తాగినోళ్లకు తాగినంత
– మద్యం వ్యాపారంతో ప్రభుత్వ ఖజానా గలగల
– ఏటా పెరుగుతున్న మద్యం విక్రయాలు
– నూతన బార్ పాలసీ విధానంతో మరింత ఆదాయం
జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. తాగినోళ్లకు తాగినంత పోసేస్తున్నారు. ప్రతి ఏటా మద్యం విక్రయాలు పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. మద్యం వ్యాపారంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గలగలమంటోంది. నూతన బార్ పాలసీ విధానంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరనుంది.
- అనంతపురం సెంట్రల్
రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం వ్యాపారం కీలక ఆదాయ వనరుగా మారుతోంది. దీంతో జిల్లాలో మద్యం వ్యాపారానికి ఆంక్షలు పూర్తిగా సడలించారు. తెల్లవారుజాము నుంచి అర్దరాత్రి వరకూ విక్రయించుకున్నా అడిగేవారు. కాకా హోటల్ నుంచి డాబాల వరకూ ఎక్కడైనా మద్యం లభిస్తోంది. దీంతో మద్యపాన ప్రియులు తాగుడుకు పూర్తిగా బానిసలవుతుంటో.. మరో వైపు ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతోంది. జిల్లాలో 240 మద్యం దుకాణాలు, 8 బార్‌ల ద్వారా (బెల్టుషాపులు కలుపుకొని) ప్రతి ఏడాది సగటున రూ.800 కోట్ల పైచిలుకు మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది.
బెల్టుషాపులు ఎత్తేస్తామని..
అధికారంలోకి వస్తే బెల్టుషాపులను ఎత్తేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన తొలి ఐదు సంతకాలలో బెల్టుషాపులు నిర్మూలన అంశం కూడా ఉంది. దీంతో ఇక రాష్ట్రంలో బెల్టుషాపులుండవని అందరూ భావించారు. కానీ సర్కార్ మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడంతో ఊరు, వాడా బెల్టుషాపులు వెలిశాయి. జిల్లాలో బెల్టుషాపులు లేని గ్రామాలే లేవంటే అతిశయోక్తి కాదు. ఒక్కో గ్రామంలో రెండు, మూడేసి చొప్పున బెల్టుషాపులు వెలిశాయి. వీటి వలన మద్యం వ్యాపారం గణనీయంగా పెరిగి ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. జిల్లా నుంచే ప్రతి ఏడాది రూ.800 కోట్లుకు పైగా విక్రయాలు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా మరేస్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోందో అర్థం చేసుకోవచ్చు.
నూతన బార్ పాలసీ విధానంతో :
ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ విధానంతో మద్యం వ్యాపారం రెట్టింపుస్థాయిలో సాగనుంది. ఇప్పటి వరకూ జిల్లాలో కేవలం 8 మాత్రమే బార్లు ఉండేవి. నూతన పాలసీతో ఆ సంఖ్య 32కు చేరుకుంటోంది. ఈ మేరకు అనంతపురం నగరంలో 8, తాడిపత్రిలో 3, గుంతకల్లులో 4, రాయదుర్గంలో 2, గుత్తిలో 1, పామిడిలో 1, ధర్మవరంలో 4, హిందూపురంలో 5, కదిరిలో 2, కళ్యాణదుర్గంలో 1, మడకశిరలో 1 చొప్పున జూలై ఒకటో తేదీ నుంచి బార్లు ఏర్పాటు కానున్నాయి. అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం మినహా ఇప్పటి వరకు మిగిలిన ప్రాంతాల్లో బార్లు లేవు.
సుప్రీంకోర్టు మొట్టికాయ వేసేంత వరకు..
జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే మూసివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు వీటి వలన జరుగుతున్న అనర్థాలపై అధికారులు దృష్టి సారించలేదు. జిల్లాలో 240 మద్యం దుకాణాలు ఉంటే 200 పైబడి దుకాణాలు రహదారులపైనే ఉండడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే గత కొన్నేళ్లుగా మద్యం వ్యాపార సామ్రాజ్యాన్ని హైవేలపైనే విస్తరించుకున్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాల రావడంతో ప్రస్తుతం 500 మీటర్ల దూరానికి జరుపుకుంటున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి హైవేలపై ఉండకూడదని ఆదేశాలు అందాయి. దీంతో మద్యం దుకాణాదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జిల్లాలో మద్యం విక్రయాలు ఇలా ...:
సంవత్సరం మద్యం విక్రయాలు
2013–14 రూ. 555 కోట్లు
2014–15 రూ. 631 కోట్లు
2015–16 రూ. 688 కోట్లు
2016–17 రూ. 816 కోట్లు