వైన్‌ నిల్వలు వదిలించుకొనేందుకు రూ. 1,700 కోట్లు | France Is Spending 200 Million Euros To Destroy Surplus Wine | Sakshi
Sakshi News home page

వైన్‌ నిల్వలు వదిలించుకొనేందుకు రూ. 1,700 కోట్లు

Published Mon, Aug 28 2023 5:36 AM | Last Updated on Mon, Aug 28 2023 5:36 AM

France Is Spending 200 Million Euros To Destroy Surplus Wine - Sakshi

పారిస్‌: ప్రభుత్వ ఖజానాలో కాసులు గలగలలాడడానికి ఎవరైనా మద్యం అమ్మకాలు పెంచుతారు. కానీ ఫ్రాన్స్‌ మద్యానికి డిమాండ్‌ లేకపోవడంతో ఆ నిల్వలను వదిలించుకోవడానికి దాదాపు రూ.1,700 కోట్లు (20 కోట్ల యూరోలు) ఖర్చు చేయాలని నిర్ణయించింది. కోవిడ్‌ సంక్షోభం, ఆ వెంటనే రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధంతో యూరప్‌ దేశాలన్నీ ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు వైన్‌ వంటి వాటికి ఖర్చు చెయ్యడం బాగా తగ్గించేశారు.

తక్కువ ధరకు లభించే బీర్‌కు అలవాటు పడిపోయారు. దీనికి వాతావరణ పరిస్థితులు తోడయ్యాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో ఫ్రాన్స్‌ సహా యూరప్‌ దేశాల్లో ఇటీవల కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కబోత భరించలేని ప్రజలు వైన్‌ బదులుగా బీర్‌ ఎక్కువగా తాగుతున్నారు.  చాలా మంది ఆల్కహాల్‌ ఉత్పత్తులకు దూరంగా ఉంటున్నారు.  ముఖ్యంగా జనరేషన్‌ జెడ్‌(1996 నుంచి 2010 మధ్య పుట్టినవారు) మద్యం తాగడానికి ఇష్టపడడం లేదు.

ఫలితంగా వైన్‌కి డిమాండ్‌ పడిపోయింది. మరోవైపు వైన్‌ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన బోర్డాక్స్‌ ప్రాంతంలో వైన్‌ నిల్వలు భారీగా పేరుకుపోయాయి. దీంతో ప్రభుత్వమే ఆ వైన్‌ను కొనుగోలు చేసేందుకు 20 కోట్ల యూరోలు కేటాయించింది.  అదనంగా ఉన్న వైన్‌ను కొనుగోలు చేసి దానిలోని ఆల్కాహాల్‌ను శానిటైజర్లు, శుభ్రతా ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు వంటి వాటి తయారీలో వినియోగించనుంది. ఇలా చేయడం ద్వారా మళ్లీ వైన్‌కు డిమాండ్‌ పెరుగుతుందనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తోంది. వైన్‌ వినియోగం యూరప్‌ దేశాలైన ఇటలీలో  ఏడు శాతం, స్పెయిన్‌లో 10 శాతం, ఫ్రాన్స్‌లో 15 శాతం, జర్మనీలో 22 శాతం, పోర్చుగల్‌లో 34 శాతం మేర తగ్గిపోయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement