ముంబై: విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ఆసియా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ మంగళవారం అరశాతం పతనమైంది. అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒకశాతానికి పైగా క్షీణించి సూచీలను నష్టాల వైపు నడిపించాయి. సెన్సెక్స్ 316 పాయింట్లు క్షీణించి 65,512 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 19,529 వద్ద నిలిచింది.
3 రోజుల వరుస సెలవుల తర్వాత స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 484 పాయింట్లు పతనమై 65,345 వద్ద, నిఫ్టీ 158 పాయింట్లు క్షీణించి 19,480 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రైవేట్ బ్యాంకింగ్, ఆటో, ఐటీ స్టాకులు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, మీడియా, రియల్టి, కన్జూ్యమర్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,034 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,361 కోట్ల షేర్లను కొన్నారు. వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
- ఆర్‌బీఐ పాలసీ, కార్పొరేట్ క్యూ2 ఫలితాల ప్రకటనకు ముందు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లకు భారీ డిమాండ్ లభించింది. యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్, పీఎన్‌బీ, పీఎస్‌బీ, ఐఓబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 5–3% ర్యాలీ చేశాయి. యుకో బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 2% లాభపడ్డాయి. ఎస్‌బీఐ బ్యాంక్ షేరు ఒకశాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్ రెండున్నర శాతం ర్యాలీ చేసింది
- కేంద్ర పెట్రోలియం శాఖ దేశీయ సహజ వాయువు ధరలు 7% పెంచడంతో ఓఎన్‌బీసీ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య రికవరీ సైతం ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా ఈ షేరు బీఎస్‌ఈలో 4% నష్టపోయి రూ.185 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 4.50% క్షీణించి రూ.184 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇండెక్సుల్లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే.
- ఐషర్ మోటార్స్ షేరు 3% నష్టపోయి రూ.3351 వద్ద స్థిరపడింది. మోటార్ సైకిళ్ల అమ్మకాలు సెపె్టంబర్లో తగ్గిపోవడం షేరు పతనానికి కారణమైంది.
హిట్... ఫ్లాట్
- నష్టాల మార్కెట్లోనూ జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ లిస్టింగ్ బంపర్ హిట్ కొట్టింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.119)తో పోలిస్తే 20% ప్రీమియంతో రూ.143 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్ ఆద్యంతం కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా షేరు 32.18% ర్యాలీ చేసి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.157 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.33,033 కోట్లుగా స్థిరపడింది. ఎక్సే్చంజీలో మొత్తం 57.99 లక్షల ఈక్విటీ షేర్లను చేతులు మారాయి.
- మనోజ్ వైభవ్ జెమ్స్ ఎన్ జ్యువెలర్స్ షేరు ఫ్లాటుగా లిస్టయింది. ఇష్యూ ధర (రూ.215)తో పోలిస్తే బీఎస్‌ఈలో లాభ, నష్టాలు లేకుండా రూ.215 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.210–222 మధ్య ట్రేడైంది. చివరికి 0.30% స్వల్ప లాభంతో రూ.216 వద్ద క్లోజైంది. మార్కె ట్ విలువ రూ.1,053 కోట్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment