ఈ రేయి మల్లెలది..
సమయం అర్ధరాత్రి 12.30. బేగంబజార్ ప్రాంతం.. పొద్దంతా ఎడతెగని లావాదేవీలతో కోలాహలంగా ఉండే ఆ ప్రాంతం నిశిరాత్రిలో నిశ్శబ్దంలోకి జారుకుంటుంది. జామురాతిరి జాబిలమ్మ నీలాకాశంలో వెన్నెల పరచిన వేళ.. నింగిలోని తారకలను గేలి చేస్తూ..
బేగంబజార్‌లో మల్లెలు వికసిస్తాయి. ఆ పూల పరిమళాలు.. వలపు సీమలో కొత్త తలపులకు తలుపులు తెరుస్తాయి. మాలికగా మారిన మల్లికలు.. మధుమాసాన్ని మన ముందుంచుతాయి. అటుగా వెళ్తే చాలు.. గమ్మత్తయిన పరిమళం గుబాళిస్తూ మనసును గుమ్మెత్తిస్తుంది. - త్రిగుళ్ల నాగరాజు
హేమంతానికి చామంతులు నేస్తాలైతే, వసంతానికి మలె ్లలు దోస్తులు. బేగంబజార్ వీధులకు మాత్రం మల్లెలు, సన్నజాజులు నిత్య అతిథులు. మలి సంధ్య వెలుగు మసకబారుతున్న వేళలో పరిమళాలు వెదజల్లుతూ మల్లెలు అక్కడకు చేరుకుంటాయి.
అమ్మకానికి రోడ్డు పక్క బుట్టలు బుట్టలుగా సిద్ధమవుతాయి. రాత్రి పొద్దుపోయే వరకు ఆ దారిలో వచ్చి పోయేవారికి సువాసన విసురుతుంటాయి.
కొనుగోలుదారుల్లో కోటి ఆశలు చిగురింపజేస్తాయి. జీవితం పూలబాట బేగంబజార్ వీధుల్లో కొందరు ఈ మల్లెలనే జీవనాధారంగా చేసుకున్నారు. ఇక్కడ.. విజయవాడ నుంచి వచ్చిన బొండుమల్లెలను హారంగా మార్చి అమ్మకానికి ఉంచుతారు. ఉప్పల్, శంషాబాద్, నగర శివార్ల నుంచి వచ్చిన సన్నజాజులను విక్రయిస్తారు. గుడిమల్కాపూర్ పూల మార్కెట్ నుంచి ఈ పూలను తీసుకువస్తుంటారు. వసంతంలో విరిసే మల్లెలు.. ఇక్కడ మాత్రం శరద్‌కాంతులు ప్రసరించే ఆశ్వీయుజ మాసం (సెప్టెంబర్) వరకు అందుబాటులో ఉంటాయి. ఇక సన్నజాజులైతే, ఏడాదంతా కనువిందు చేస్తాయి. బేగంబజార్‌తో పాటు చాదర్‌ఘాట్ మూసీ వంతెన మీద, మెహదీపట్నం రైతుబజార్ దగ్గర కూడా అర్ధరాత్రి మల్లెల విక్రయాలు సాగుతుంటాయి.
భక్తికి.. అనురక్తికి..
అర్ధరాత్రి దాటే వరకు సాగే ఈ వ్యాపారంలో ఎందరో వచ్చిపోతుంటారు. కొందరు ఈ పూలను దేవుడికి భక్తిగా సమర్పించడానికి తీసుకుంటే.. ఇంకొందరు దేవేరిపై అనురక్తితో తీసుకెళ్తుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ముగించుకుని రాత్రి పొద్దుపోయాక ఇంటికి వెళ్లే వారు ఇక్కడకు రాగానే ఆగిపోతారు. ఇంటికి వెళ్లడం మరీ ఆలస్యమైతే తప్పక ఆగాల్సిందే. ఈ మల్లెలు తీసుకుని ఇల్లాలి కొప్పున తురిమి ఆలస్యానికి క్షమాపణలు వేడుకోవాల్సిందే.
మరో ఆకర్షణ
సంధ్యారాగపు సరిగమలతో మొదలయ్యే పూల వ్యాపారం.. రాత్రి ఒంటి గంట, రెండు గంటలు కూడా దాటుతుంది. చూస్తుండగానే మూరలకు మూరలు అమ్ముడవుతుంటాయి. ఒక్కోసారి అరమూర కూడా అమ్ముడు కాదు. ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలున్న బేగంబజార్‌కు ఈ మల్లెలు మరో ఆకర్షణగా నిలుస్తున్నాయి.