Belt shops and excise officers
-
కిక్కుదిగుతోంది
సాక్షి, కాకినాడ: ప్రభుత్వానికి ఆదాయం, వర్తకులకు నష్టాలు లేని వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఒక్క మద్యం వ్యాపారమే. అటువంటి వ్యాపార లైసెన్సులను కొందరు స్వచ్ఛందంగా వదులుకుంటున్నారు. ప్రభుత్వం కంటే ముందే మద్యం దుకాణాల సంఖ్యను వ్యాపారులే తగ్గించుకోవడం ఆసక్తికరంగా మారింది. మద్యం విచ్చలవిడి విక్రయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఖజానాకు గణనీయమైన ఆదాయం వస్తున్నా ఆ వ్యాపారాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ గత టీడీపీ ప్రభుత్వం మద్యం ఆదాయమే పరమావధిగా భావించి విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి విక్రయాలు చేపట్టింది. మహిళలు, ఇతర వర్గాల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ పట్టించుకోలేదు. పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి తాము అధికారంలోకి రాగానే మద్యం విక్రయాలను నియంత్రిస్తామని ఇచ్చిన హామీ మేరకు ముందుగా బెల్టుషాపులు నిర్మూలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ అధికారులు గ్రామాల్లో అనధికారికంగా బెల్టు దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. ప్రస్తుతం అనుమతి ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల కాలపరిమితి జూన్ నెలాఖరుతో ముగిసింది. కొత్త మద్యం విక్రయాలపై ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు లేకపోవడంతో ప్రస్తుతం అనుమతి ఉన్న మద్యం దుకాణాలకు మరో మూడు నెలల కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆదాయాలు తగ్గిపోతుండటంతో సిండికేట్‌గా మద్యం వ్యాపారం చేస్తున్న వారు తమ వ్యూహాలు మార్చుకుంటున్నారు. లాభం కోసమే ఎత్తుగడ గ్రామాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో 90 శాతానికిపైగా సిండికేట్ రంగంలో పని చేస్తున్నాయి. మద్యం దుకాణం లైసెన్సు పొందేంతవరకు వ్యక్తిగతంగానే వ్యాపారులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు సాగించినా, లైసెన్సు మంజూరైన తర్వాత వ్యాపారులందరూ ఒక తాటిపైకి వచ్చి కలిసి కట్టుగా మద్యం వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఈ కారణంగానే బెల్టుషాపులు పెరుగుతున్నాయి. మద్యం వ్యాపారులందరూ సిండికేట్‌గా ఉండటంతో కాలపరిమితి ముగిసినా ఫీజులు చెల్లించి అదనంగా మూడు నెలలు లైసెన్సులు పొడిగిస్తున్నా మద్యం సిండికేట్ వ్యాపారులు ముందుకు రావడంలేదు. జిల్లాలో పరిస్థితి ఇలా జిల్లాలో 534 మద్యం దుకాణాలున్నాయి. కొందరు మద్యం వ్యాపారులు ప్రస్తుతం ఉన్న లైసెన్సులను పునరుద్ధరించుకోవడం లేదు. ఎక్కడ మద్యం దుకాణం ఉన్నా అది ఆయా మండలాల వారీగా సిండికేట్ కావడంతో వ్యాపారులు ఆ మేరకు నష్టం జరగదని భావిస్తున్నారు. ఒక్కో మద్యం దుకాణానికి ఏడాదికి లైసెన్సు ఫీజు రూ.11.25 లక్షలు, పర్మిట్ రూమ్‌కు మరో రూ.5 లక్షలు. మొత్తంగా రూ.16.25 లక్షలను లైసెన్సు ఫీజులుగా వ్యాపారులు కడుతున్నారు. సగటున రూ. 4.70 లక్షలు ఫీజు, మరో లక్ష నిర్వహణ ఖర్చులు అవుతాయని వ్యాపారులు అంటున్నారు. ఈ లెక్కలు చూస్తే మూడు నెలలకు ఫీజులు చెల్లించడం లాభదాయకం కాదని మద్యం వ్యాపారులు అంటున్నారు. 99 మంది వ్యాపారులు తమ మద్యం దుకాణాలను పునరుద్ధరించుకోలేదు. మూడు నెలలపాటు గడువు పొడిగిస్తూ ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల కాలానికి నగదు చెల్లించిన వారికి మాత్రమే పునరుద్ధరించారు. 45 బారులు ఉన్నాయి. వీటికి 2022 వరకు లైసెన్స్ ఉండడంతో అవి యథావిధిగా కొనసాగుతున్నాయి. వీటిలో ఒక బార్‌కు సంబంధించి లైసెన్స్‌కు డబ్బులు కట్టకపోవడంతో దాన్ని నిలిపివేశారని జిల్లా ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా మద్యం దుకాణాలు తగ్గించడానికి ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రకటించారు. దీనికి తోడు బెల్టు షాపులు ఎక్కడా ఉండకూడదని అధికారులను ఆయన ఆదేశించడంతో ఎక్సైజ్ అధికారులు గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు దుకాణాలపై దాడులు ముమ్మరం చేస్తున్నారు. లైసెన్సు కాలపరిమితి ముగియడం, ప్రస్తుతం ఉన్న దుకాణాలకే మరో మూడు నెలల ఫీజులతో లైసెన్సు పునరుద్దరించుకోవాలని అధికారులు సూచించారు. మద్యం దుకాణాల వల్ల నష్టాలు వస్తాయనే ఉద్దేశ్యంతో కొందరు మూడు నెలల అదనపు కాలానికి ఫీజులు కట్టకుండా స్వచ్ఛందంగానే లైసెన్సులు వదిలేసుకుంటున్నారు. అధికార మద్యం దుకాణాలకు పాటదారులు ఫీజులు చెల్లించకపోవడంతో ఎక్సైజ్ అధికారులు వాటి లైసెన్సులు రుద్దు చేస్తున్నారు. మద్యపానాన్ని దశల వారీగా నిషేధించడం హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వం మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తామని చెప్పడం హర్షణీయం. మద్యంతో కొన్ని వందల కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. యువత చిన్నతనంలోనే తాగుడుకు బానిసై వ్యాధులతో మరణిస్తున్నారు. కుటుంబంలో భర్త మద్యానికి బానిసై చనిపోతే మహిళ అగచాట్లు అన్నీఇన్నీకావు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తామని చెప్పడంతో దుకాణాదారులు సైతం ముందుకు రావడంలేదు. – పలివెల వీరబాబు, సీపీఐ నాయకుడు, కాకినాడ మద్యపానాన్ని నిషేధిస్తే రాష్ట్రాభివృద్ధి రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధిస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. నూతన ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పింది. గత టీడీపీ ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారించింది. మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రభుత్వ ఆదాయంగా చంద్రబాబు పరిగణించారు. నూతన ప్రభుత్వం మద్యాన్ని పూర్తిస్థాయిలో నిషేధించాలి. – ఎం.వీరలక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
బెల్టు తీశారు!
కర్నూలు: దశల వారీ మద్యపాన నిషేధం అమలులో భాగంగా తొలి అడుగు పడింది. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలకు కారణమవుతున్న బెల్టుషాపులను సమూలంగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రతి పేదవారిలోనూ ఆనందం వెల్లివిరిసేందుకు ఎక్కడా బెల్టుషాపులు లేకుండా చేయాలని అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం దశల వారీగా మద్యపాన నిషేధం, బెల్టు దుకాణాల తొలగింపు తదితర అంశాలపై సమీక్ష సందర్భంగా సీఎం ఈ ఆదేశాలిచ్చారు. దీనిపై మహిళల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఐదేళ్లుగా గ్రామగ్రామాన బెల్టుషాపులు వేళ్లూనుకుపోయాయి. వీటి వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పలు కుటుంబాలు చిన్నాభిన్నం కావడానికి, గొడవలు జరగడానికి ఇవి కారణమవుతున్నాయి. బెల్టుషాపులను తొలగిస్తామంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదటి సంతకం పెట్టినా..ఆచరణలో మాత్రం అమలు చేయలేదు. పైగా మద్యపానాన్ని మరింత ప్రోత్సహించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యం దుకాణాల కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని స్వయాన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలే వ్యాపారులుగా మారి మద్యం ఏరులై పారించారు. ఊరూరా బెల్టు షాపులు జిల్లాలో 206 మద్యం దుకాణాలు, 48 బార్లు, రెండు క్లబ్‌లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా రెండు వేలకు పైగా »బెల్టు దుకాణాలు నడుస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులే అంచనా వేశారు. లైసెన్సీలు తమకు దక్కిన దుకాణాలపై లాభాలు ఆర్జించడానికి ఊరూవాడ తమ అనుయాయులతో బెల్టుషాపులను పెట్టించారు. లైసెన్సుడు దుకాణంలో నిర్ణీత సమయంలో మాత్రమే అమ్మకాలు సాగిస్తారు. కానీ బెల్టు దుకాణాలకు నిర్ణీత సమయమంటూ ఉండదు. పల్లెల్లో ఏ సమయంలోనైనా మద్యం దొరుకుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బెల్టు షాపులు చివరకు గాంధీ జయంతి లాంటి సందర్భాల్లోనూ తెరిచే ఉంటున్నాయి. కొరడా ఝుళిపించనున్న నూతన ప్రభుత్వం బెల్టు దుకాణాల వల్లే మద్యం విస్తృతి, కుటుంబాలకు ఎక్కువ నష్టం కల్గుతోందని వైఎస్ జగన్ ప్రభుత్వం భావిస్తోంది. కావున వాటిని పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ‘ప్రజాసంకల్పయాత్ర’లో మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామగ్రామాన ఉన్న బెల్టుషాపులను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీ మేరకు మద్యపాన నిషేధాన్ని కూడా దశల వారీగా అమలు చేస్తారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారులకు కొమ్ముకాసే విధంగా వ్యవహరించడంతో లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. – విజయలక్ష్మి వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు, కర్నూలు ఇకపై కఠినంగా వ్యవహరిస్తాం ప్రభుత్వ నిర్ణయం మేరకు బెల్టు దుకాణాల నిర్మూలనపై మరింత కఠినంగా వ్యవహరిస్తాం. గతంలో బెల్టు దుకాణాలు బహిరంగంగానే నడిపేవారు. ప్రస్తుతం మొబైల్ వ్యాపారం సాగుతోంది. రెండు నెలల్లో 104 వాహనాలను సీజ్ చేశాం. 400 పై చిలుకు కేసులు నమోదు చేశాం. బెల్టు దుకాణాలకు మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు గుర్తించి 12 దుకాణాలు సీజ్ చేశాం. జూలై నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమలులోకి వస్తుంది. మద్యం వ్యాపారులకు కఠినంగా ఆదేశాలు జారీ చేసి.. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తాం. – చెన్నకేశవరావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ -
టార్గెట్.. మద్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎక్సైజ్ శాఖలో నోటి మాటల మీదనే నిబంధనలు మారిపోతున్నాయి. నిన్నా మొన్నటి వరకు ప్రతినెలా 10 శాతం చొప్పు న అదనంగా మద్యం విక్రయాలు ఉండాలని వెంటపడి మరీ మద్యం కొనుగోళ్లు చేయించిన ఎౖMð్సజ్ బాస్.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మనుసు మార్చుకున్నారు. లెక్కలకు మించి మద్యం అమ్ముడుపోవటంతో వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకు నుంచి రోజుకు 212 కేసుల చొప్పున సీజ్ చేయాలంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి నెలా లక్ష కేసుల మద్యం అమ్ముబోతోంది. ఉమ్మడి జిల్లాలో నెలకు 1.5 లక్షల కేసుల మద్యం అమ్ముడుపోతోంది. గడిచిన ఆరు నెలల కాలంలో దాదాపు 9 లక్షల కేసుల మద్యం విక్రయించారు. గత ఏడాది ఇవే ఆరు నెలలతో పోల్చుకుంటే దాదాపు 12 శాతం అదనంగా మద్యం అమ్ముడుపోయింది. ఈ ఏడాది అమ్మకాలు గత పదేళ్లలోనే రికార్డు అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడుపోవటానికి కారణం బెల్టు దుకాణాలను ప్రోత్సహించటమే. గుడుంబా తయారీ మానేసిన కుటుంబాలకు, నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించే క్రమంలోనే బెల్టు దుకాణాలు తెరిపించారు. వాటిపై కేసులు నమోదు చేయవద్దని ఎక్సైజ్ ఇన్చార్జి కమిషనర్ సోమేశ్‌కుమార్ మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రం లో అధికారికంగా 265 మద్యం దుకాణాలు, 119 బార్లు ఉండగా.. వాటికి అనుబంధంగా సుమారు 16 వేల బెల్టు దుకాణాలు తెరిచారు. దీంతో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. నివ్వెరపోయిన ఎన్నికల కమిషన్ జిల్లాలో లిక్కర్ విక్రయాలను చూసి ఎన్నికల కమిషన్ నివ్వేరపోయింది. ఉమ్మడి జిల్లాలో 265 దుకాణాలు 24 గంటలు పనిచేసినా ఇంత మద్యం విక్రయించటం సాధ్యం కాదు.. ఎలా అమ్ముతున్నారని ఆరా తీయటంతో బెల్టు దుకాణాలే కారణమని తేలింది. ఎక్సైజ్ కమిషనర్‌ను వివరణ కూడా అడిగినట్లు సమాచారం. దీంతో ఎక్సైజ్ కమిషనర్ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చారు. ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రోజుకు 150 సీసాల మద్యాన్ని ఖచ్చితంగా సీజ్ చేయాలనే ఆదేశాలు జారీ చేశారు. తెలం గాణలో 17 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఈలెక్క న రోజుకు 212 కేసుల మద్యం కేసులు సీజ్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎౖMð్సజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. -
మౌనమేలనోయి!
పరిగి మండల పరిధిలోని గడిసింగాపూర్లో 2,500 జనాభా ఉంది. ఈ గ్రామాన్ని గత కొంత కాలంగా బెల్టు మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ పల్లెలో ఆరు కిరాణా దుకాణాలు ఉండగా.. ఎనిమిది బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. ఆరు కిరాణా దుకాణాల్లో రోజుకు సగటున రూ.10వేల నుంచి 12 వేల గిరాకీ అవుతుండగా.. బెల్టు దుకాణాల్లో మాత్రం రోజుకు సగటున రూ.25 వేల నుంచి 30 వేల వరకు మద్యం అమ్ముతోంది. గ్రామంలోని 90 శాతం మంది యువత మద్యం మత్తుకు చిత్తవుతున్నారు. దినసరి కూలీలు సైతం సంపాదనలో ఎక్కువ శాతం మందుకే తగిలేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఊరిలో విచ్చలవిడిగా మద్యం దొరకడంతోనే ఈ దుస్థితి నెలకొందంటున్నారు. సయ్యద్‌పల్లిలో ఆరు బెల్టు దుకాణాలుండగా రోజుకు రూ.15 వేల మద్యం విక్రయిస్తున్నారు. రాపోల్లో నాలుగు బెల్ట్ షాపులున్నాయి. పరిగిలోని దాదాపూర్, మోత్కూర్, కుల్కచర్ల పరిధిలోని బండవెల్కిచర్ల, ముజాహిద్పూర్, మందిపల్, చౌడాపూర్ తదితర గ్రామాల్లో 4 నుంచి 8 బెల్టు దుకాణాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న కిరాణా దుకాణాల్లో మద్యం విక్రయాలు మామూలైపోయింది. ఒక్క పరిగి నియోజకవర్గంలోనే 500 నుంచి 560 వరకు బెల్టు షాపులు ఉన్నట్లు అధికారుల అంచనా. జిల్లాలో 1,800 నుంచి 2,000 పైచిలుకు బెల్టు దుకాణాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. గతంలో సారా విక్రయించే ప్రతీ తండాలో ప్రస్తుతం ఇవి వెలిశాయి. దాబాలు, కిరాణా దుకాణాలు ఇలా ఎక్కడపడితే అక్కడ మద్యం లభిస్తుండటంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. లైసెన్స్డ్ దుకాణాల ద్వారా 30 శాతం మద్యం విక్రయిస్తుండగా.. బెల్టు షాపుల ద్వారా 70 శాతం అమ్మకాలు సాగుతున్నాయంటే పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు రూ.లక్ష దాటని షాపులో ప్రస్తుతం రూ.3 లక్షల గిరాకీ అవుతోంది. సాక్షి, పరిగి (రంగారెడ్డి): ఎన్నికల వేళ గ్రామాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా వెలిసిన బెల్టు దుకాణాల్లో విచ్చలవిడిగా లిక్కర్ విక్రయిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఇది పోలీసులకు సవాలు విసురుతోంది. అనుమతి లేకుండా కొనసాగుతున్న ఈ దందాను అరికట్టడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమవుతున్నారు. 2015కు ముందు పచ్చని పల్లెల్లో ఏరులై పారిన సారా రక్కసిని తరిమేయడంలో విజయవంతమైన ఈ శాఖ.. బెల్టు షాపులను మాత్రం ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సారా పూర్తిగా అంతరించిపోవడంతో మద్యం విక్రయాలు భారీగా సాగుతున్నాయి. ఎక్సైజ్ కనుసన్నల్లోనే... ప్రస్తుతం గ్రామాల్లోని కిరాణ దుకాణాలతో పోలిస్తే బెల్టు దుకాణాలే అధికంగా ఉన్నాయి. వీటి నిర్వహణ మొత్తం ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లోనే సాగుతోందనే ఆరోపణలున్నాయి. బెల్టు వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం వీరి వద్ద ఉన్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. తండాలు, గిరిజన గూడాలు, అటవీ ప్రాంతాల్లో రహస్యంగా కొనసాగిన సారా తయారీనే సమూలంగా రూపుమాపిన అధికారులకు బెల్టు దుకాణాలను మూసే యించడం పెద్ద పనేమీ కాదని, స్వార్థ ప్రయోజనాల కోసమే వీటి జోలికి వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో బెల్టు నిర్వాహకులు వైన్స్‌ల నుంచి గ్రామాల్లోకి తరలించిన మద్యం సీసాలను ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 అధికంగా తీసుకుని విక్రయిస్తున్నారు. వైన్స్‌ల నుంచి ఉద్దెరగా తెచ్చిన మద్యాన్ని విక్రయించిన తర్వాత డబ్బులు చెల్లించే వెసులుబాటు సైతం ఉండటంతో బెల్టు వ్యాపారం ఏ ఇబ్బందీ లేకుండా సాగుతోంది. ఆయా మండలాల పరిధిలోని వైన్స్‌ల నుంచి మద్యం తెచ్చుకుంటున్న బెల్ట్ షాపుల నిర్వాహకులకు మద్యం దుకాణాల యజమానులు సహకరిస్తున్నారు. ఎక్సైజ్, పోలీసు దాడులు జరిగిన సమయంలో పట్టుబడితే తమ పలుకుబడిని ఉపయోగించి కేసులు కాకుండా చూస్తున్నారు. రాబడి పెంచుకునేందుకేనా..? మద్యంపై రాబడిని పెంచుకోవటంలో సర్కారు సఫలీకృతమైందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సారాను నిర్మూళించి.. మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఖజానా నింపుకొనేందుకు ఎక్సైజ్, పోలీసు శాఖలను వాడుకుంటోందనే ఆరోపణలూ లేకపోలేదు. సారాను పూర్తిగా మాన్పించటం ద్వారా.. దీనికి బానిసలైన వారిని మద్యం వైపు మళ్లించడంలో ప్రభుత్వం విజయం సాధించినేది పలువురి వాదన. పోలీసులకు సవాలు... ఎన్నికల వేళ గ్రామాల్లో వెలిసిన బెల్టు దుకాణాలు పోలీసు శాఖకు సవాలుగా మారుతున్నాయి. మద్యం దుకాణాల నుంచి మామూళ్లు తీసుకుంటున్న కారణంగా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పోలీసులు సైతం ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పోలీసులు బెల్టు షాపు నుంచి స్వాదీనం చేసుకున్న మద్యం (ఫైల్) దాడులు చేస్తాం లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే మద్యం విక్రయించాలి. గ్రామాల్లో నిర్వహించే బెల్టు షాపులను ఎట్టిపరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదు. ఫిర్యాదు వచ్చిన దుకాణాలపై వెంటనే దాడులు చేస్తాం. దీనిపై సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. – చంద్రశేఖర్, ఎక్సైజ్ సీఐ, పరిగి చర్యలు తీసుకుంటాం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనూ సహించేది లేదు. ఎన్నికల సమయంలో అక్రమంగా జరిగే మద్యం విక్రయాలను పూర్తిగా అరికడుతాం. ఈ విషయంపై గ్రామాలు, మండలాల వారీగా పోలీసులతో సమీక్ష నిర్వహిస్తాం. – రవీంద్రారెడ్డి, డీఎస్పీ, పరిగి -
ఏడాదైనా నెరవేరని హామీ
బెల్ట్ షాపులు ఎత్తేస్తామంటూ ఏడాది క్రితం ప్రకటన మామూళ్ల మత్తులో పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు నర్సీపట్నం, న్యూస్‌లైన్ : సరిగ్గా ఏడాది క్రితం పంచాయతీ ఎన్నికల సందర్భంగా మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 45 రోజుల్లో బెల్ట్ షాపులు తొలగిస్తామంటూ ప్రకటించారు. ఆ ఎన్నికలు ముగిశాక ఈ హామీని పట్టించుకోలేదు. దీంతో నేటికీ ఈ షాపులు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. రెండేళ్ల భారీ ఎత్తున ధరావతు చెల్లించి వ్యాపారులు మద్యం దుకాణాలు లాటరీలో దక్కించుకున్నారు. ఆ స్థాయిలో వ్యాపారం చేసి పెట్టుబడి, లాభాలు రాబట్టేందుకు అమ్మకాలు విపరీతంగా పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వ్యాపారులంతా వీధివీధిగా బెల్టుషాపులు ఏర్పాటు చేయగా దీనికి ఎక్సైజ్ అధికారులు తెరచాటు సహకారం అందించారు. ఇలాంటి సమయంలో గత ఏడాది పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి నెలరోజుల్లో బెల్ట్ షాపులు ఎత్తేస్తామంటూ ప్రకటించారు. పట్టించుకోని అధికారులు రాష్ట్రంలో బెల్ట్‌షాపులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం ప్రజల అభీష్టానికి తలొగ్గాల్సి వచ్చింది. దీనిపై గత ఏడాది మే 9న సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి 45 రోజుల్లో బెల్ట్ షాపులు తొలగించాలని ఆదేశించారు. ఇది జరిగి ఏడాది గడుస్తున్నా జిల్లా ఒక్క షాపునూ తొలగించలేదు. మధ్యలో కొన్ని షాపులపై దాడులు చేసినా అవి నానమాత్రమే అయ్యాయి. వైన్‌షాపుల యాజమానులు షాపుల్లో లూజ్ సేల్స్, బెల్ట్ దుకాణాల ఏర్పాటుకు అనుమతిస్తున్న ఎకై ్సజ్ అధికారులు ఒక్కో షాపు నుంచి రూ. 20వేల వరకు అనధికార వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా నెలకు సుమారుగా రూ. 70లక్షల వరకు మామూళ్లు రూపేణా వసూలు చేస్తున్నారు. బెల్ట్ షాపులు తొలగిస్తే ఈ మామూళ్లకు గండి పడుతుందని భావించిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యడం లేదు.