బెలారస్ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్
రష్యన్ పాలనపై తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి, చెర్నోబిల్ అణుప్రమాదంలో మరణించిన వాళ్ల కోసం కన్నీటి చుక్కలు కార్చి.. వాటినే సిరాగా మార్చి పుస్తకాలు రాసిన ప్రముఖ బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెక్సివిచ్ను ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. 2015 సంవత్సరానికి గాను స్వెత్లానాకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి సారా డానియస్ ప్రకటించారు.
ప్రజల కష్టాలు, కన్నీళ్లను తన రచనల్లో ప్రతిబింబిస్తూ, రాయడంలో అపార ధైర్య సాహసాలు కనబరిచే స్వెత్లానాకు నోబెల్ బహుమతి రావడం పట్ల పలువురు సాహిత్యకారులు, విమర్శకులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, స్వెత్లానా పేరు మీద ఒక ట్విట్టర్ ఖాతాను తెరిచిన ఓ పాత్రికేయుడు.. రెండు గంటల ముందే ఆమెకు నోబెల్ బహుమతి వచ్చినట్లు ఆ పేరుమీదే ట్వీట్ చేశారు. అంటే బహుమతి ప్రకటనకు ముందే అతడికి ఈ విషయం తెలిసిపోయిందన్న మాట!