belarus writer
-
స్వెత్లానా అలెక్సియేవిచ్‌కు సాహితీ నోబెల్
బెలారస్ రచయిత్రికి పురస్కారం ప్రకటన స్టాక్‌హోమ్: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెక్సియేవిచ్(67)కు ప్రకటించారు. ఆమె విభిన్న స్వరాల రచనలు మన కాలంలో బాధలకు, సాహసానికి ప్రతీకలని అభివర్ణిస్తూ.. ఆమెను నోబెల్ బహుమతితో గౌరవిస్తున్నట్లు స్వీడన్‌లోని నోబెల్అకాడమీ గురువారం నాడు ప్రకటించింది. చెర్నోబిల్ విపత్తు, రెండో ప్రపంచ యుద్ధంపై ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా స్వెత్లానా చేసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఈ అనుభవాలను సాక్షుల సొంత మాటల్లోనే నమోదు చేయటం వల్ల ఆమె రచనలు అనేక భాషల్లోకి అనువాదమవటంతో పాటు అంతర్జాతీయ అవార్డులూ పొందా యి. రష్యా భాషలో రాసిన ఆమె రచనలు.. అధికారవాది అలెక్సాండర్ లుకాషెంకో పాలనలో సెన్సార్షిప్ ఉండటం వల్ల ప్రచురితం కాలేదు. నోబెల్ సాహిత్య బహుమతి అందుకున్న రచయిత్రుల్లో స్వెత్లానా 14వ వ్యక్తి. ఈ బహుమతి కింద ఆమెకు సుమారు రూ. 6.31 కోట్లు బహూకరిస్తారు. నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించనున్నారు. స్కూల్లో చదివేటపుడే విలేకరిగా...: స్వెత్లానా 1948 మే 31న ఉక్రెయిన్‌లో జన్మించారు. ఆమె తల్లి ఉక్రెయిన్ పౌరురాలు, తండ్రి బెలారస్ పౌరుడు. ఆయన సైన్యంలో పనిచేసేవారు. విధుల నుంచి వైదొలగిన తర్వాత కుటుంబం బెలోరష్యాకు వెళ్లి ఓ గ్రామంలో స్థిరపడింది. తల్లిదండ్రులు స్కూల్ టీచర్లుగా పనిచేసేవారు. స్వెత్లానా స్కూల్లో చదివేటపుడే.. నర్వోల్ పట్టణంలో స్థానిక వార్తాపత్రికకు విలేకరిగా పనిచేశారు. ఈ వృత్తిలోనే ముందుకు వెళ్లారు. వార్తాకథనాలతో పాటు కథలూ రాశారు. చెర్నోబిల్ విషాదం, అఫ్ఘానిస్థాన్‌లో సోవియట్ రష్యా యుద్ధం తదితర ఎన్నో ముఖ్యమైన ఘటనలపై ఆమె తన రచనా వ్యాసంగాన్ని కేంద్రీకరించారు. ఇందుకోసం వేలాది మంది ప్రత్యక్ష సాక్షులను ఇంటర్వ్యూ చేశారు. బెలారస్‌లోని అలెక్సాండర్ లుకాషెంకో నియంతృత్వ ప్రభుత్వం ఆమెను అనేక వేధింపులకు గురిచేసింది. దీంతో 2000 సంవత్సరంలో ఆమె బెలారస్ విడిచి పారిస్, గోథెన్బర్గ్, బెర్లిన్‌లకు వెళ్లారు. మళ్లీ 2011లో బెలారస్‌కు తిరిగివచ్చారు. -
జర్నలిస్టుకు తొలిసారి నోబెల్ బహుమతి
రక్తసిక్తమైన ప్రపంచ చరిత్రకు అద్దం పడతాయి స్వెత్లానా అలెగ్జీవి రచనలు. ఆమె కలం నుంచి కన్నీటి ధారలు కారుతాయి. యుద్ధాలు, దేశాల పతనాలు మిగిల్చిన విషాదాలు కనిపిస్తాయి. చెర్నోబిల్ విరజిమ్మిన పాషాణానికి బలవుతున్న తరతరాల జీవనగాధలను వినిపిస్తాయి. వాటిని యథాతథంగా సమకాలీన ప్రపంచానికి చాటి చెప్పడమే ఆమె రచనల ముఖ్య ఉద్దేశం. రచనా నైపుణ్యం ఉన్నప్పటికీ ఆమె ఎన్నడూ ఫిక్షన్ జోలికి వెళ్లలేదు. జీవన గమనంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను వారి మాటల ద్వారానే చెప్పించడం ఆమె సహజ శైలి. అందుకు కారణం.. ఆమె వృత్తిరీత్యా జర్నలిస్టు అవడమే. నోబెల్ అవార్డును ఆవిష్కరించాక ఆ అవార్డును గెలుచుకున్న తొలి జర్నలిస్టు ఆమే కావడం విశేషం. ఇంతవరకు సాహిత్యంలో నోబెల్ అందుకున్న మహిళల్లో ఆమె 14వ వారు. ఆమె ఉక్రెయిన్‌లోని స్టానిష్లే నగరంలో 1948, మే 31వ తేదీన జన్మించారు. తండ్రి బెలారస్‌కు చెందినవారు కాగా, తల్లి ఉక్రెయిన్ వాసి. పాఠశాల చదువు పూర్తి కాగానే పలు స్థానిక పత్రికల్లో జర్నలిస్ట్‌గా పనిచేశారు. మిన్స్క్ నగరంలో 'నేమన్' అనే సాహిత్య పత్రికలో పనిచేశారు. చెర్నోబిల్ అణు దుర్ఘటనపై పుస్తకం రాసేందుకు ఆమెకు పదేళ్లు పట్టింది. బాధితుల్లో ప్రతి ఒక్కరినీ ఇంటర్వ్యూ చేయడమే అందుకు కారణం. ఈ పుస్తకానికే ఇప్పుడు నోబెల్ సాహిత్య అవార్డు లభించింది. రెండో ప్రపంచ యుద్ధం, అఫ్ఘాన్-సోవియట్ యుద్ధం, సోవియెట్ పతనంపై ఆమె పలు పుస్తకాలు రాశారు, పలు అవార్డులు అందుకున్నారు. అదే సమయంలో జీవతంలో పలు దేశాల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. అందుకనే 2000 సంవత్సరంలో బెలారస్‌ను వీడాల్సి వచ్చింది. పారిస్, గోథెన్బర్గ్, బెర్లిన్‌లో ప్రవాస జీవితం గడిపిన ఆమె 2011లో తిరిగి మిన్స్క్ నగరానికి చేరుకొని అక్కడే స్థిరపడ్డారు. 'వాట్ ఈజ్ టు బి డన్, హూ ఈజ్ టు బి బ్లేమ్డ్' అన్న నినాదమే ఆమె రచనల్లో అంతర్లీనంగా కనిపిస్తుంది. -
బెలారస్ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్
రష్యన్ పాలనపై తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి, చెర్నోబిల్ అణుప్రమాదంలో మరణించిన వాళ్ల కోసం కన్నీటి చుక్కలు కార్చి.. వాటినే సిరాగా మార్చి పుస్తకాలు రాసిన ప్రముఖ బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెక్సివిచ్ను ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. 2015 సంవత్సరానికి గాను స్వెత్లానాకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి సారా డానియస్ ప్రకటించారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లను తన రచనల్లో ప్రతిబింబిస్తూ, రాయడంలో అపార ధైర్య సాహసాలు కనబరిచే స్వెత్లానాకు నోబెల్ బహుమతి రావడం పట్ల పలువురు సాహిత్యకారులు, విమర్శకులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, స్వెత్లానా పేరు మీద ఒక ట్విట్టర్ ఖాతాను తెరిచిన ఓ పాత్రికేయుడు.. రెండు గంటల ముందే ఆమెకు నోబెల్ బహుమతి వచ్చినట్లు ఆ పేరుమీదే ట్వీట్ చేశారు. అంటే బహుమతి ప్రకటనకు ముందే అతడికి ఈ విషయం తెలిసిపోయిందన్న మాట!