్తాయి. జీవితం పూలబాట బేగంబజార్ వీధుల్లో కొందరు ఈ మల్లెలనే జీవనాధారంగా చేసుకున్నారు. ఇక్కడ.. విజయవాడ నుంచి వచ్చిన బొండుమల్లెలను హారంగా మార్చి అమ్మకానికి ఉంచుతారు. ఉప్పల్, శంషాబాద్, నగర శివార్ల నుంచి వచ్చిన సన్నజాజులను విక్రయిస్తారు. గుడిమల్కాపూర్ పూల మార్కెట్ నుంచి ఈ పూలను తీసుకువస్తుంటారు. వసంతంలో విరిసే మల్లెలు.. ఇక్కడ మాత్రం శరద్కాంతులు ప్రసరించే ఆశ్వీయుజ మాసం (సెప్టెంబర్) వరకు అందుబాటులో ఉంటాయి. ఇక సన్నజాజులైతే, ఏడాదంతా కనువిందు చేస్తాయి. బేగంబజార్‌తో పాటు చాదర్‌ఘాట్ మూసీ వంతెన మీద, మెహదీపట్నం రైతుబజార్ దగ్గర కూడా అర్ధరాత్రి మల్లెల విక్రయాలు సాగుతుంటాయి. భక్తికి.. అనురక్తికి.. అర్ధరాత్రి దాటే వరకు సాగే ఈ వ్యాపారంలో ఎందరో వచ్చిపోతుంటారు. కొందరు ఈ పూలను దేవుడికి భక్తిగా సమర్పించడానికి తీసుకుంటే.. ఇంకొందరు దేవేరిపై అనురక్తితో తీసుకెళ్తుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ముగించుకుని రాత్రి పొద్దుపోయాక ఇంటికి వెళ్లే వారు ఇక్కడకు రాగానే ఆగిపోతారు. ఇంటికి వెళ్లడం మరీ ఆలస్యమైతే తప్పక ఆగాల్సిందే. ఈ మల్లెలు తీసుకుని ఇల్లాలి కొప్పున తురిమి ఆలస్యానికి క్షమాపణలు వేడుకోవాల్సిందే. మరో ఆకర్షణ సంధ్యారాగపు సరిగమలతో మొదలయ్యే పూల వ్యాపారం.. రాత్రి ఒంటి గంట, రెండు గంటలు కూడా దాటుతుంది. చూస్తుండగానే మూరలకు మూరలు అమ్ముడవుతుంటాయి. ఒక్కోసారి అరమూర కూడా అమ్ముడు కాదు. ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలున్న బేగంబజార్‌కు ఈ మల్లెలు మరో ఆకర్షణగా నిలుస్తున్నాయి. -
పాల కేంద్రాలు.. ప్రత్యేక బస్సులు
లాలాపేట, న్యూస్‌లైన్/సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని లాలాపేటలోని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జంట నగరాల్లో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు విక్రయాలు కొనసాగుతాయి. లీటర్ రూ.32 చొప్పున పాలను విడిగానూ, ప్యాకెట్ రూపంలోనూ విక్రయిస్తామని విజయడైరీ ఎండీ డాక్టర్ మహ్మద్ అలీరఫత్ బుధవారం తెలిపారు. విడిగా పాలు విక్రయించే కేంద్రాలు: నాంపల్లి, ఆజంపుర, దారుల్షిఫా, బేగంబజార్, బహదూర్‌పుర, సనత్‌నగర్, హెచ్ఏఎల్ క్యాంపస్, అమన్‌నగర్, చార్మినార్, ఫలక్‌నుమా, ముషీరాబాద్, చంచల్‌గూడ, యాకుత్‌పుర, గోల్కొండ, మెహిదీపట్నం, టోలిచౌకి, రాంగోపాల్‌పేట, పంజగుట్ట, సచివాలయం, ఎర్రగడ్డ, బోరబండ, ఏసీగార్డ్స్, మల్లేపల్లి, చిలకలగూడ, మౌలాలి. ప్యాకెట్ పాల విక్రయ కేంద్రాలు: కేపీహెచ్‌బీ కాలనీ, బోయిన్పల్లి, పటాన్చెరు, చాంద్రాయణగుట్ట, మోతీగల్లి, షమ థియేటర్, కాలాపత్తర్, సైదాబాద్, రెయిన్‌బజార్, నల్గొండ క్రాస్‌రోడ్డు, మాదన్నపేట, మురాద్‌నగర్, జానకినగర్, శశిగార్డెన్, సయ్యద్‌నగర్, టప్పాచపుత్ర, సీతారాంబాగ్, రాజ్‌భవన్, సోమాజిగూడ, ఖైరతాబాద్, బోరబండ, సుల్తాన్‌నగర్, మాణికేశ్వరినగర్, నార్త్‌లాలాగూడ, వారాసిగూడ, హెచ్ఎంటీనగర్, తార్నాక, శాంతినగర్. వివరాలకు ఫోన్: 040-27019851, 040-64643133, 9848172642, 9848172640, 9912526611. ఈద్గాకు ప్రత్యేక బస్సులు రంజాన్ సందర్భంగా శుక్రవారం మీరాలం ఈద్గా వద్ద జరిగే ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనల్లో పాల్గొనే ముస్లిం సోదరుల కోసం 36 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి వివిధ ప్రాంతాల నుంచి బయల్దేరి ఉదయం 9 గంటలకు ఈద్గాకు చేరతాయి. నమాజు అనంతరం సైతం ఇవి అందుబాటులో ఉంటాయి.