ఓ సెల్ఫీ ఖరీదు.. రూ. 80 వేలు!
సెల్ఫీల గొడవ ఈమధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది. అత్యాధునిక ఫీచర్లు, మంచి రిజల్యూషన్ ఉన్న ఫ్రంట్ కెమెరాలతో సెల్ఫోన్లు మార్కెట్లోకి విడుదల అవుతుండటంతో.. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో సెల్ఫీలను వీలైనంత అందంగా పోస్ట్ చేసుకోడానికి యువత నానా తంటాలు పడుతున్నారు. తాజాగా.. సెల్ఫీలు అందంగా తీసుకోవడం కోసం ఏకంగా ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. ఢిల్లీకి చెందిన సాహిల్ కమ్రా (23) ఇలాగే చేశాడు. తన ముక్కు, పెదాలకు అతగాడు రూ. 80 వేలతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఇకమీదట తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో సెల్ఫీలు తీసుకోగలనని, ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసం వచ్చిందని సాహిల్ చెబుతున్నాడు. ఇన్స్టాగ్రామ్లో మనోడికి 500 మంది వరకు ఫాలోవర్లున్నారు మరి!
తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు పెరిగారని, ఫేస్బుక్లో లైకులు కూడా ఇంతకుముందు కంటే ఎక్కువ వస్తున్నాయని కమ్రా ఆనందం వ్యక్తం చేశాడు. తాను రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, దానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయని అతడు అంటున్నాడు. డాక్టర్ అనూప్ ధీర్ అనే వైద్యుడు అతడికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. గడిచిన రెండేళ్లలో తన వద్దకు వచ్చే పేషెంట్ల సంఖ్య 25 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. వీళ్లంతా కాస్మొటిక్ సర్జరీల కోసం వచ్చినవాళ్లే. ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ బాగా ఎక్కువ కావడం, యువత లైకుల కోసం ఆరాటపడటం వల్లే ఇలా జరుగుతోందని ఆయన చెప్పారు. అయితే.. వచ్చేవాళ్లలో మూడోవంతు మంది మాత్రమే అబ్బాయిలు.. మిగిలిన వాళ్లంతా అమ్మాయిలేనట. తన కింది పెదవి కంటే పై పెదవి పెద్దగా ఉందని, దాన్ని సరిచేస్తారా అని కూడా అడుగుతున్నారని ఆయన వాపోయారు.
కొసమెరుపు:
రియాల్టీ షోలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన కిమ్ కర్దాషియాన్కు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 4.5 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. ఇదంతా తన సెల్ఫీల పుణ్యమేనని ఆమె చెబుతోంది.