రెడీ.. ‘చార్జ్’షీట్!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:బినామీల పేరిట లెసైన్సులు.. సిండికేట్గా ఏర్పడి ధరలను ఇష్టారాజ్యంగా పెంచేయడం.. తప్పుల తడకలుగా రికార్డుల నిర్వహణ.. ఇలా చెప్పుకొంటూపోతే రెండేళ్ల క్రితం వరకు మద్యం మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోయింది. ఎక్సైజ్, పోలీసులు అధికారులు, సిబ్బంది అండ చూసుకొని మద్యం మారాజులు తెగ రెచ్చిపోయారు. రెండేళ్లక్రితం అవినీతి నిరోధక శాఖ పంజా విసిరి, దాడులు చేయడంతో వీరి బండారం బయటపడింది. అప్పటినుంచి కొనసాగుతున్న ఈ కేసు విచారణ ఎట్టకేలకు తది దశకు చేరుకుంది. విచారణాధికారులు చార్జిషీట్లు కూడా ఇటీవలే దాఖలు చేయడంతో ఇక హైకోర్టు తీర్పు ఇవ్వడం.. మద్యం బాస్లు కటకటాలు పాలు కావడమే మిగిలింది.
ఒక్కసారి వెనక్కి వెళితే..
జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లోని సుమారు 232 మద్యం దుకాణాల్లో అధిక శాతం సిండికేట్ల చేతుల్లోనే ఉండేవి. వీటిలో చాలా దుకాణాలు తెల్లరేషన్ కార్డుదారులను బినామీలుగా పెట్టి బడాబాబులు లెసైన్సు పొందినవే. ఇలా గుత్తగా గుప్పిట్లో పెట్టుకున్న షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అమలు చేయడం మానేశారు. సిండికేట్ నిర్ణయించిన అధిక ధరలకు అమ్మకాలు సాగించి యథేచ్ఛగా మందుబాబులను దోచుకున్నారు. అమ్మకాలకు సంబంధించి రికార్డుల నిర్వహణలోనూ చేతివాటం చూపారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. ఎక్సైజ్, పోలీస్ అధికారులకు లంచాల ముడుపులు కట్టి వారి చేతులు కట్టేశారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఏసీబీ విస్తృత దాడులు జరిపి మద్యం మాఫియా భరతం పట్టింది. శ్రీకాకుళం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో పలువురు జైలుపాలు కాగా.. మరెంతోమందిపై విచారణ ప్రారంభమైంది. అయితే ఏళ్ల తరబడి విచారణ కొనసాగుతుండటంపై సాక్షాత్తు హైకోర్టు మొట్టికాయిలు వేసింది. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించడంతో ఉరుకులు, పరుగుల మీద ఏసీబీ అధికారులు పని ముగించారు.
ఎంతమందిపై కేసులు
మద్యం షాపుల్లో పనిచేసిన అకౌంటెంట్లు, తెల్ల రేషన్కార్టుదారులతో పాటు ముగ్గురు మద్యం వ్యాపారులు, సీఐ నుంచి ఉన్నతాధికారి స్థాయి వరకు ఎక్సైజ్ అధికారులు, పలు స్టేషన్ల పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లపైనా ఏసీబీ కేసులు నమోదు చేసింది. కొందరిని జైలుకు కూడా పంపించారు. ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన ఏర్పడిన తరువాత పెండింగ్లో ఉన్న కేసులను ‘శాంక్షన్ ఆర్డర్ల’ పేరిట పరిష్కరించాలని నిర్ణయించడంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని కేసులూ ముగింపు దశకు వచ్చాయి. అందులో భాగంగానే మద్యం కేసులోనూ చార్జిషీటు దాఖలైంది.
ప్రస్తుత పరిస్థితి ఇదీ
కేసు పూర్తయితేనే రాష్ట్ర విభజన నేపథ్యంలో బదిలీ కావాల్సిన సిబ్బందిని వారి ప్రాంతాలకు పంపిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో అధికారులూ అంతే స్పీడుగా విచారణ పూర్తిచేశారు. అయితే పలువురు ఎక్సైజ్ సిబ్బంది, పోలీసులపై ట్రైబ్యునల్, బెనిఫిట్ ఆఫ్ డౌట్, డిపార్టమెంటల్ యాక్షన్, డిసిప్లినరీ యాక్షన్లు కోరుతూ ఆయా శాఖల విభాగాధిపతులకు లేఖలు రాశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ కొటారు రామకృష్ణ, కానిస్టేబుల్ అప్పన్న, మద్యం వ్యాపారి ఓరుగంటి ఈశ్వరరావు, ముగ్గురు అకౌంటెంట్లకు త్వరలోనే జైలు శిక్ష ఖాయమవుతుందని ఏసీబీ అధికారులే చెబుతున్నారు.
‘ఓ కానిస్టేబుల్ జీతం రూ.15వేలు కాగా.. అతనికి నెలనెలా వచ్చే మామూళ్లు సుమారు రూ.30 వేలు ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చని’ ఓ దర్యాప్తు అధికారి వ్యాఖ్యానించారు. మరికొందరు కిందిస్థాయి సిబ్బంది మద్యం మామూళ్లతోనే వాహనాలు కొనుగోలు చేసి ప్రభుత్వ శాఖలకు అద్దెకివ్వడంతోపాటు మద్యం దుకాణాల్లో భాగస్వాములుగా ఉండేవారని ఆ అధికారి చెప్పారు. అటువంటి వారెవరూ ఈ కేసు నుంచి తప్పించుకోలేరని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ జైలు శిక్ష పడకపోయినా.. ఉద్యోగం నుంచి తొల గింపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలుపుదల వంటి శిక్షలు తప్పవని అన్నారు.