నా వంతు చేయూతనిస్తా
బళ్లారి అర్బన్ : విద్య, ఆర్థిక, సామాజిక పరంగా వెనుకబడిన హుగార సమాజ అభివృద్ధికి తన వంతు చేయూతనందిస్తానని బళ్లారి ఎంపీ బీ.శ్రీరాములు అన్నారు. ఆదివారం ఆయన స్థానిక శరణ సక్కరి కరిడప్ప వసతి నిలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన అఖిల కర్ణాటక హుగార సమాజం మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభావంత విద్యార్థులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ధనవంతులైనా, పేదవారైనా విద్య లేకపోతే వారు ప్రగతికి దూరమవుతారన్నారు. హుగార సమాజం ప్రతిభా పురస్కార కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. కంప్యూటర్ యుగంలో ప్రతిభ ఉంటేనే ప్రగతి సాధ్యమన్నారు.
రాష్ట్రంలో 2 లక్షల జనాభా ఉన్న హుగార సమాజస్తులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సౌకర్యాలు అందడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు, రిజర్వేషన్లలో ప్రాధాన్యత కల్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు. ఈ సమాజాభివృద్ధికి ఎంపీ నిధుల కింద సహకారం అందిస్తానన్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా తాను ఆశిస్తున్నది ఒకటే తమ సమాజం వారు రాజకీయ రంగంలో రాణిస్తే సమాజాభివృద్ధి జరుగుతుందన్నారు. తమ పిల్లలను కుల వృత్తికే పరిమితం చేయకుండా వారికి ఉన్నత విద్యనందించి ఉన్నత పదవులు అలంకరించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకారం అందించాలన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ మృత్యుంజయ జినగ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ స్థాయి వరకు హుగార సమాజం లేని గ్రామాలు ఉండవన్నారు. భగవంతుని సాన్నిధ్యానికి సహకరించే పుష్పం, పత్రం ఎంత పవిత్రంగా ఉంటాయో అలాగే మీ హృదయాలు కూడా అలాగే ఉంటాయని భావిస్తున్నానన్నారు. అనంతరం 38 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించి ప్రోత్సహించారు. కార్యక్రమంలో హుగార సమాజ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యకాంత పులారి, కార్యదర్శి లోచనేశ హూగార్, జిల్లాధ్యక్షుడు పంపాపతి, గౌరవాధ్యక్షుడు జే.గురుమూర్తి, కార్యదర్శి రుద్రప్ప, సభ్యులు జీవీ.ఈశ్వరప్ప పాల్గొన్నారు.