చెన్నై: తమిళనాడులో తొలి రోజు మద్యం అమ్మకాలు జోరుగా ముగిశాయి. లాక్‌డౌన్ అనంతరం తెరుచుకున్నమొదటి రోజే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఒక్క రోజే తమిళనాడు ప్రభుత్వం రూ.172 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిపినట్లు తేలింది. లాక్‌డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలను తమిళనాడు ప్రభుత్వం మే 7(గురువారం)నుంచి తిరిగి ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం లాక్‌డౌన్ సడలింపుల ఇవ్వడంతో కంటైన్మెంట్ జోన్లు మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలోనూ లిక్కర్ సేల్స్‌కు తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే చెన్నైలో కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల గ్రేటర్ చెన్నై ప్రాంతంలో మాత్రం మద్యం అమ్మకాలను నిషేధించింది. (మద్యం అమ్మకాలు; మండిపడ్డ మహిళలు)
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దాదాపు 44 రోజులపాటు మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకోడంతో మద్యం ప్రియులు పండగ చేసుకుంటున్నారు. దొరికిందే అదునుగా భావించి తెగ తాగుతూ రికార్డు సృష్టిస్తున్నారు. ఏ మద్యం దుకాణం ముందు చూసినా కిలోమీటర్లమేర మందుబాబులు బారులు తీరుతున్నారు. ఒక్క సీసా దొరికినా చాలు అంటూ దుకాణాల ముందు ఎగబడుతున్నారు. అయితే మద్యం దుకాణాల ముందు సామాజిక దూరం పాటించని, మాస్కులు లేని వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇక తమిళనాడులో కొత్తగా 580 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 5,409కి చేరింది. (ఒక్క రోజే పలు పారిశ్రామిక ప్రమాదాలు )
Comments
Please login to add a commentAdd a comment