benifit of government
-
పట్టాలు సరే భూములేవి!
నాగిరెడ్డిపేట(నిజామాబాద్): భూమిలేని నిరుపేదలకు ఒక్కో కుటుంబానికి మూడెకరాల భూమి ని అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న భూ పంపిణీ పథకం లక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది. లబ్ధిదారులకు మూడెకరాల చొ ప్పున భూమిని పంపిణీ చేయాల్సి ఉం డగా.. నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో మాత్రం పట్టాలు మాత్రమే ఇచ్చి భూముల విషయం మరిచారు. దీంతో లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. అసలేం జరిగింది... భూ పంపిణీ పథకం కింద మాల్తుమ్మెద గ్రామంలో మొదటి విడతలో షెడ్యూల్కులాలకు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేశారు. రెండోవిడతలో మరో ఎనిమిది మందిని ఎంపికచేసిన అధికారులు.. వారికి భూమిని పంపిణీ చేయడానికి అవసరమైన భూమిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ఇదే గ్రామానికి చెందిన 16 మంది రైతులను సంప్రదించారు. గ్రామస్తుల సమక్షంలో పలుమార్లు వారితో చర్చలు జరిపిన అనంతరం వారి భూములను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. సుమారు 23 ఎకరాల 35 గుంటల భూమిని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తుల సమక్షంలో అప్పటి జాయింట్ కలెక్టర్ సత్తయ్య సమావేశాలు నిర్వహించారు. ఎకరాకు రూ. 4.80 లక్షల చొప్పున చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. 16 మంది పట్టాదారులలో ఇద్దరికి సంబంధించిన భూమి సాగుకు అనుకూలంగా ఉండడంతో వారికి మాత్రం ఎకరాకు రూ. 5లక్షల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. అయితే బడ్జెట్ లేకపోవడంతో పట్టాదారులకు డబ్బుల చెల్లింపులో జాప్యం జరిగింది. మరోవైపు పట్టాదారులకు డబ్బులు చెల్లించకుండానే భూ పంపిణీ పథకానికి ఎంపికచేసిన ఎనిమిది మంది పేరిట అంబేద్కర్ జయంతి రోజున జిల్లాకేంద్రంలో కలెక్టర్ చేతులమీదుగా పట్టాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులలో ఎవరెవరికి ఏ ఏ సర్వేనంబర్లలో ఎంతెంత భూమి ఉందో పట్టా సర్టిఫికెట్లలో వివరంగా పేర్కొన్నారు. లబ్ధిదారులకు పట్టాలను మాత్రమే పంపిణీ చేసిన అధికారులు వారికి భూములను మాత్రం చూపలేదు. తమకు డబ్బులు చెల్లించేవరకు తమ భూముల్లోకి లబ్ధిదారులను రానిచ్చేదిలేదని పట్టాదారులు స్పష్టం చేశారు. భూమి కోసం లబ్ధిదారులు తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సాగుకు నోచుకోక బీళ్లుగా... లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఎంపికచేసిన మాల్తుమ్మెద గ్రామశివారులోని వ్యవసాయ భూముల్లో ఎలాంటి పంటలూ సాగు చేయడం లేదు. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉందన్న కారణంతో ఆ భూముల్లో ఎలాంటి పంటలు వేయవద్దని భూములను విక్రయించాడని ముందుకు వచ్చిన రైతులకు అధికారులు సూచించారు. దీంతో వారు పంటలు వేయడం లేదు. మరోవైపు తమకు డబ్బులు ఇచ్చేంతవరకు భూములపై హక్కు వదులుకునేది లేదని పట్టాదారులు పేర్కొంటున్నారు. దీంతో భూములు బీళ్లుగానే ఉంటున్నాయి. భూములను విక్రయించేందుకు విముఖత గతంలో తమ భూములను విక్రయించేందుకు ముందుకు వచ్చిన రైతుల్లో ఐదుగురు ప్రస్తుతం భూమిని ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు. వీరికి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. తీర్మానం చేసిన సమయంలో నిర్ణయించిన ధరకంటే ప్రస్తు తం తమ భూముల ధరలు పెరిగాయంటున్నారు. మరోవైపు మాల్తుమ్మెద గ్రామంలో భూ పంపిణీకి ఎంపికైన లబ్ధిదారులు కటిక పేదరికంలో మగ్గుతున్నారు. ఈ క్రమంలో అధికారులు మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేస్తామని చెప్పడంతో వారిలో ఆశలు రెకెత్తాయి. కానీ పట్టాలు ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా భూములు చూపకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఊళ్లో పనిదొరక్క వలస వెళ్తున్నారు. ఐదుగురు లబ్ధిదారులు హైదరాబాద్, ఆర్మూర్ ప్రాంతానికి వలస వెళ్లారు. పట్టాలు ఇచ్చి భూములను మరిసిండ్రు మూడు ఎకరాల భూమి ఇస్తామం టే మాకు ధైర్యం వచ్చింది. బతుకు మీద భరోసా కలిగింది. కానీ ఇప్పుడు ఊట్టి కాగితాలే ఉన్నయి. మాకు ఇంకా భూములు సూపట్టలేదు. మాకు భూములను పంచుతామని చెప్పిన అధికారులు పట్టాలను ఇచ్చి భూములను మరిసినట్టుండ్రు. – నీరుడి రణీల, లబ్ధిదారు, మాల్తుమ్మెద ఊట్టి కాగితాలే ఇచ్చిండ్రు మూడెకరాల భూమి ఇస్తమని చెప్పిన సార్లు ఊట్టి కాగితాలే చేతిల పెట్టిండ్రు. మాకు ఇచ్చిన భూమి యాడున్నదో తెలుస్తలేదు. భూముల పైసలు ఇయ్యలేదని వాటి పట్టాదార్లు మమల్ని ఆ భూములళ్లకు రానిస్తలేరు. పెద్దసార్లు దయసూపి మాకు భూములు సూపెట్టాలే. – రాజిపేట లక్ష్మి, లబ్ధిదారు, మాల్తుమ్మెద కలెక్టర్కు నివేదిక అందించాం మాల్తుమ్మెదలో భూ పంపిణీ పథకానికి రెం డోవిడతగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు సం బంధించి ఇటీవలే కలెక్టర్కు నివేదికను పంపా ను. భూమిని కొనుగోలు చేయకుండా లబ్ధిదారులకు పట్టాలెలా ఇచ్చారో నాకు కూడా అర్థం కావడంలేదు. భూమిని విక్రయించేందుకు ముందుకు వచ్చిన పట్టాదారుల్లో కొంతమంది రైతులు అప్పుడు నిర్ణయించిన ధరలకు వారి భూములను అమ్మదానికి ప్రస్తుతం ముందుకు రావడంలేదు. దీంతో ముందుగా ఎంపికచేసిన లబ్ధిదారులకు భూ పంపిణీ సమస్యగా మారింది. కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. – సయ్యద్ అహ్మద్ మస్రూ, తహసీల్దార్, నాగిరెడ్డిపేట -
తాగినోళ్లకు తాగినంత
– మద్యం వ్యాపారంతో ప్రభుత్వ ఖజానా గలగల – ఏటా పెరుగుతున్న మద్యం విక్రయాలు – నూతన బార్ పాలసీ విధానంతో మరింత ఆదాయం జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. తాగినోళ్లకు తాగినంత పోసేస్తున్నారు. ప్రతి ఏటా మద్యం విక్రయాలు పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. మద్యం వ్యాపారంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గలగలమంటోంది. నూతన బార్ పాలసీ విధానంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరనుంది. - అనంతపురం సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం వ్యాపారం కీలక ఆదాయ వనరుగా మారుతోంది. దీంతో జిల్లాలో మద్యం వ్యాపారానికి ఆంక్షలు పూర్తిగా సడలించారు. తెల్లవారుజాము నుంచి అర్దరాత్రి వరకూ విక్రయించుకున్నా అడిగేవారు. కాకా హోటల్ నుంచి డాబాల వరకూ ఎక్కడైనా మద్యం లభిస్తోంది. దీంతో మద్యపాన ప్రియులు తాగుడుకు పూర్తిగా బానిసలవుతుంటో.. మరో వైపు ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతోంది. జిల్లాలో 240 మద్యం దుకాణాలు, 8 బార్ల ద్వారా (బెల్టుషాపులు కలుపుకొని) ప్రతి ఏడాది సగటున రూ.800 కోట్ల పైచిలుకు మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. బెల్టుషాపులు ఎత్తేస్తామని.. అధికారంలోకి వస్తే బెల్టుషాపులను ఎత్తేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన తొలి ఐదు సంతకాలలో బెల్టుషాపులు నిర్మూలన అంశం కూడా ఉంది. దీంతో ఇక రాష్ట్రంలో బెల్టుషాపులుండవని అందరూ భావించారు. కానీ సర్కార్ మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడంతో ఊరు, వాడా బెల్టుషాపులు వెలిశాయి. జిల్లాలో బెల్టుషాపులు లేని గ్రామాలే లేవంటే అతిశయోక్తి కాదు. ఒక్కో గ్రామంలో రెండు, మూడేసి చొప్పున బెల్టుషాపులు వెలిశాయి. వీటి వలన మద్యం వ్యాపారం గణనీయంగా పెరిగి ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. జిల్లా నుంచే ప్రతి ఏడాది రూ.800 కోట్లుకు పైగా విక్రయాలు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా మరేస్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోందో అర్థం చేసుకోవచ్చు. నూతన బార్ పాలసీ విధానంతో : ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ విధానంతో మద్యం వ్యాపారం రెట్టింపుస్థాయిలో సాగనుంది. ఇప్పటి వరకూ జిల్లాలో కేవలం 8 మాత్రమే బార్లు ఉండేవి. నూతన పాలసీతో ఆ సంఖ్య 32కు చేరుకుంటోంది. ఈ మేరకు అనంతపురం నగరంలో 8, తాడిపత్రిలో 3, గుంతకల్లులో 4, రాయదుర్గంలో 2, గుత్తిలో 1, పామిడిలో 1, ధర్మవరంలో 4, హిందూపురంలో 5, కదిరిలో 2, కళ్యాణదుర్గంలో 1, మడకశిరలో 1 చొప్పున జూలై ఒకటో తేదీ నుంచి బార్లు ఏర్పాటు కానున్నాయి. అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం మినహా ఇప్పటి వరకు మిగిలిన ప్రాంతాల్లో బార్లు లేవు. సుప్రీంకోర్టు మొట్టికాయ వేసేంత వరకు.. జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే మూసివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు వీటి వలన జరుగుతున్న అనర్థాలపై అధికారులు దృష్టి సారించలేదు. జిల్లాలో 240 మద్యం దుకాణాలు ఉంటే 200 పైబడి దుకాణాలు రహదారులపైనే ఉండడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే గత కొన్నేళ్లుగా మద్యం వ్యాపార సామ్రాజ్యాన్ని హైవేలపైనే విస్తరించుకున్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాల రావడంతో ప్రస్తుతం 500 మీటర్ల దూరానికి జరుపుకుంటున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి హైవేలపై ఉండకూడదని ఆదేశాలు అందాయి. దీంతో మద్యం దుకాణాదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో మద్యం విక్రయాలు ఇలా ...: సంవత్సరం మద్యం విక్రయాలు 2013–14 రూ. 555 కోట్లు 2014–15 రూ. 631 కోట్లు 2015–16 రూ. 688 కోట్లు 2016–17 రూ. 816 కోట్లు