belum
-
నడవలేక నడిచాడు.. ప్రాణాలు విడిచాడు..
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): అసలే కాలేయ వ్యాధి.. అడుగు తీసి వేయడానికి నరకయాతన పడుతున్నాడు.. ఆస్పత్రి ఓపీ వద్దకు వెళ్లాలంటే.. చాలా దూరం. తన భర్త అంతదూరం నడవలేడని భావించిన ఆ ఇల్లాలు స్ట్రెచర్/వీల్‌చైర్‌ను ఇవ్వాల్సిందిగా ఆస్పత్రి సిబ్బందిని వేడుకుంది. వారు కనికరించకపోవడంతో చేసేదేంలేక అతికష్టం మీద భర్తను నడిపించుకుంటూ తీసుకెళుతుండగా.. తీవ్ర అస్వస్థతకు గురై ఓపీ వద్ద మెట్లెక్కుతూ ప్రాణాలొదిలాడు. ఈ ఘటన గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చోటుచేసుకుంది. బెలుం గ్రామానికి చెందిన ఐజన్న కొద్దికాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం భార్య శిరోమణి ఓ వాహనంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చింది. ముందుగా సర్జికల్ ఓపీకి వెళ్లగా.. అక్కడి వైద్యులు పరీక్షించి జీర్ణకోశ వ్యాధుల విభాగం ఓపీ (ఓపీ నెం.26)కి వెళ్లాలని సూచించారు. అసలే నడవలేని మనిషి.. ఆ ఓపీ విభాగం ఎక్కడుందో చూసొస్తే బాగుంటుందని భర్తను అక్కడే ఉంచి ఓపీ వద్దకెళ్లింది. తన భర్త ఇంత దూరం నడవలేడని భావించి.. క్యాజువాలిటీకి వెళ్లి అతని పరిస్థితిని వివరించిం స్ట్రెచర్/వీల్‌చైర్ ఇవ్వాలని బతిమాలింది. ఇక్కడి రోగులకే స్ట్రెచర్ ఇస్తామని, బయటి వారికి ఇచ్చేదిలేదని సిబ్బంది చెప్పడంతో చేసేదేంలేక భర్తను మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళుతుండగా అలసిపోయి పడిపోయాడు. సపర్యలు చేశాక మొదటి అంతస్తులో ఉండే ఓపీ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఐదు మెట్లు ఎక్కగానే ఐజన్న తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. -
9 నుంచి బెలుం గుహల్లో సినిమా షూటింగ్
కొలిమిగుండ్ల: బెలుం గుహల్లో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు సినిమా షూటింగ్ జరగనుంది. హీరో మహేష్‌బాబు నటిస్తున్న సినిమాలోని సన్నివేశాలను బెలుం గుహల్లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ఏపీ టూరిజం ఉన్నతాధికారులతో అనుమతి పొందినట్లు తెలుస్తోంది. గుహలకు రోజుకు రూ.50వేల చొప్పున నాలుగు రోజులకు మొత్తాన్ని చెల్లించినట్లు టూరిజం అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ జరిగే సన్నివేశాల్లో మహేష్‌బాబు పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. -
టూరిజం ఆదాయం పెంపునకు చర్యలు
కొలిమిగుండ్ల: జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాల ద్వారా టూరిజం ఆదాయం పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని టూరిజం డీవీఎం బాబ్జి పేర్కొన్నారు. బుధవారం బెలుం గుహలకు చేరుకొని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కర్నూలు డివిజన్ పరిధిలోని పర్యాటక ప్రదేశాల ద్వారా నెలకు కోటి రూపాయల ఆదాయం సమకూరుతుందన్నారు. వచ్చే ఫిబ్రవరి నాటికి అవుకు రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన బోటింగ్, రెస్టారెంట్ ప్రారంభమవుతుందన్నారు. గార్గేయపురంలో బోటింగ్ ఏర్పాటు చేశామన్నారు. బెలుం గుహలకు నీటి సమస్య తీవ్రంగా ఉందని వాటిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. బెలుం గుహల ద్వారా ఏటా రూ.80 లక్షల ఆదాయం వస్తుందన్నారు. మరింత ఆదాయం పెంచేందుకు ఇటీవలనే పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి గుహలను తిలకించేందుకు వచ్చే యాత్రికులకు టూరిజం తరఫున రెస్టారెంట్ ఓపెన్ చేశామన్నారు. గుహ లోపలి భాగాల్లో ఎల్ఈడీ లైట్లు అమర్చేందుకు నివేదికలు పంపామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవిలు ప్రోత్సహించేందుకు స్వైప్ మిషన్లు అమర్చామన్నారు. బెలుం గుహల ఆవరణంలో ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారని..త్వరలోనే కార్యరూపం దాల్చుతుందన్నారు. -
బెలుం గుహల్లో ఆర్మీ కల్నల్
కొలిమిగుండ్ల: బెలుం గుహలను శనివారం సికింద్రాబాద్‌కు చెందిన ఇండియన్ ఆర్మీ కల్నల్(ఐజీ) అతుల్గోషిక్ కుటుంబ సభ్యులతో కలసి సందర్శించారు. గుహల సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గుహ లోపల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పలు ఆకారాలను తిలకించారు. భూమి లోపల గుహలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఆధ్మాత్మిక సంగీతం ఏర్పాటు చేస్తే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. విహార యాత్రలో భాగంగా జిల్లాలోని రాక్గార్డెన్స్తో పాటు అవుకు రిజర్వాయర్ తిలకించామన్నారు. అనంతరం మార్గమధ్యలో కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆగి ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్యతో ముచ్చటించారు. -
బెలుం గుహల్లో విదేశీయుల బృందం
కొలిమిగుండ్ల: ప్రఖ్యాత బెలుం గుహలను శనివారం విదేశీయులు తిలకించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కార్యక్రమాల అమలు తీరును అధ్యయనం చేసేందుకు అల్జీరియా, సూడాన్, ఇథోఫియా, ఘనా, మారిషస్, నేపాల్, లిబియా, సిరియా,టాంజానియా తదితర.. 14 దేశాల నుంచి 28 మంది వచ్చారు. బెలుం గుహలో పలు ప్రదేశాలను తిలకించారు. వారి వెంట ఎన్ఐఆర్డీ అధికారి నరసింహులు, ఆర్‌డబ్లూఎస్ ఈఈ వెంకట రమణ, ఎస్ఈ వీరభద్రరావు, డీఈ ఉమామహేశ్వరరావు ఉన్నారు.