బెంగాల్ వ్యాపారి అవయవదానం
పంజగుట్ట: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యాపారి నగరంలో ఉంటున్న తన కొడుకును చూసేందుకు వచ్చి బాత్రూమ్లో కాలు జారిపడ్డాడు. బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అతని అవయవాలు దానం చేసేందు కు ముందుకు వచ్చి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్‌కు చెందిన సోమనాథ్ (64) గచ్చిబౌలిలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్న తన కొడుకు నిలంజన్ జానను చూసేందుకు అతని భార్య కల్పనతో కలిసి నగరానికి వచ్చాడు.
ఈనెల 11 వ తేదీన సోమనాథ్ బాత్రూమ్లో కాలు జారి పడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అతనికి ఈనెల 12వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జీవన్‌దాన్ బృందం అతని కుటుంబ సభ్యులకు అవయవదానం ఆవశ్యకతను వివరించగా, వారు ఒప్పుకున్నారు. సోమనాథ్‌కు శస్త్రచికిత్సలు నిర్వహించి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను భద్రపరిచారు.