న్యూఢిల్లీ: దాదాపు నెలన్నర రోజులుగా ‘మందు’కు మొహం వాచిన మద్యపాన ప్రియులు నేడు వైన్ షాపులు తెరవడంతో వెల్లువలా తరలివచ్చారు. తమ ‘దాహం’ తీర్చుకోవడానికి మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరారు. దేశ రాజధాని ఢిల్లీలో మందు బాబులు రెట్టించిన ఉత్సాహంతో ‘చుక్క’ కోసం షాపుల ముందు పడిగాపులు కాశారు. దేశబంధు గుప్తా రోడ్డులోని లిక్కర్ షాపు ముందు కిలోమీటర్ల వరకు ఓపిగ్గా నిలబడి రికార్డు సృష్టించారు. కశ్మీర్ గేట్ ప్రాంతంలో ఉన్న మందు దుకాణం ముందు నిలుచున్న మందుబాబులకు పోలీసులు బడితపూజ చేశారు. భౌతిక దూరం పాటించనందుకు లాఠీలతో బాది వారిని చెదరగొట్టారు. (మందు బాబుల బారులు.. 30 శాతం ధరల పెంపు)
కాగా, లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యపాన ప్రియులు పండగ చేసుకుంటున్నారు. 45 రోజులుగా నోరు కట్టేసినట్టు అవడంతో ఆబగా మద్యాన్ని అందుకునేందుకు గబగబ వైన్ షాపులకు పరుగులు తీశారు. ఫలితంగా మద్యం దుకాణాలు ముందు తండోప తండాలుగా మనుషుల ‘బారు’లు దర్శనమిచ్చాయి. ముఖానికి మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలను పట్టించుకోకుండా మందు కోసం పోటీ పడ్డారు. దీంతో అక్కడక్కడ పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇక మందుబాబుల విన్యాసాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. (వైన్‌షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర)
Comments
Please login to add a commentAdd a comment