క్యుములోనింబస్ కుమ్మేసింది..
సాక్షి, హైదరాబాద్: క్యుములోనింబస్ మేఘాల ఉధృతి అధికంగా ఉండటం, నైరుతి, దక్షిణ దిశ నుంచి వీస్తున్న తేమగాలుల కారణంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తడిసిముద్దయ్యింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కుండపోత వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బేగంపేట్, ముషీరాబాద్, బోయిన్పల్లి, పటాన్చెరు, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కొత్తపేట్, ఉప్పల్, కర్మన్‌ఘాట్, హయత్‌నగర్ ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు, భారీ హోర్డింగ్‌లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ పునరుద్ధరణ చర్యలకు వర్షం ఆటంకంగా మారడంతో చాలా ప్రాంతాల్లో రాత్రంతా అంధకారం అలముకుంది. మరోవైపు భారీ వర్షం కారణంగా పలు ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. దీంతో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని ప్రయాణికులు, వాహనదారులు విలవిల్లాడారు. గంటకు 38 నాట్స్ వేగంతో ప్రచండ గాలులు వీచినట్లు బేగంపేట్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పలు ప్రాంతాల్లో అంధకారం..
ఓల్డ్‌సిటీలోని పలు ప్రాంతాలు, ఎల్బీనగర్, మేడ్చల్, కూకట్పల్లి, యూసుఫ్‌గూడ, అంబర్పేట్, శ్రీనగర్‌కాలనీ, సికింద్రాబాద్, కొత్తపేట్, చంపాపేట్, దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, రాంనగర్, అడిక్‌మెట్, నల్లకుంట, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ఫీడర్లు ట్రిప్ అయ్యి విద్యుత్ సరఫరా స్తంభించింది. దీంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలముకుంది. చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పోలీసులు సెల్‌ఫోన్ వెలుగులోనే విధులు నిర్వహించారు. కాగా, రాగల 24 గంటల్లో నగరంతో పాటు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే పలుచోట్ల ఈదురుగాలులు, వడగళ్ల వానతో వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తిరిగి మరోసారి హెచ్చరికలు జారీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శుక్రవారం రాత్రి 8–9 గంటల మధ్యన ఖైరతాబాద్‌లో 5.2 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కురిసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాటర్‌లాగింగ్ ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు.