New Year 2022: న్యూ ఇయర్ రోజున ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుంది!
New Year's Traditions From Around the Globe 2020, 21 సంవత్సరాల్లో.. ఎందరో ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బతిన్నారు. అప్పటివరకూ కళ్ల ముందున్న ఆత్మీయులు హఠాత్తుగా తిరిగిరానిలోకాలకు చేరారు. ఈ కరోనా మారణహోమం చాలదన్నట్టు ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసేశాయి. దురదృష్టం తిష్టేసుకు కూర్చున్నట్లు ఉందీ పరిస్థతి చూడబోతే! మరి కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. శతకోటి ఆనందాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో అడుగిడాలని వెయ్యి ఆశలతో ఎదురుచూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఐతే న్యూ ఇయర్ రోజున ఈ విధంగా చేస్తే సంవత్సరమంతా మంచే జరుగుతుందని ప్రపంచంలోని వివిధ దేశాలు భిన్న ఆచారాలను, నమ్మకాలను పాటిస్తున్నాయి. ఆవూసులేంటో తెలుసుకుందాం..
స్పెయిన్
ఈ దేశంలో నూతన సంవత్సరంలోకి అడుగిడిన మొదటి రోజు 12 ద్రాక్ష పండ్లను తింటే ఏడాది పొడవునా సంతోషంగా ఉంటారని నమ్ముతారు. ఈ సంప్రదాయం 1909లో ప్రారంభమైంది.
బ్రెజిల్
సముద్రం అలల్లో తెల్లటి పువ్వులు విసిరి బ్రెజిల్ దేశ ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. పూలతోపాటు చాలా మంది పర్ఫ్యూమ్స్, నగలు, దువ్వెనలు, లిప్‌స్టిక్‌లను కూడా సముద్రంలోకి విసిరేస్తారు. ఇలా కొత్త సంవత్సరం రోజున సముద్ర దేవత 'యెమాంజ'కి కానుకను సమర్పించడం ద్వారా తమ కోరికలు తీరుస్తుందని అక్కడి ప్రజల నమ్మకం.
డెన్మార్క్
డిసెంబర్ 31 రాత్రి ఈ దేశ ప్రజలు పాత ప్లేట్లు, స్పూన్లు పొరుగిళ్ల మీదకు విసిరేస్తారట. జనవరి 1వ తేదీ ఉదయం ఇంటి తలుపు తియ్యగానే ఎన్ని ఎక్కువ విరిగిన పాత్రలుంటే ఆ సంవత్సరమంతా అంత అదృష్టం కలిసివస్తుందని నమ్ముతారు.
ఇతర దేశాల్లో ఇలా..
►థాయిలాండ్‌లో తుపాకులను గాలిలో పేల్చడం ద్వారా చెడు ఆత్మలను భయపెట్టడం ఆచారం.
►సౌత్ ఆఫ్రికాలోని ఈక్వెడార్‌కు చెందిన ప్రజలు ప్రసిద్ధ వ్యక్తుల దిష్టిబొమ్మలను తగలబెట్టడం ఆచారంగా కొనసాగుతోంది. తద్వారా గడచిన సంవత్సరం తాలూకు చెడును నాశనం చేసి, కొత్త సంవత్సరం తాజాగా ప్రారంభమౌతుందనేది వారి నమ్మకం.
►అనేక దేశాల్లో చర్చ్ లేదా గడియారం గంటలు వినడం ఆచారం.
►డచ్‌లో రింగ్ ఆకారంలో ఉండే ఏదైనా ఆహారాన్ని తింటారు. పూర్ణ వృత్తం వారి భవిష్యత్తును అదృష్టమయం చేస్తుందని నమ్ముతారు.
ఇక మనదేశంలోనైతే న్యూ ఇయర్ రోజున కొత్తకొత్త నిర్ణయాలు తీసుకోవడం ఆచారంగా వస్తుంది.
నమ్మకం ఏదైనా.. మనసావాచాఖర్మనా ఇతరులకు కీడు తలపెట్టకుండా, అందరి ఆనందాన్ని మన ఆనందంగా భావిస్తే సంవత్సరమేదైనా, ఎక్కడున్నా, ఎందరిలో ఉన్నా అదృష్టం మనవెంటే ఉంటుంది. ‘యద్భావం తద్భవతి' సూక్తి భావం కూడా ఇదే. పాటిద్దామా..
చదవండి: ‘నీపై నాకున్నప్రేమ క్రిస్మస్ చెట్టులోని లైట్ల కన్నా మరింతగా వెలుగుతోంది'!