అధికారులు అందించిన పట్టాలను చూపుతున్న లబ్ధిదారులు మాల్తుమ్మెదలో భూ పంపిణీకి పరిశీలించిన భూమి
నాగిరెడ్డిపేట(నిజామాబాద్): భూమిలేని నిరుపేదలకు ఒక్కో కుటుంబానికి మూడెకరాల భూమి ని అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న భూ పంపిణీ పథకం లక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది. లబ్ధిదారులకు మూడెకరాల చొ ప్పున భూమిని పంపిణీ చేయాల్సి ఉం డగా.. నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో మాత్రం పట్టాలు మాత్రమే ఇచ్చి భూముల విషయం మరిచారు. దీంతో లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు.
అసలేం జరిగింది...
భూ పంపిణీ పథకం కింద మాల్తుమ్మెద గ్రామంలో మొదటి విడతలో షెడ్యూల్‌కులాలకు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేశారు. రెండోవిడతలో మరో ఎనిమిది మందిని ఎంపికచేసిన అధికారులు.. వారికి భూమిని పంపిణీ చేయడానికి అవసరమైన భూమిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ఇదే గ్రామానికి చెందిన 16 మంది రైతులను సంప్రదించారు. గ్రామస్తుల సమక్షంలో పలుమార్లు వారితో చర్చలు జరిపిన అనంతరం వారి భూములను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. సుమారు 23 ఎకరాల 35 గుంటల భూమిని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తుల సమక్షంలో అప్పటి జాయింట్ కలెక్టర్ సత్తయ్య సమావేశాలు నిర్వహించారు. ఎకరాకు రూ. 4.80 లక్షల చొప్పున చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. 16 మంది పట్టాదారులలో ఇద్దరికి సంబంధించిన భూమి సాగుకు అనుకూలంగా ఉండడంతో వారికి మాత్రం ఎకరాకు రూ. 5లక్షల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. అయితే బడ్జెట్ లేకపోవడంతో పట్టాదారులకు డబ్బుల చెల్లింపులో జాప్యం జరిగింది.
మరోవైపు పట్టాదారులకు డబ్బులు చెల్లించకుండానే భూ పంపిణీ పథకానికి ఎంపికచేసిన ఎనిమిది మంది పేరిట అంబేద్కర్ జయంతి రోజున జిల్లాకేంద్రంలో కలెక్టర్ చేతులమీదుగా పట్టాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులలో ఎవరెవరికి ఏ ఏ సర్వేనంబర్లలో ఎంతెంత భూమి ఉందో పట్టా సర్టిఫికెట్లలో వివరంగా పేర్కొన్నారు. లబ్ధిదారులకు పట్టాలను మాత్రమే పంపిణీ చేసిన అధికారులు వారికి భూములను మాత్రం చూపలేదు. తమకు డబ్బులు చెల్లించేవరకు తమ భూముల్లోకి లబ్ధిదారులను రానిచ్చేదిలేదని పట్టాదారులు స్పష్టం చేశారు. భూమి కోసం లబ్ధిదారులు తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
సాగుకు నోచుకోక బీళ్లుగా...
లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఎంపికచేసిన మాల్తుమ్మెద గ్రామశివారులోని వ్యవసాయ భూముల్లో ఎలాంటి పంటలూ సాగు చేయడం లేదు. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉందన్న కారణంతో ఆ భూముల్లో ఎలాంటి పంటలు వేయవద్దని భూములను విక్రయించాడని ముందుకు వచ్చిన రైతులకు అధికారులు సూచించారు. దీంతో వారు పంటలు వేయడం లేదు. మరోవైపు తమకు డబ్బులు ఇచ్చేంతవరకు భూములపై హక్కు వదులుకునేది లేదని పట్టాదారులు పేర్కొంటున్నారు. దీంతో భూములు బీళ్లుగానే ఉంటున్నాయి.
భూములను విక్రయించేందుకు విముఖత
గతంలో తమ భూములను విక్రయించేందుకు ముందుకు వచ్చిన రైతుల్లో ఐదుగురు ప్రస్తుతం భూమిని ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు. వీరికి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. తీర్మానం చేసిన సమయంలో నిర్ణయించిన ధరకంటే ప్రస్తు తం తమ భూముల ధరలు పెరిగాయంటున్నారు. మరోవైపు మాల్తుమ్మెద గ్రామంలో భూ పంపిణీకి ఎంపికైన లబ్ధిదారులు కటిక పేదరికంలో మగ్గుతున్నారు. ఈ క్రమంలో అధికారులు మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేస్తామని చెప్పడంతో వారిలో ఆశలు రెకెత్తాయి. కానీ పట్టాలు ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా భూములు చూపకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఊళ్లో పనిదొరక్క వలస వెళ్తున్నారు. ఐదుగురు లబ్ధిదారులు హైదరాబాద్, ఆర్మూర్ ప్రాంతానికి వలస వెళ్లారు.
పట్టాలు ఇచ్చి భూములను మరిసిండ్రు
మూడు ఎకరాల భూమి ఇస్తామం టే మాకు ధైర్యం వచ్చింది. బతుకు మీద భరోసా కలిగింది. కానీ ఇప్పుడు ఊట్టి కాగితాలే ఉన్నయి. మాకు ఇంకా భూములు సూపట్టలేదు. మాకు భూములను పంచుతామని చెప్పిన అధికారులు పట్టాలను ఇచ్చి భూములను మరిసినట్టుండ్రు. – నీరుడి రణీల, లబ్ధిదారు, మాల్తుమ్మెద
ఊట్టి కాగితాలే ఇచ్చిండ్రు
మూడెకరాల భూమి ఇస్తమని చెప్పిన సార్లు ఊట్టి కాగితాలే చేతిల పెట్టిండ్రు. మాకు ఇచ్చిన భూమి యాడున్నదో తెలుస్తలేదు. భూముల పైసలు ఇయ్యలేదని వాటి పట్టాదార్లు మమల్ని ఆ భూములళ్లకు రానిస్తలేరు. పెద్దసార్లు దయసూపి మాకు భూములు సూపెట్టాలే. – రాజిపేట లక్ష్మి, లబ్ధిదారు, మాల్తుమ్మెద
కలెక్టర్‌కు నివేదిక అందించాం
మాల్తుమ్మెదలో భూ పంపిణీ పథకానికి రెం డోవిడతగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు సం బంధించి ఇటీవలే కలెక్టర్‌కు నివేదికను పంపా ను. భూమిని కొనుగోలు చేయకుండా లబ్ధిదారులకు పట్టాలెలా ఇచ్చారో నాకు కూడా అర్థం కావడంలేదు. భూమిని విక్రయించేందుకు ముందుకు వచ్చిన పట్టాదారుల్లో కొంతమంది రైతులు అప్పుడు నిర్ణయించిన ధరలకు వారి భూములను అమ్మదానికి ప్రస్తుతం ముందుకు రావడంలేదు. దీంతో ముందుగా ఎంపికచేసిన లబ్ధిదారులకు భూ పంపిణీ సమస్యగా మారింది. కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. – సయ్యద్ అహ్మద్ మస్రూ,
తహసీల్దార్, నాగిరెడ్డిపేట
Comments
Please login to add a commentAdd a comment