జర్నలిస్టుకు తొలిసారి నోబెల్ బహుమతి
రక్తసిక్తమైన ప్రపంచ చరిత్రకు అద్దం పడతాయి స్వెత్లానా అలెగ్జీవి రచనలు. ఆమె కలం నుంచి కన్నీటి ధారలు కారుతాయి. యుద్ధాలు, దేశాల పతనాలు మిగిల్చిన విషాదాలు కనిపిస్తాయి. చెర్నోబిల్ విరజిమ్మిన పాషాణానికి బలవుతున్న తరతరాల జీవనగాధలను వినిపిస్తాయి. వాటిని యథాతథంగా సమకాలీన ప్రపంచానికి చాటి చెప్పడమే ఆమె రచనల ముఖ్య ఉద్దేశం. రచనా నైపుణ్యం ఉన్నప్పటికీ ఆమె ఎన్నడూ ఫిక్షన్ జోలికి వెళ్లలేదు. జీవన గమనంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను వారి మాటల ద్వారానే చెప్పించడం ఆమె సహజ శైలి.
అందుకు కారణం.. ఆమె వృత్తిరీత్యా జర్నలిస్టు అవడమే. నోబెల్ అవార్డును ఆవిష్కరించాక ఆ అవార్డును గెలుచుకున్న తొలి జర్నలిస్టు ఆమే కావడం విశేషం. ఇంతవరకు సాహిత్యంలో నోబెల్ అందుకున్న మహిళల్లో ఆమె 14వ వారు. ఆమె ఉక్రెయిన్‌లోని స్టానిష్‌లే నగరంలో 1948, మే 31వ తేదీన జన్మించారు. తండ్రి బెలారస్‌కు చెందినవారు కాగా, తల్లి ఉక్రెయిన్ వాసి. పాఠశాల చదువు పూర్తి కాగానే పలు స్థానిక పత్రికల్లో జర్నలిస్ట్‌గా పనిచేశారు. మిన్స్క్ నగరంలో 'నేమన్' అనే సాహిత్య పత్రికలో పనిచేశారు.
చెర్నోబిల్ అణు దుర్ఘటనపై పుస్తకం రాసేందుకు ఆమెకు పదేళ్లు పట్టింది. బాధితుల్లో ప్రతి ఒక్కరినీ ఇంటర్వ్యూ చేయడమే అందుకు కారణం. ఈ పుస్తకానికే ఇప్పుడు నోబెల్ సాహిత్య అవార్డు లభించింది. రెండో ప్రపంచ యుద్ధం, అఫ్ఘాన్-సోవియట్ యుద్ధం, సోవియెట్ పతనంపై ఆమె పలు పుస్తకాలు రాశారు, పలు అవార్డులు అందుకున్నారు. అదే సమయంలో జీవతంలో పలు దేశాల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. అందుకనే 2000 సంవత్సరంలో బెలారస్‌ను వీడాల్సి వచ్చింది. పారిస్, గోథెన్‌బర్గ్, బెర్లిన్‌లో ప్రవాస జీవితం గడిపిన ఆమె 2011లో తిరిగి మిన్స్క్ నగరానికి చేరుకొని అక్కడే స్థిరపడ్డారు. 'వాట్ ఈజ్ టు బి డన్, హూ ఈజ్ టు బి బ్లేమ్డ్' అన్న నినాదమే ఆమె రచనల్లో అంతర్లీనంగా కనిపిస్తుంది.