కొలిమిగుండ్ల: జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాల ద్వారా టూరిజం ఆదాయం పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని టూరిజం డీవీఎం బాబ్జి పేర్కొన్నారు. బుధవారం బెలుం గుహలకు చేరుకొని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కర్నూలు డివిజన్ పరిధిలోని పర్యాటక ప్రదేశాల ద్వారా నెలకు కోటి రూపాయల ఆదాయం సమకూరుతుందన్నారు. వచ్చే ఫిబ్రవరి నాటికి అవుకు రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన బోటింగ్, రెస్టారెంట్ ప్రారంభమవుతుందన్నారు. గార్గేయపురంలో బోటింగ్ ఏర్పాటు చేశామన్నారు. బెలుం గుహలకు నీటి సమస్య తీవ్రంగా ఉందని వాటిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. బెలుం గుహల ద్వారా ఏటా రూ.80 లక్షల ఆదాయం వస్తుందన్నారు. మరింత ఆదాయం పెంచేందుకు ఇటీవలనే పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి గుహలను తిలకించేందుకు వచ్చే యాత్రికులకు టూరిజం తరఫున రెస్టారెంట్ ఓపెన్ చేశామన్నారు. గుహ లోపలి భాగాల్లో ఎల్‌ఈడీ లైట్లు అమర్చేందుకు నివేదికలు పంపామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవిలు ప్రోత్సహించేందుకు స్వైప్ మిషన్‌లు అమర్చామన్నారు. బెలుం గుహల ఆవరణంలో ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారని..త్వరలోనే కార్యరూపం దాల్చుతుందన్నారు.