నవంబర్ 8కి ముందు నిత్యం వంద కోట్ల వ్యాపారం
నేడు సగానికి తగ్గిన వాణిజ్యం.. రూ.50 కోట్లు దాటని వైనం
♦ గత 8 రోజులుగా రూ.400 కోట్ల వ్యాపారానికి నష్టం
♦ పని లేకపోవడంతో సిబ్బందిని తొలగిస్తున్న వ్యాపారులు
♦ కూలీ దొరకక వందల మంది అవస్థలు
♦ బహిరంగ విపణిలో పలు రంగాలపై పెను ప్రభావం చూపుతోన్న నోట్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: బేగంబజార్... ‘బేర్’మంటోంది. హైదరాబాద్‌లోనే అత్యంత రద్దీగా ఉండే మార్కెట్. రోజూ ఇసుక వేస్తే రాలనట్లు ఉండే జనం. అగ్గిపుల్ల, సబ్బుబిల్లా, ఉప్పు, పప్పు, బియ్యం, సౌందర్యసాధనాలు.. గృహోపకరణాలు, ఆటోమోబైల్స్, ఇలా అన్ని వస్తువులకు ఇది నెలవు. హోల్‌సేల్ నుంచి రిటైల్ దాకా రోజూ కోట్ల రూపాయల వ్యాపార కేంద్రం. నగరంలోని ఇతర ప్రాంతాలే కాదు... జిల్లాల వ్యాపారులకు కూడా ఇదే పెద్ద హోల్‌సేల్ మార్కెట్. వందల కోట్ల లావాదేవీలు సాగే ఈ మార్కెట్ ఇప్పుడు బోసిపోతోంది. పెద్ద నోటు ‘కాటు’తో కోలుకోలేక అవస్థలు పడుతోంది. కొందరి వ్యాపారం దెబ్బతినగా... మరికొందరికి కూలీ కరువైంది... ఇంకొందరికి ఉపాధి లేకుండా పోయింది. కళ తప్పిన బేగంబజార్ మార్కెట్‌పై బుధవారం ‘సాక్షి’ బృందం పరిశీలనాత్మక కథనం...
ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు అవసరమైన వస్తువుల కొనుగోళ్లు.... వేలాది మంది వ్యాపారుల రాకపోకలతో నిత్యం కళకళలాడే ఈ మార్కెట్ ఇప్పుడు వెలవెలబోతోంది. పెద్ద నోట్ల రద్దుతో ఈ బహిరంగ మార్కెట్‌లో హోల్‌సేల్, రిటైయిల్ వ్యాపారం దారుణంగా పడిపోయింది. నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దుకు ముందు బేగంబజార్, సిద్ధి అంబర్‌బజార్, మహరాజ్‌గంజ్, కిషన్గంజ్, ముక్తార్‌గంజ్ తదితర ప్రాంతాల్లో నిత్యం వందల కోట్ల వ్యాపారం జరిగేది. ప్రస్తుతం రూ.50 కోట్లు దాటడం లేదు. దేశంలో 14 శాతం మేర ఉన్న నల్ల కుబేరుల భరతం పట్టేందుకు 86 శాతం మేర ఉన్న సామాన్యులపై సర్జికల్ స్ట్రైక్స్ చేయడం దారుణమని వాపోయారు.
8 రోజులుగా రూ.400 కోట్ల నష్టం...
బేగంబజార్‌లోని ఏడు డివిజన్ల పరిధిలో సుమారు ఐదువేల హోలోసేల్ దుకాణా సముదాయాలుంటాయి. ఇందులో కిరాణా, జువెల్లరీ, వస్రా్తలు, స్టీలు, సిమెంటు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు, టైర్లు, ఎలక్ట్రికల్, పప్పు దినుసులు, మసాలా, డ్రైఫ్రూట్స్, ఆటోమోబైల్స్, నూనెలు, లూబ్రికెంట్స్, పాన్మసాలా, ఫర్టిలైజర్, కాస్మోటిక్స్, స్టెయిన్లెస్‌స్టీల్ తదితర రంగాలకు సంబంధించిన దుకాణాలున్నాయి. వీటిల్లో నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దుకు ముందు రోజువారీగా సుమారు రూ.100 కోట్ల వ్యాపారం జరిగేది. నిత్యం సుమారు లక్షమంది రిటైల్ వ్యాపారులు, కొనుగోలుదారులు ఈ మార్కెట్‌కు వచ్చిపోయేవారు.
కానీ పెద్ద నోట్ల రద్దుతో సీన్ రివర్సైంది. మార్కెట్‌లో కొనుగోళ్లు పడిపోయాయి. కొనుగోలు దారులు, రిటైలర్ల రాకపోకలు సగానికి పైగా తగ్గాయి. రూ.500, రూ.వెయ్యి నోట్ల రద్దుతో ఈ నోట్లను వ్యాపారులు స్వీకరించకపోవడంతో అమ్మకాల విలువ నిత్యం రూ.50 కోట్ల మేరకు పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. అంటే 8 రోజులుగా రూ.400 కోట్ల మేర మార్కెట్‌కు నష్టం వాటిల్లిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ వినియోగదారులు తమ వద్ద ఉన్న నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకే ప్రాధాన్యతనివ్వడంతో వ్యాపారం అనూహ్యంగా దెబ్బతిందని వాపోయారు. ప్రస్తుతం బేగంబజార్‌లోని పలు వీధులు కొనుగోలుదారులు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. అంతేకాదు పలు దుకాణాల్లో వ్యాపారులు మినహా కొనుగోలు దారులు లేకపోవడం గమనార్హం. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే తాము నెలవారీ దుకాణ అద్దెలు, పనివాళ్ల వేతనాలు చెల్లించడమూ కష్టతరమౌతోందని పలువురు వ్యాపారులు వాపోయారు.
బేగంబజార్‌లోని జయశ్రీ మ్యాచింగ్ సెంటర్. అన్ని రకాల మ్యాచింగ్ వస్రా్తలతో పాటు, రెడీమేడ్ దుస్తులు విక్రయిస్తారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వ్యాపారులు, నగరంలోని వినియోగదారులు ఈ మ్యాచింగ్ సెంటర్ నుంచి పెద్ద మొత్తంలోనే కొనుగోలు చేస్తారు. అలాంటి జయశ్రీ మ్యాచింగ్ సెంటర్‌లో వారం రోజులుగా అమ్మకాలు నిలిచిపోయాయి.
దివాలా తీస్తున్నాం
రోజుకు 10 మంది వినియోగదారులు కూడా రావడం లేదు. చిల్లర కొరత పెద్ద సమస్యగా మారింది. రోజుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిగిన వ్యాపారం ఇప్పుడు ఏకంగా రూ.5000లకు పడిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్కర్లు ఎలాంటి పని లేకుండా కాలక్షేపం చేయాల్సి వస్తోంది. హోల్‌సేల్‌గా కొనుగోలు చేసేవాళ్లు కూడా రావడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో సర్జికల్ దాడి జరిగింది నల్ల డబ్బు ఉన్న వాళ్లపైనా, లేక వ్యాపారులు, సగటు పేద, మధ్య తరగతి వర్గాలపైనా అనేది అంతుబట్టకుండా ఉంది.
– నారాయణ, షాపు నిర్వాహకుడు
గోటి జ్యువెలర్స్. పెళ్లిళ్లు, వేడుకలకు, అన్ని రకాల శుభకార్యాలయాలకు అవసరమైన బంగారు, వెండి ఆభరణాలను అందజేస్తారు. నిజానికి బేగంబజార్‌లో దొరకని వస్తువంటూ లేదు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. బట్టలు, బంగారు ఆభరణాలకు మంచి గిరాకీ ఉండే రోజులు ఇవి. కానీ గోటీ జ్యువెలర్స్ వ్యాపారం స్తంభించింది.
వ్యాపారం సున్నా
ఒక్కటంటే ఒక్క ఆభరణం కూడా ఈ వారంలో అమ్మలేదు. ప్రతి రోజు ఉదయం షాపు తెరుస్తున్నాము.రాత్రి మూసేస్తున్నాము. అంతే. వ్యాపారం సున్నా. చాలా కష్టంగా ఉంది. ఎంతకాలం ఇలా ఉంటుందో తెలియదు. రూ.లక్షల్లో వ్యాపారం చేసిన వాళ్లం ఇప్పుడు రూ.వేలల్లో కూడా విక్రయించలేకపోతున్నాము.
– అనిల్, షాపు నిర్వాహకుడు
వెయ్యినోటు ఇస్తున్నారు..
చాయ్ పత్తా వ్యాపారం దివాలా తీసింది. హోల్‌సేల్‌గా కంటే ఇంటి అవసరాల కోసం కొనుగోలు చేసే వినియోగదారులే మా షాపునకు ఎక్కువగా వస్తారు. ఇప్పుడు ఒక్కరిద్దరు వస్తున్నారు. కానీ వాళ్లు కూడా పెద్ద నోట్లు తెస్తున్నారు. రూ.300 కిలో టీ పొడి కోసం రూ.1000 నోటు తెస్తే మిగతా రూ.700 నేను ఎక్కడి నుంచి తేవాలి. చిల్లర లేక గిరాకీని వదులుకుంటున్నాను.
– ప్రేమ్ డాగా,
టీ పొడి వ్యాపారి
50 శాతం పడిపోయింది
చాలా ఏళ్లుగా అన్ని రకాల స్టీలు, రాగి, ఇత్తడి సామగ్రి హోల్‌సేల్‌గా, రిటేల్‌గా విక్రయిస్తున్నాము. ఇటీవల కాలంలో ఇలాంటి కుదుపును చూడలేదు. సగానికి సగం గిరాకీ దెబ్బతింది. పెళ్లిళ్ల సీజన్ కదా. ప్రతి రోజు మా షాపు కస్టమర్లతో కిక్కిరిసిపోయేది. ప్రతి రోజు రూ.లక్షల్లో వ్యాపారం చేసే వాళ్లం ఇప్పుడు రూ.50 వేల కంటే ఎక్కువ బిజినెస్ కావడం లేదు.
– సయ్యద్ ఫరీద్,
స్టీల్ దుకాణం వ్యాపారి
వస్త్రాల వ్యాపారానికి కష్టకాలమే
6 నెలల క్రితమే షాపు తెరిచాం. రంజాన్, దసరా, దీపావళి పండుగలకు మంచి గిరాకీ ఉండింది. చాలా సంతోషంగా అనిపించింది. కానీ వారం, పది రోజుల నుంచి దారుణంగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ కదా మంచి గిరాకీ ఉంటుందనుకున్నాము.
హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక నుంచి రిటైల్ వ్యాపారులు ఇక్కడికి వస్తారు. వారం నుంచి ఎవ్వరూ రావడం లేదు.
– శైలేందర్, వస్త్రాల వ్యాపారి
ఇల్లు గడవడమే కష్టం..
ఐదారేళ్ల నుంచి ఇక్కడ హమాలీగా పని చేస్తున్నాను. ఏ రోజూ ఇలాంటి ఇబ్బంది రాలేదు. రోజుకు రూ.400 కూలీ దొరికేది. ఇప్పుడు వారం నుంచి కూలీ లేదు. పూట గడవడం కష్టంగా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
– జహీరుద్దీన్, హమాలీ
బేగంబజార్.. బేజార్!
Published Thu, Nov 17 2016 3:01 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
Advertisement
Advertisement