రూ.251కే స్మార్ట్ ఫోన్ లో తాజా ట్విస్ట్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ను రూ.251కే అందిస్తామని ఊరించిన రింగింగ్ బెల్స్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక్కో స్మార్ట్ ఫోన్ను రూ.3,600 ధరకు మొత్తం వెయ్యి ఫోన్లను రింగింగ్ బెల్స్కు సరఫరా చేశామని ఐటీ ఉత్పత్తుల సంస్థ యాడ్కామ్ పేర్కొంది. రింగింగ్ బెల్స్ కంపెనీ రూ.251కు స్మార్ట్ఫోన్ను విక్రయించాలన్న ఆలోచన గురించి తమకేమీ తెలియదని యాడ్కామ్ వివరించింది.
తమ బ్రాండ్నేమ్కు హాని కలిగించే కార్యకలాపాలను రింగింగ్ బెల్స్ చేపడితే, ఆ సంస్థకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అడ్వాండేజ్ కంప్యూటర్స్(యాడ్కామ్) చైర్మన్ సంజీవ్ భాటియా చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత చౌక ధరకు స్మార్ట్ఫోన్ను అందిస్తామని రింగింగ్ బెల్స్ రూ.251 ధరకు ఫ్రీడమ్ ఫోన్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఒకవైపు వివాదం కొనసాగుతుండగా... మరో వైపు ఫోనును ఏప్రిల్ చివరి నుంచీ అందిస్తామని రింగింగ్ బెల్స్ పేర్కొంది.