నమ్మకం: నమ్మితే నమ్మండి...!
మనిషికి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం మేలు చేసేదై ఉండాలి. కానీ కంగారుపెట్టడం తప్ప మరెందుకూ పనికిరాని కొన్ని నమ్మకాలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటి గురించి సరదాగా తెలుసుకోండి!
రాత్రంతా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటే, దాని దగ్గర పడుకున్న వ్యక్తి మరణిస్తాడని ఒకప్పుడు దక్షిణ కొరియాలో నమ్మేవారు. అందుకే కాసేపు తిరిగి దానికదే ఆగిపోయేలా టైమర్ అమర్చేవారు.
టర్కీలోని కొన్ని ప్రాంతాల వారు... రాత్రిపూట బబుల్‌గమ్ నమలడమంటే... చనిపోయిన మనిషి మాంసాన్ని నమలడం అంటారు!
మనిషి ఆత్మ వెంట్రుకల్లో ఉంటుందట. అందుకే హెయిర్‌కట్ చేయించుకునేముందు మంత్రగాడిని సంప్రదించమంటారు కొన్ని మంగోలియా తెగలవారు!
అమెరికాలో సిడార్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఒకచోట పాతిన సిడార్ మొక్కను పీకి మరో చోట పాతకూడదంటారు వాళ్లు. ఒకవేళ అలా చేస్తే... ఆ చెట్టు పెరిగి పెద్దయ్యేలోపు ఆ పాతిన వ్యక్తి ప్రాణాలు పోతాయట!
భోజనానికి ముందుగానీ, చేసిన వెంటనేగానీ స్నానం చేస్తే ఆయువు మూడినట్లే అన్నది ఈశాన్య బ్రెజిల్‌వారి నమ్మకం!
సంవత్సరంలో తొలి రోజున గిన్నెలు కడిగినా, బట్టలుతికినా కుటుంబంలోని ఒకరు మరో యేడు వచ్చేసరికి మృత్యువాత పడతారని పలు ఐరోపా దేశాల్లో నమ్ముతారు!
సమాధుల దగ్గరకు వెళ్లినప్పుడు ఊపిరి బిగబట్టాలట. లేదంటే శ్వాస తీసుకున్నప్పుడు గాలితో పాటు ఆ సమాధిలోని వ్యక్తి ఆత్మ మనలోకి వెళ్లిపోతుందని అంటారు కొన్ని ఆఫ్రికన్ తెగలవాళ్లు!