Svetlana Alexievich
-
యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం
రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేసిన కొందరు సోవియట్ మహిళలు స్వెత్లానా అలెక్సీయెవిచ్కు స్వయంగా వినిపించిన అనుభవాల గాథలు ఈ పుస్తకం. 2015 నోబెల్ బహుమానం స్వెత్లానాను వరించడానికి కారణమైన రచనల్లో ఇదీ ఒకటి. 1985లో రష్యన్లో వచ్చిన దీన్ని 1988లో ప్రగతి ప్రచురణాలయం తొలిసారి తెలుగులో ప్రచురించింది. అక్టోబర్ విప్లవం జరిగి వంద సంవత్సరాలైన సందర్భంగా ‘మలుపు’ దీన్ని పునర్ముద్రించింది. ‘స్త్రీ గురించి మనకి తెలిసిందంతా ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, ‘‘కరుణ’’ అన్నదే అందుకు మిక్కిలి సరిపోయే పదం’ అంటారు అలెక్సీయెవిచ్. ‘స్త్రీకి సోదరి, భార్య, స్నేహితురాలు, అన్నింట్లోకీ అత్యున్నతమైన మాత అన్న పదాలు కూడా ఉన్నాయనుకోండి. అయితే కరుణ అన్నది యీ మాటల్లో యిమిడిలేదూ? వాటి సారాంశం, వాటి కర్తవ్యం, వాటి పరమార్థం యిదే కాదూ?’ అంటారామె. అలాంటి కరుణామూర్తి 1941 నాటి యుద్ధ కాలంలో శత్రువు మీద కాల్పులు జరిపింది, విమానం నుంచి బాంబులు విడిచింది, వంతెనలు పేల్చింది, వేగుగా పనిచేసింది, యుద్ధఖైదీలను పట్టుకుంది, శత్రువుల ప్రాణాలు కూడా తీసింది. ‘యుద్ధంలో మొత్తం 8 లక్షలకి పైగా అమ్మాయిలు యుద్ధ రంగ సైన్యాలకు చెందిన వివిధ శాఖల్లో పనిచేశారు’. ‘దారి పక్కన పూచిన ఊదారంగు పూల గుత్తులను తుపాకి బయోనెట్కు తగిలించుకు’నేంతటి సౌందర్యపిపాసులైన ఆ యువతులు అలా ప్రాణాలు ఎలా తీయగలిగారు? దానికి వారి జవాబు: ‘దేశభక్తియుత మహాయుద్ధం స్త్రీలు తమ మాతృదేశ రక్షణలో మూకుమ్మడిగా’ పాల్గొనేలా చేసింది. అంతమాత్రమే ఈ పుస్తక సారాంశం కాదు. ‘నాగలిచేత పెళ్లగింపబడిన బంగాళదుంపల మాదిరిగా’ డజన్ల కొద్దీ మృతదేహాలు పడే యుద్ధాన్ని ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? ఈ యుద్ధంతో ఇక యుద్ధం అనేదాన్ని చంపేస్తాం, అన్న భావన వీరి మాటల్లో కనిపిస్తుంది. యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం; మూలం: స్వెత్లానా అలెక్సీయెవిచ్; తెలుగు: నిడమర్తి ఉమారాజేశ్వరరావు; పేజీలు: 112; వెల: 100; ప్రతులకు: మలుపు, 2–1–1/5, నల్లకుంట, హైదరాబాద్-44. ఫోన్: 9866559868 - సాహిత్యం డెస్క్ -
జర్నలిస్టుకు తొలిసారి నోబెల్ బహుమతి
రక్తసిక్తమైన ప్రపంచ చరిత్రకు అద్దం పడతాయి స్వెత్లానా అలెగ్జీవి రచనలు. ఆమె కలం నుంచి కన్నీటి ధారలు కారుతాయి. యుద్ధాలు, దేశాల పతనాలు మిగిల్చిన విషాదాలు కనిపిస్తాయి. చెర్నోబిల్ విరజిమ్మిన పాషాణానికి బలవుతున్న తరతరాల జీవనగాధలను వినిపిస్తాయి. వాటిని యథాతథంగా సమకాలీన ప్రపంచానికి చాటి చెప్పడమే ఆమె రచనల ముఖ్య ఉద్దేశం. రచనా నైపుణ్యం ఉన్నప్పటికీ ఆమె ఎన్నడూ ఫిక్షన్ జోలికి వెళ్లలేదు. జీవన గమనంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను వారి మాటల ద్వారానే చెప్పించడం ఆమె సహజ శైలి. అందుకు కారణం.. ఆమె వృత్తిరీత్యా జర్నలిస్టు అవడమే. నోబెల్ అవార్డును ఆవిష్కరించాక ఆ అవార్డును గెలుచుకున్న తొలి జర్నలిస్టు ఆమే కావడం విశేషం. ఇంతవరకు సాహిత్యంలో నోబెల్ అందుకున్న మహిళల్లో ఆమె 14వ వారు. ఆమె ఉక్రెయిన్‌లోని స్టానిష్లే నగరంలో 1948, మే 31వ తేదీన జన్మించారు. తండ్రి బెలారస్‌కు చెందినవారు కాగా, తల్లి ఉక్రెయిన్ వాసి. పాఠశాల చదువు పూర్తి కాగానే పలు స్థానిక పత్రికల్లో జర్నలిస్ట్‌గా పనిచేశారు. మిన్స్క్ నగరంలో 'నేమన్' అనే సాహిత్య పత్రికలో పనిచేశారు. చెర్నోబిల్ అణు దుర్ఘటనపై పుస్తకం రాసేందుకు ఆమెకు పదేళ్లు పట్టింది. బాధితుల్లో ప్రతి ఒక్కరినీ ఇంటర్వ్యూ చేయడమే అందుకు కారణం. ఈ పుస్తకానికే ఇప్పుడు నోబెల్ సాహిత్య అవార్డు లభించింది. రెండో ప్రపంచ యుద్ధం, అఫ్ఘాన్-సోవియట్ యుద్ధం, సోవియెట్ పతనంపై ఆమె పలు పుస్తకాలు రాశారు, పలు అవార్డులు అందుకున్నారు. అదే సమయంలో జీవతంలో పలు దేశాల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. అందుకనే 2000 సంవత్సరంలో బెలారస్‌ను వీడాల్సి వచ్చింది. పారిస్, గోథెన్బర్గ్, బెర్లిన్‌లో ప్రవాస జీవితం గడిపిన ఆమె 2011లో తిరిగి మిన్స్క్ నగరానికి చేరుకొని అక్కడే స్థిరపడ్డారు. 'వాట్ ఈజ్ టు బి డన్, హూ ఈజ్ టు బి బ్లేమ్డ్' అన్న నినాదమే ఆమె రచనల్లో అంతర్లీనంగా కనిపిస్తుంది. -
బెలారస్ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్
రష్యన్ పాలనపై తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి, చెర్నోబిల్ అణుప్రమాదంలో మరణించిన వాళ్ల కోసం కన్నీటి చుక్కలు కార్చి.. వాటినే సిరాగా మార్చి పుస్తకాలు రాసిన ప్రముఖ బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెక్సివిచ్ను ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. 2015 సంవత్సరానికి గాను స్వెత్లానాకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి సారా డానియస్ ప్రకటించారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లను తన రచనల్లో ప్రతిబింబిస్తూ, రాయడంలో అపార ధైర్య సాహసాలు కనబరిచే స్వెత్లానాకు నోబెల్ బహుమతి రావడం పట్ల పలువురు సాహిత్యకారులు, విమర్శకులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, స్వెత్లానా పేరు మీద ఒక ట్విట్టర్ ఖాతాను తెరిచిన ఓ పాత్రికేయుడు.. రెండు గంటల ముందే ఆమెకు నోబెల్ బహుమతి వచ్చినట్లు ఆ పేరుమీదే ట్వీట్ చేశారు. అంటే బహుమతి ప్రకటనకు ముందే అతడికి ఈ విషయం తెలిసిపోయిందన్న మాట!