మూడు రోజులుగా వదలని వర్షం నగరానికి నరకం చూపుతోంది. ప్రత్యేకించి మంగళవారం మధ్యాహ్నం కురిసిన వడగళ్ల వాన వణికించింది. రహదారులన్నీ గోదారులయ్యాయి.
పాదచారులు కాలు తీసి కాలు వేయాలంటే ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక వాహనదారుల పరిస్థితి అయితే మరింత దారుణం. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భవన సెల్లార్లు, ఇళ్లలోకి నీరు చేరింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 3.5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది.
మార్చి తొలివారంలో ఈ స్థాయిలో భారీ వర్షం నమోదవడం ఐదేళ్ల తరవాత ఇదే ప్రథమమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షంతోపాటు పలు ప్రాంతాల్లో వడగళ్లు కురియడంతో సిటీజనులు నానా హైరానా పడ్డారు. కొన్ని చోట్ల వడగళ్లవానకు రహదారులపై పార్కింగ్ చేసిన వాహనాల అద్దాలు పగిలాయి. ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట్, ఎస్.ఆర్.నగర్, సికింద్రాబాద్, తార్నాక, సచివాలయం, లిబర్టీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులపై భారీగా వర్షపునీరు చేరడంతో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి.
వర్షపునీటిలో ఈదుకుంటూ ముందుకు వెళుతూ వాహనదారులు నరకయాతన అనుభవించారు. సాయంత్రం వేళ ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించడంతో సాయత్రం కార్యాలయాల నుంచి బయటికి వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది.