పరిగి మండల పరిధిలోని గడిసింగాపూర్‌లో 2,500 జనాభా ఉంది. ఈ గ్రామాన్ని గత కొంత కాలంగా బెల్టు మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ పల్లెలో ఆరు కిరాణా దుకాణాలు ఉండగా.. ఎనిమిది బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. ఆరు కిరాణా దుకాణాల్లో రోజుకు సగటున రూ.10వేల నుంచి 12 వేల గిరాకీ అవుతుండగా.. బెల్టు దుకాణాల్లో మాత్రం రోజుకు సగటున రూ.25 వేల నుంచి 30 వేల వరకు మద్యం అమ్ముతోంది. గ్రామంలోని 90 శాతం మంది యువత మద్యం మత్తుకు చిత్తవుతున్నారు.
దినసరి కూలీలు సైతం సంపాదనలో ఎక్కువ శాతం మందుకే తగిలేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఊరిలో విచ్చలవిడిగా మద్యం దొరకడంతోనే ఈ దుస్థితి నెలకొందంటున్నారు. సయ్యద్‌పల్లిలో ఆరు బెల్టు దుకాణాలుండగా రోజుకు రూ.15 వేల మద్యం విక్రయిస్తున్నారు. రాపోల్‌లో నాలుగు బెల్ట్ షాపులున్నాయి. పరిగిలోని దాదాపూర్, మోత్కూర్, కుల్కచర్ల పరిధిలోని బండవెల్కిచర్ల, ముజాహిద్‌పూర్, మందిపల్, చౌడాపూర్ తదితర గ్రామాల్లో 4 నుంచి 8 బెల్టు దుకాణాలున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న కిరాణా దుకాణాల్లో మద్యం విక్రయాలు మామూలైపోయింది. ఒక్క పరిగి నియోజకవర్గంలోనే 500 నుంచి 560 వరకు బెల్టు షాపులు ఉన్నట్లు అధికారుల అంచనా. జిల్లాలో 1,800 నుంచి 2,000 పైచిలుకు బెల్టు దుకాణాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. గతంలో సారా విక్రయించే ప్రతీ తండాలో ప్రస్తుతం ఇవి వెలిశాయి. దాబాలు, కిరాణా దుకాణాలు ఇలా ఎక్కడపడితే అక్కడ మద్యం లభిస్తుండటంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. లైసెన్స్‌డ్ దుకాణాల ద్వారా 30 శాతం మద్యం విక్రయిస్తుండగా.. బెల్టు షాపుల ద్వారా 70 శాతం అమ్మకాలు సాగుతున్నాయంటే పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు రూ.లక్ష దాటని షాపులో ప్రస్తుతం రూ.3 లక్షల గిరాకీ అవుతోంది.
సాక్షి, పరిగి (రంగారెడ్డి): ఎన్నికల వేళ గ్రామాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా వెలిసిన బెల్టు దుకాణాల్లో విచ్చలవిడిగా లిక్కర్ విక్రయిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఇది పోలీసులకు సవాలు విసురుతోంది. అనుమతి లేకుండా కొనసాగుతున్న ఈ దందాను అరికట్టడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమవుతున్నారు. 2015కు ముందు పచ్చని పల్లెల్లో ఏరులై పారిన సారా రక్కసిని తరిమేయడంలో విజయవంతమైన ఈ శాఖ.. బెల్టు షాపులను మాత్రం ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సారా పూర్తిగా అంతరించిపోవడంతో మద్యం విక్రయాలు భారీగా సాగుతున్నాయి.
ఎక్సైజ్ కనుసన్నల్లోనే...
ప్రస్తుతం గ్రామాల్లోని కిరాణ దుకాణాలతో పోలిస్తే బెల్టు దుకాణాలే అధికంగా ఉన్నాయి. వీటి నిర్వహణ మొత్తం ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లోనే సాగుతోందనే ఆరోపణలున్నాయి. బెల్టు వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం వీరి వద్ద ఉన్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. తండాలు, గిరిజన గూడాలు, అటవీ ప్రాంతాల్లో రహస్యంగా కొనసాగిన సారా తయారీనే సమూలంగా రూపుమాపిన అధికారులకు బెల్టు దుకాణాలను మూసే యించడం పెద్ద పనేమీ కాదని, స్వార్థ ప్రయోజనాల కోసమే వీటి జోలికి వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
దీంతో బెల్టు నిర్వాహకులు వైన్స్‌ల నుంచి గ్రామాల్లోకి తరలించిన మద్యం సీసాలను ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 అధికంగా తీసుకుని విక్రయిస్తున్నారు. వైన్స్‌ల నుంచి ఉద్దెరగా తెచ్చిన మద్యాన్ని విక్రయించిన తర్వాత డబ్బులు చెల్లించే వెసులుబాటు సైతం ఉండటంతో బెల్టు వ్యాపారం ఏ ఇబ్బందీ లేకుండా సాగుతోంది. ఆయా మండలాల పరిధిలోని వైన్స్‌ల నుంచి మద్యం తెచ్చుకుంటున్న బెల్ట్ షాపుల నిర్వాహకులకు మద్యం దుకాణాల యజమానులు సహకరిస్తున్నారు. ఎక్సైజ్, పోలీసు దాడులు జరిగిన సమయంలో పట్టుబడితే తమ పలుకుబడిని ఉపయోగించి కేసులు కాకుండా చూస్తున్నారు.
రాబడి పెంచుకునేందుకేనా..?
మద్యంపై రాబడిని పెంచుకోవటంలో సర్కారు సఫలీకృతమైందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సారాను నిర్మూళించి.. మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఖజానా నింపుకొనేందుకు ఎక్సైజ్, పోలీసు శాఖలను వాడుకుంటోందనే ఆరోపణలూ లేకపోలేదు. సారాను పూర్తిగా మాన్పించటం ద్వారా.. దీనికి బానిసలైన వారిని మద్యం వైపు మళ్లించడంలో ప్రభుత్వం విజయం సాధించినేది పలువురి వాదన.
పోలీసులకు సవాలు...
ఎన్నికల వేళ గ్రామాల్లో వెలిసిన బెల్టు దుకాణాలు పోలీసు శాఖకు సవాలుగా మారుతున్నాయి. మద్యం దుకాణాల నుంచి మామూళ్లు తీసుకుంటున్న కారణంగా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పోలీసులు సైతం ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
పోలీసులు బెల్టు షాపు నుంచి స్వాదీనం చేసుకున్న మద్యం (ఫైల్)
దాడులు చేస్తాం
లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే మద్యం విక్రయించాలి. గ్రామాల్లో నిర్వహించే బెల్టు షాపులను ఎట్టిపరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదు. ఫిర్యాదు వచ్చిన దుకాణాలపై వెంటనే దాడులు చేస్తాం. దీనిపై సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. – చంద్రశేఖర్, ఎక్సైజ్ సీఐ, పరిగి
చర్యలు తీసుకుంటాం
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనూ సహించేది లేదు. ఎన్నికల సమయంలో అక్రమంగా జరిగే మద్యం విక్రయాలను పూర్తిగా అరికడుతాం. ఈ విషయంపై గ్రామాలు, మండలాల వారీగా పోలీసులతో సమీక్ష నిర్వహిస్తాం. – రవీంద్రారెడ్డి, డీఎస్పీ, పరిగి
Comments
Please login to add a commentAdd a comment