వింబుల్డన్ విజేతగా చెక్ రిపబ్లిక్ ప్లేయర్
ఫైనల్లో ఓడిన జాస్మిన్ పావొలిని
లండన్: ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా క్రెజికోవా తన తొలి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి సారి వింబుల్డన్ ఫైనల్ చేరిన ఇద్దరు ప్లేయర్ల మధ్య శనివారం జరిగిన ఫైనల్లో క్రెజికోవా 6–2, 2–6, 6–4 స్కోరులో ఏడో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)పై విజయం సాధించింది.
1 గంటా 56 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మూడు సెట్‌ల సమరంలో 28 ఏళ్ల చెక్ ప్లేయర్ పైచేయి సాధించింది. 2021లో ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకున్న క్రెజికోవా కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్.
వింబుల్డన్‌లో 31వ సీడ్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రెజికోవా చివరకు టైటిల్‌తో ముగించింది. ఫైనల్ పోరులో ఆరంభంలో జాస్మిన్‌పై ఆమె ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి 11 పాయింట్లలో 10 గెలుచుకొని ముందంజ వేసింది. ఆ తర్వాత డబుల్ బ్రేక్‌తో 5–1తో ఆధిక్యంలో నిలిచిన ఆమె సునాయాసంగా సెట్‌ను ముగించింది.
ఆమె జోరు చూస్తే రెండో సెట్‌లోనే మ్యాచ్ గెలిచేస్తుందని అనిపించింది. అయితే విరామ సమయంలో పావొలిని ఆట మారింది. చక్కటి గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో దూసుకుపోయి 3–0తో నిలిచి ఇటలీ ప్లేయర్ ప్రత్యర్థి ని కోలుకోనీయకుండా సెట్‌ను ముగించింది. చివరి సెట్‌లో ఆట ఆసక్తికరంగా సాగింది.
క్రెజికోవా 5–3 వద్ద ఉన్న దశలో పావొలిని గేమ్ గెలిచి కొంత పోటీనిచ్చినా...పదో గేమ్‌లో క్రెజికోవా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజేతగా అవతరించింది. క్రెజికోవా ఖాతాలో రెండు సింగిల్స్ టైటిల్స్‌తో పాటు 7 డబుల్స్, 3 మిక్స్‌డ్ డబుల్స్ ట్రోఫీలు ఉన్నాయి.
నేడు పురుషుల ఫైనల్
జొకోవిచ్ (సెర్బియా) గీ అల్‌కరాజ్ (స్పెయిన్)
సా.గం.6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment