కిక్కుదిగుతోంది | East Godavari Belt Shops Licence Duration Expired In June Month | Sakshi
Sakshi News home page

కిక్కుదిగుతోంది

Published Fri, Jul 19 2019 11:47 AM | Last Updated on Fri, Jul 19 2019 11:47 AM

East Godavari Belt Shops Licence Duration Expired In June Month - Sakshi

సాక్షి, కాకినాడ: ప్రభుత్వానికి ఆదాయం, వర్తకులకు నష్టాలు లేని వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఒక్క మద్యం వ్యాపారమే. అటువంటి వ్యాపార లైసెన్సులను కొందరు స్వచ్ఛందంగా వదులుకుంటున్నారు. ప్రభుత్వం కంటే ముందే మద్యం దుకాణాల సంఖ్యను వ్యాపారులే తగ్గించుకోవడం ఆసక్తికరంగా మారింది. మద్యం విచ్చలవిడి విక్రయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఖజానాకు గణనీయమైన ఆదాయం వస్తున్నా ఆ వ్యాపారాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ గత టీడీపీ ప్రభుత్వం మద్యం ఆదాయమే పరమావధిగా భావించి విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి విక్రయాలు చేపట్టింది. మహిళలు, ఇతర వర్గాల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ పట్టించుకోలేదు. పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి తాము అధికారంలోకి రాగానే మద్యం విక్రయాలను నియంత్రిస్తామని ఇచ్చిన హామీ మేరకు ముందుగా బెల్టుషాపులు నిర్మూలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఎక్సైజ్‌ అధికారులు గ్రామాల్లో అనధికారికంగా బెల్టు దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. ప్రస్తుతం అనుమతి ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల కాలపరిమితి జూన్‌ నెలాఖరుతో ముగిసింది. కొత్త మద్యం విక్రయాలపై ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు లేకపోవడంతో ప్రస్తుతం అనుమతి ఉన్న మద్యం దుకాణాలకు మరో మూడు నెలల కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆదాయాలు తగ్గిపోతుండటంతో సిండికేట్‌గా మద్యం వ్యాపారం చేస్తున్న వారు తమ వ్యూహాలు మార్చుకుంటున్నారు.

లాభం కోసమే ఎత్తుగడ
గ్రామాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో 90 శాతానికిపైగా సిండికేట్‌ రంగంలో పని చేస్తున్నాయి. మద్యం దుకాణం లైసెన్సు పొందేంతవరకు వ్యక్తిగతంగానే వ్యాపారులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు సాగించినా, లైసెన్సు మంజూరైన తర్వాత వ్యాపారులందరూ ఒక తాటిపైకి వచ్చి కలిసి కట్టుగా మద్యం వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఈ కారణంగానే బెల్టుషాపులు పెరుగుతున్నాయి. మద్యం వ్యాపారులందరూ సిండికేట్‌గా ఉండటంతో కాలపరిమితి ముగిసినా ఫీజులు చెల్లించి అదనంగా మూడు నెలలు లైసెన్సులు పొడిగిస్తున్నా మద్యం సిండికేట్‌ వ్యాపారులు ముందుకు రావడంలేదు. 

జిల్లాలో పరిస్థితి ఇలా
జిల్లాలో 534 మద్యం దుకాణాలున్నాయి. కొందరు మద్యం వ్యాపారులు ప్రస్తుతం ఉన్న లైసెన్సులను పునరుద్ధరించుకోవడం లేదు. ఎక్కడ మద్యం దుకాణం ఉన్నా అది ఆయా మండలాల వారీగా సిండికేట్‌ కావడంతో వ్యాపారులు ఆ మేరకు నష్టం జరగదని భావిస్తున్నారు. ఒక్కో మద్యం దుకాణానికి ఏడాదికి లైసెన్సు ఫీజు రూ.11.25 లక్షలు, పర్మిట్‌ రూమ్‌కు మరో రూ.5 లక్షలు. మొత్తంగా రూ.16.25 లక్షలను లైసెన్సు ఫీజులుగా వ్యాపారులు కడుతున్నారు. సగటున రూ. 4.70 లక్షలు ఫీజు, మరో లక్ష నిర్వహణ ఖర్చులు అవుతాయని వ్యాపారులు అంటున్నారు. ఈ లెక్కలు చూస్తే మూడు నెలలకు ఫీజులు చెల్లించడం లాభదాయకం కాదని మద్యం వ్యాపారులు అంటున్నారు. 99 మంది వ్యాపారులు తమ మద్యం దుకాణాలను పునరుద్ధరించుకోలేదు. మూడు నెలలపాటు గడువు పొడిగిస్తూ ఎక్సైజ్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల కాలానికి నగదు చెల్లించిన వారికి మాత్రమే పునరుద్ధరించారు. 45 బారులు ఉన్నాయి. వీటికి 2022 వరకు లైసెన్స్‌ ఉండడంతో అవి యథావిధిగా కొనసాగుతున్నాయి.

వీటిలో ఒక బార్‌కు సంబంధించి లైసెన్స్‌కు డబ్బులు కట్టకపోవడంతో దాన్ని నిలిపివేశారని జిల్లా ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏటా మద్యం దుకాణాలు తగ్గించడానికి ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. దీనికి తోడు బెల్టు షాపులు ఎక్కడా ఉండకూడదని అధికారులను ఆయన ఆదేశించడంతో ఎక్సైజ్‌ అధికారులు గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు దుకాణాలపై దాడులు ముమ్మరం చేస్తున్నారు. లైసెన్సు కాలపరిమితి ముగియడం, ప్రస్తుతం ఉన్న దుకాణాలకే మరో మూడు నెలల ఫీజులతో లైసెన్సు పునరుద్దరించుకోవాలని అధికారులు సూచించారు. మద్యం దుకాణాల వల్ల నష్టాలు వస్తాయనే ఉద్దేశ్యంతో కొందరు మూడు నెలల అదనపు కాలానికి ఫీజులు కట్టకుండా స్వచ్ఛందంగానే లైసెన్సులు వదిలేసుకుంటున్నారు. అధికార మద్యం దుకాణాలకు పాటదారులు ఫీజులు చెల్లించకపోవడంతో ఎక్సైజ్‌ అధికారులు వాటి లైసెన్సులు రుద్దు చేస్తున్నారు.

మద్యపానాన్ని దశల వారీగా నిషేధించడం హర్షణీయం
రాష్ట్ర ప్రభుత్వం మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తామని చెప్పడం హర్షణీయం. మద్యంతో కొన్ని వందల కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. యువత చిన్నతనంలోనే తాగుడుకు బానిసై వ్యాధులతో మరణిస్తున్నారు. కుటుంబంలో భర్త మద్యానికి బానిసై చనిపోతే మహిళ అగచాట్లు అన్నీఇన్నీకావు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తామని చెప్పడంతో దుకాణాదారులు సైతం ముందుకు రావడంలేదు.
–  పలివెల వీరబాబు, సీపీఐ నాయకుడు,  కాకినాడ

మద్యపానాన్ని నిషేధిస్తే రాష్ట్రాభివృద్ధి
రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధిస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. నూతన ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పింది. గత టీడీపీ ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారించింది. మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రభుత్వ ఆదాయంగా చంద్రబాబు పరిగణించారు. నూతన ప్రభుత్వం మద్యాన్ని పూర్తిస్థాయిలో నిషేధించాలి.
– ఎం.వీరలక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement