యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం | Nidamarthi Uma maheswar rao Translates Svetlana Alexievich Book | Sakshi
Sakshi News home page

యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం

Published Mon, Sep 25 2017 12:38 AM | Last Updated on Mon, Sep 25 2017 12:38 AM

Nidamarthi Uma maheswar rao Translates Svetlana Alexievich Book

రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేసిన కొందరు సోవియట్‌ మహిళలు స్వెత్లానా అలెక్సీయెవిచ్‌కు స్వయంగా వినిపించిన అనుభవాల గాథలు ఈ పుస్తకం. 2015 నోబెల్‌ బహుమానం స్వెత్లానాను వరించడానికి కారణమైన రచనల్లో ఇదీ ఒకటి. 1985లో రష్యన్‌లో వచ్చిన దీన్ని 1988లో ప్రగతి ప్రచురణాలయం తొలిసారి తెలుగులో ప్రచురించింది. అక్టోబర్‌ విప్లవం జరిగి వంద సంవత్సరాలైన సందర్భంగా ‘మలుపు’ దీన్ని పునర్ముద్రించింది.

‘స్త్రీ గురించి మనకి తెలిసిందంతా ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, ‘‘కరుణ’’ అన్నదే అందుకు మిక్కిలి సరిపోయే పదం’ అంటారు అలెక్సీయెవిచ్‌. ‘స్త్రీకి సోదరి, భార్య, స్నేహితురాలు, అన్నింట్లోకీ అత్యున్నతమైన మాత అన్న పదాలు కూడా ఉన్నాయనుకోండి. అయితే కరుణ అన్నది యీ మాటల్లో యిమిడిలేదూ? వాటి సారాంశం, వాటి కర్తవ్యం, వాటి పరమార్థం యిదే కాదూ?’ అంటారామె. అలాంటి కరుణామూర్తి 1941 నాటి యుద్ధ కాలంలో శత్రువు మీద కాల్పులు జరిపింది, విమానం నుంచి బాంబులు విడిచింది, వంతెనలు పేల్చింది, వేగుగా పనిచేసింది, యుద్ధఖైదీలను పట్టుకుంది, శత్రువుల ప్రాణాలు కూడా తీసింది.

‘యుద్ధంలో మొత్తం 8 లక్షలకి పైగా అమ్మాయిలు యుద్ధ రంగ సైన్యాలకు చెందిన వివిధ శాఖల్లో పనిచేశారు’. ‘దారి పక్కన పూచిన ఊదారంగు పూల గుత్తులను తుపాకి బయోనెట్‌కు తగిలించుకు’నేంతటి సౌందర్యపిపాసులైన ఆ యువతులు అలా ప్రాణాలు ఎలా తీయగలిగారు? దానికి వారి జవాబు: ‘దేశభక్తియుత మహాయుద్ధం స్త్రీలు తమ మాతృదేశ రక్షణలో మూకుమ్మడిగా’ పాల్గొనేలా చేసింది. అంతమాత్రమే ఈ పుస్తక సారాంశం కాదు. ‘నాగలిచేత పెళ్లగింపబడిన బంగాళదుంపల మాదిరిగా’ డజన్ల కొద్దీ మృతదేహాలు పడే యుద్ధాన్ని ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? ఈ యుద్ధంతో ఇక యుద్ధం అనేదాన్ని చంపేస్తాం, అన్న భావన వీరి మాటల్లో కనిపిస్తుంది.

యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం;
మూలం: స్వెత్లానా అలెక్సీయెవిచ్‌;
తెలుగు: నిడమర్తి ఉమారాజేశ్వరరావు;
పేజీలు: 112;
వెల: 100;
ప్రతులకు: మలుపు, 2–1–1/5, నల్లకుంట, హైదరాబాద్‌-44. ఫోన్‌: 9866559868

- సాహిత్యం డెస్క్‌

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement