ఏడాదైనా నెరవేరని హామీ
- బెల్ట్ షాపులు ఎత్తేస్తామంటూ ఏడాది క్రితం ప్రకటన
- మామూళ్ల మత్తులో పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : సరిగ్గా ఏడాది క్రితం పంచాయతీ ఎన్నికల సందర్భంగా మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 45 రోజుల్లో బెల్ట్ షాపులు తొలగిస్తామంటూ ప్రకటించారు. ఆ ఎన్నికలు ముగిశాక ఈ హామీని పట్టించుకోలేదు.
దీంతో నేటికీ ఈ షాపులు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. రెండేళ్ల భారీ ఎత్తున ధరావతు చెల్లించి వ్యాపారులు మద్యం దుకాణాలు లాటరీలో దక్కించుకున్నారు. ఆ స్థాయిలో వ్యాపారం చేసి పెట్టుబడి, లాభాలు రాబట్టేందుకు అమ్మకాలు విపరీతంగా పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వ్యాపారులంతా వీధివీధిగా బెల్టుషాపులు ఏర్పాటు చేయగా దీనికి ఎక్సైజ్ అధికారులు తెరచాటు సహకారం అందించారు. ఇలాంటి సమయంలో గత ఏడాది పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి నెలరోజుల్లో బెల్ట్ షాపులు ఎత్తేస్తామంటూ ప్రకటించారు.
పట్టించుకోని అధికారులు
రాష్ట్రంలో బెల్ట్‌షాపులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం ప్రజల అభీష్టానికి తలొగ్గాల్సి వచ్చింది. దీనిపై గత ఏడాది మే 9న సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి 45 రోజుల్లో బెల్ట్ షాపులు తొలగించాలని ఆదేశించారు. ఇది జరిగి ఏడాది గడుస్తున్నా జిల్లా ఒక్క షాపునూ తొలగించలేదు. మధ్యలో కొన్ని షాపులపై దాడులు చేసినా అవి నానమాత్రమే అయ్యాయి.
వైన్‌షాపుల యాజమానులు షాపుల్లో లూజ్ సేల్స్, బెల్ట్ దుకాణాల ఏర్పాటుకు అనుమతిస్తున్న ఎకై ్సజ్ అధికారులు ఒక్కో షాపు నుంచి రూ. 20వేల వరకు అనధికార వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా నెలకు సుమారుగా రూ. 70లక్షల వరకు మామూళ్లు రూపేణా వసూలు చేస్తున్నారు. బెల్ట్ షాపులు తొలగిస్తే ఈ మామూళ్లకు గండి పడుతుందని భావించిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యడం లేదు.