సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో అధికారులు కొత్త షరతు విధించారు. నిధులు దుర్వినియోగం కాకుండా కరీంనగర్ కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. రెండో విడత దళితబంధు కోసం దరఖాస్తు చేసుకునే వారంతా కొటేషన్, వ్యాపారి జారీచేసే అఫిడవిట్ కలిగి ఉండాలని నిబంధన పెట్టారు. హుజూరాబాద్‌లో లబ్ధిదారులకు నిధుల మంజూరులో సమస్యలు తలెత్తాయన్న విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారని సమాచారం.
అందుకే, యూనిట్లకు సంబంధించి విస్తరణ, వ్యాపారవృద్ధిలో పారదర్శకతను మరింత పెంచేలా చర్యలు చేపట్టారు. ఇకపై రెండో విడత కోసం దరఖాస్తు చేసుకునే ప్రతీ లబ్ధిదారుడు తాను సామగ్రి తీసుకునే వ్యాపారి నిజాయితీని చాటేలా అఫిడవిట్ ఇవ్వాల్సిందేనన్న రూల్ అమల్లోకి తీసుకువచ్చారు. క్షేత్రస్థాయిలో అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దళితబంధు పథకం అమలులో కొందరు నేతలు కమీషన్లు తీసుకుంటున్నారన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో కలెక్టర్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
నేపథ్యమిదీ..
హుజరాబాద్ ఉప ఎన్నికకు ముందు దళితుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు ప్రారంభించింది. పథకంలో భాగంగా అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. ఆర్థిక అసమానతలను రూపుమాపడం ద్వారా దళితులంతా సామాజిక సమానత్వం సాధించాలన్న లక్ష్యంతో ఈ పథకానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు.
నియోజకవర్గంలోని శాలపల్లి వేదికగా పథకాన్ని ముఖ్యమంత్రి లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు అందజేసి ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు రెండేళ్లకాలంలో హుజూరాబాద్, ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్ (హన్మకొండ జిల్లా) మండలాల్లో లబ్ధిదారులను గుర్తించి మొత్తం 18,021 దళిత కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేశారు. ఇందులో 14,080 కుటుంబాలు కరీంనగర్ జిల్లాలో ఉండగా.. మిగిలిన 3,941 కుటుంబాలు కమలాపూర్ మండలంలో ఉన్నాయి.
గోల్‌మాల్‌కు యత్నం?
జిల్లాలో మొత్తం 18,021 మంది దళితబంధు కోసం దరఖాస్తు చేసుకోగా 14,080 మంది అర్హులని అధికారులు తేల్చారు. వీరిలో 10,970 కుటుంబాలకు పూర్తిస్థాయిలో రూ.10 లక్షల (రూ.9.80 లక్షల, రూ. 20 వేలు బీమా) మేర ఆర్థిక సాయం అందించారు. ఇందులో వివిధ వ్యాపారాలతోపాటు, తయారీ, ఉత్పత్తి, డెయిరీ, పౌల్ట్రీ మోటారు వాహనయూనిట్లు , మిగిలిన 3,100 మంది మాత్రం రిటైల్ యూనిట్లు ఎంచుకున్నారు. తొలివిడతగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నిధులు డ్రాచేసుకుని వ్యాపారాలు ప్రారంభించారు. వీరిలో కొందరు రెండో విడత కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అందులో భాగంగా యూనిట్‌కు సంబంధించిన సామగ్రి కొటేషన్ కూడా దళితబంధు యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కొందరు గుర్తింపులేని సంస్థల నుంచి కొటేషన్స్ తీసుకున్న విషయాన్ని మండలాల్లోని క్లస్టర్ ఆఫీసర్లు గుర్తించారు. అలాంటి కొటేషన్లు మంజూరు చేస్తే.. నిధులు దారి మళ్లే ప్రమాదముంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే అనుమానాస్పద దరఖాస్తులను తిరస్కరించారు. దీనికితోడు కొందరు దళారులు తాము కొటేషన్లు ఇస్తామంటూ నిరక్షరాస్యులైన లబ్ధిదారుల వద్ద డబ్బులు కూడా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోయాయి. మరోవైపు గుర్తింపులేని చాలా సంస్థల వద్ద సరుకు కోసం డబ్బులు కట్టినవారు మోసపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ లీగల్ అఫిడవిట్ నిబంధనను ప్రవేశపెట్టారు.
ఇవీ నిబంధనలు
♦ అఫిడవిట్ జారీ చేసే వ్యాపారి తప్పనిసరిగా జీఎస్టీ నెంబరును కలిగి ఉండాలి.
♦ సదరు జీఎస్టీ నెంబరు కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే తీసుకున్నది అయి ఉండాలి. తద్వారా నకిలీ ఇన్వాయిస్‌లకు అడ్డుకట్ట వేయవచ్చు.
♦ లబ్ధిదారులు హుజూరాబాద్ మండలాలైన హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట వ్యాపారుల నుంచి రా మెటీరియల్ సప్‌లై కోసం ఇచ్చే కొటేషన్‌లు ♦ తీసుకోరు. ఇటీవల ములుగు నుంచి గుర్తింపు లేని ఓ సంస్థ కొటేషన్‌ను అధికారులు గుర్తించడమే ఇందుకు కారణం.
♦ లీగల్ అఫిడవిట్ మీద వ్యాపారి వివరాలు, దళితబంధు లబ్ధిదారులకు సరఫరా చేసే సామాగ్రి వివరాలు పొందుపరిచి ఉండాలి. అంతేకాదు, తానేమైనా తప్పుడు ♦ సమాచారం ఇచ్చి ఉంటే కలెక్టర్ తీసుకునే చట్టపరమైన చర్యలకు బద్ధుడినై ఉంటానంటూ సంతకం కూడా చేసి ఇవ్వాల్సి ఉంటుంది.
♦ లబ్ధిదారులు హుజూరాబాద్ కాకుండా హైదరాబాద్, కరీంనగర్, రాష్ట్రంలో జీఎస్టీ గుర్తింపు పొందిన ఏ వ్యాపారి వద్ద నుంచైనా కొటేషన్ తీసుకురావచ్చు. వాటిని ఎంపీడీవోలు వెరిఫై చేసి, ఉన్నతాధికారులకు పంపుతారు.
పారదర్శకత కోసమే
దళితబంధు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం. నిధుల మంజూరులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కొత్తగా లీగల్ అఫిడవిట్ విధానాన్ని ప్రవేశపెట్టాం. దీంతో లబ్ధిదారులకు నాణ్యమైన ముడిసరుకు లభిస్తుంది. తప్పుడు కొటేషన్లతో అటు ప్రభుత్వ అధికారులు, ఇటు లబ్ధిదారులను మోసం చేసే వీలు లేకుండా ఉంటుంది. దళారీ వ్యవస్థకు చెక్ పడనుంది. పథకం అమలులో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకత అమలు అయ్యేలా చూడటమే ప్రభుత్వ బాధ్యత.
– ఆర్వీ కర్ణన్, కలెక్టర్, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment