bhadrachalam area
-
ఇంకా ఉత్కంఠే.. నీటి మట్టం 60 అడుగుల వరకూ..
ఖమ్మం: గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో తీర ప్రాంత వాసుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. స్థానికంగా వర్షాలు తగ్గినా ఎగువ నుంచి వరద వస్తుండడంతో గోదావరి శాంతించడం లేదు. అయితే అంతే స్థాయిలో వరద దిగువకు వెళుతుండడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతోంది. వరద తీవ్రత, తీసుకోవాల్సిన చర్యల గురించి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ ప్రియాంక ఆల ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఐఏఎస్ అధికారి దురిశెట్టి అనుదీప్, ఎస్పీ డాక్టర్ జి.వినీత్, ఏఎస్పీ పరితోశ్ పంకజ్, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ తదితరులు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నేడూ వరద పోటు.. శనివారం రాత్రి 12 గంటల సమయంలో భద్రాచలం వద్ద గోదావరి 15,96,899 క్యూసెక్యుల నీటి ప్రవాహం దిగువకు వెళుతుండగా నీటి మట్టం 56.10 అడుగులుగా ఉంది. గోదావరికి ఎగువ ప్రాంతాన ఉన్న సమ్మక్క బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 9 గంటలకు 13 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. సమ్మక్క బ్యారేజీ భద్రాచలనికి ఎగువన 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ శనివారం మధ్యాహ్నం వదిలిన గరిష్ట వరద భద్రాచలం చేరేందుకు 24 గంటల సమయం పడుతుంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం వరకు వరద పోటు కొనసాగే అవకాశం ఉంది. గరిష్ట వరద భద్రాచలం చేరుకునే సమయానికి నీటి మట్టం 60 అడుగుల వరకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం దగ్గర నీటి మట్టం 53 అడుగుల దిగువకు తగ్గి, ఎగువ నుంచి వరద రాకుంటే పునరావాస శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు ముంపు బాధితులకు అనుమతి ఇస్తామని అధికారులు చెబుతున్నారు. -
రోడ్డు మార్గంలో భద్రాచలానికి రాష్ట్రపతి.. ముర్ము ప్రయాణించేది ఈ కారులోనే
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఈ నెల 28న దేశ ప్రథమపౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాచలం ఏజెన్సీతో పాటు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో రాష్ట్రపతి భద్రత విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే శత్రుదుర్భేద్యమైన వాహనాలను రాష్ట్రపతికి సమకూర్చనున్నారు. రోడ్డు మార్గంలో ఆలయానికి.. రాష్ట్రప్రతి, ప్రధాని వంటి అత్యున్నత పదవులు నిర్వహిస్తున్న వ్యక్తులకు భద్రత కల్పించే విషయంలో స్పస్టమైన విధి విధానాలు ఉన్నాయి. రాష్ట్రపతి దేశీయంగా రోడ్డు మార్గంలో ప్రయాణం చేసేప్పుడు అత్యాధునిక సౌకర్యాలు, కట్టుదిట్టమైన రక్షణ, భద్రత వ్యవస్థ ఉన్న కార్లను వినియోగిస్తారు. ఇందుకోసం రాష్ట్రపతి అధికారిక నివాసాలు ఉన్న ఢిల్లీ, హైదరాబాద్, సిమ్లాలలో ఈ వాహనాలు రాష్ట్రపతి ప్రయాణించేందుకు సదా సిద్ధంగా ఉంటాయి. ఈ నెల 28న రాష్ట్రపతి వాయుమార్గం ద్వారా ఐటీసీకి చేరుకుని, అక్కడి నుంచి గోదావరి వంతెన మీదుగా సుమారు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి రామాలయ ప్రాంగణం చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రాష్ట్రపతి ఏ కారు ఉపయోగిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. మెర్సిడెస్ ఎస్ క్లాస్ (ఎస్ 600) పులిమన్ గార్డ్.. పబ్లిక్ డోమైన్లో ఉన్న వివరాల ఆధారంగా రాష్ట్రపతి వాహనశ్రేణికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రపతిగా ముర్ము పదవీ బాధ్యతలు స్వీకరించగానే అధికారిక వాహనంగా మెర్సిడెస్ బెంజ్, మేబ్యాక్, ఎస్ క్లాస్ (ఎస్ 600) పులిమన్ గార్డ్‌ను కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ కోసమే మెర్సిడెస్ సంస్థ ఈ శ్రేణికి చెందిన కార్లను తయారు చేస్తుంది. రాష్ట్రపతి కోసం కేటాయించిన కారును అధికారిక కార్యక్రమాలకు తగ్గట్టుగా కస్టమైజ్ చేస్తారు. చదవండి: Hyderabad: మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఈ ఏడాదిలోనే ఎన్ని కేసులంటే! ఈ కారు బుల్లెట్ ప్రూఫ్, (ల్యాండ్, క్లెమోర్ మైన్) బ్లాస్ట్ ప్రూఫ్, విష రసాయనాల దాడి నుంచి కాపాడే అధునాత భద్రతా వ్యవస్థ ఉంటుంది. రాత్రి వేళలల్లోనూ ఈ వాహనాలను నడపవచ్చు. ఫ్లాట్ టైర్ సిస్టమ్ ఉపయోగించడం వల్ల టైర్ల మీద దాడి జరిగినా కారు నడుస్తూనే ఉంటుంది. బరువు ఐదు టన్నులకు పైగా ఉంటుంది. గంటలకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. అధిక బరువు ఉన్నప్పటికీ కేవలం 8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. భద్రతా కారణాల రీత్యా ఈ వాహనానికి నంబర్ ప్లేట్ ఉండదు. హైదరాబాద్‌లో.. నిబంధనల ప్రకారం రాష్ట్రపతి వేసవి కాలంలో సిమ్లాలో, శీతాకాలంలో హైదరాబాద్‌లో విడిది చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఇక్కడకు వచ్చినప్పుడు స్థానికంగా పర్యటనలకు వెళ్లేందుకు వీలుగా ఇక్కడ సైతం ప్రత్యేక వాహనాన్ని రాష్ట్రపతికి కేటాయించారు. మాజీ రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన సందర్భంగా టయోటా మినర్వా ఫార్చునర్ ఎస్యూవీ కారును ఉపయోగించారు. ప్రస్తుత రాష్ట్రపతి పర్యటనలకు ఇదే కారును కేటాయించే అవకాశం ఉంది. ఈ కారు సైతం బుల్లెట్ ప్రూఫ్, బ్లాస్ట్ ప్రూఫ్, కెమికల్ గ్యాస్ ఎటాక్ ప్రూఫ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. భద్రతా ప్రమాణాల ప్రకారం మినర్వా ఫార్చునర్ బీ 6 లెవల్ రక్షణ అందిస్తుంది. ఈ కారు రెగ్యులర్ మెడల్ ఖరీదు రూ. 44 లక్షల దగ్గర ఉండగా రాష్ట్రపతికి ఉపయోగించే కస్టమైజ్డ్ వెహికల్ ధర రూ. 80 లక్షల వరకు ఉండవచ్చు. సాధారణ కారు 2,180 కేజీల బరువు ఉంటే మినర్వా 3,700 కేజీల బరువు వరకు ఉంటుంది. సాధారణ కారు గరిష్ట వేగం గంటకు 176 కిలోమీటర్లు ఉండగా రాష్ట్రపతి ఉపయోగించే కారు గంటకు 150 కి.మీ స్పీడ్‌తో నడవగలదు. ప్యూర్ వెజిటేరియన్.. రాష్ట్రపతి భవన్లు కొలువై ఉన్న మూడు చోట్ల రాష్ట్రపతికి సేవలు అందించేందుకు ప్రత్యేకంగా వంటమనిషితో పాటు ఇతర వ్యక్తిగత సిబ్బంది ఉంటారు. రాష్ట్రపతి దేశీయంగా ఎక్కడికి పర్యటనకు వెళ్లినా వీరే వంటలు చేస్తారు. ఈ నెల 28న రాష్ట్రపతి ముర్ముకు సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో లంచ్ ఏర్పాటు చేశారు. ద్రౌపది ముర్ము శాకాహారి కావడంతో ఇప్పటికే వెజిటేరియన్ వంటకు సంబంధించిన మెనూను సిద్ధం చేశారు. రాష్ట్రపతి భవన్ చెఫ్‌తో పాటు మరికొందరు వంటగాళ్లను ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. వీరు వండిన వంటకాలను ముందుగా భద్రతా సిబ్బంది పరీక్ష చేసిన తర్వాతే రాష్ట్రపతి, ఇతర అతిథులకు వడ్డిస్తారు. -
భద్రాచలంతో బంతాట..!
భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలం ప్రాంతంతో కేంద్రం బంతాట ఆడుతోంది. ఓ పక్క పోలవరం ప్రాజెక్టు వద్దని ఈ ప్రాంతంలోని ఆదివాసీ సంఘాలు గొంతెత్తి నినదిస్తున్నా...ఇవేమీ పట్టని కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని ఏడు మండలాలను నిట్టనిలువునా ముంచేందుకు కంకణం కట్టుకుంది. పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తరుణంలో ముంపు గ్రామాలు మాత్రమే సీమాంధ్రకు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. కేంద్రమంత్రి, జీవోఎంలో కీలక సభ్యుడైన జైరాంరమేశ్ శుక్రవారం నాడు చేసిన ప్రకటనతో మళ్లీ ఈ ప్రాంతవాసుల్లో కలవరం మొదలై ంది. భద్రాచలం డివిజన్లోని కూనవరం, వీఆర్‌పురం మండలాలు పూర్తిగానూ, భద్రాచలం, చింతూరు మండలాలు పాక్షికంగానూ అదే విధంగా పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగానూ, బూర్గంపాడు మండలం పాక్షికంగా ముంపునకు గురవుతున్న నేపథ్యంలో.... ముంపునకు గురవుతున్న గ్రామాలనే తెలంగాణ నుంచి వేరు చేస్తున్నట్లుగా బిల్లు ఆమోదం సమయంలో ప్రకటించారు. 2005 జూన్27న జారీ చేసిన జీవో నంబర్ 111 ప్రకారం పై మండలాల్లోని 205 గ్రామాలతో పాటు అదనంగా బూర్గంపాడు, సీతారాంనగరం, కండ్రిగ గ్రామాలను కూడా సీమాంధ్రకు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. తాజాగా జైరాంరమేష్ భద్రాచలం పట్టణం, అదే విధంగా బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలను మినహాయించి మొత్తం ఏడు మండలాలను కూడా తెలంగాణ నుంచి వేరు చేస్తున్నట్లుగా ప్రకటించటం గమనార్హం. పాల్వంచ నుంచి బూర్గంపాడు మండలంలోని పినపాక, బంజర్, లక్ష్మీపురం, మణుగూరు క్రాస్‌రోడ్, సారపాక మీదగా భద్రాచలానికి వచ్చే రహదారిలో ఉన్న గ్రామాలను తెలంగాణలో ఉంచినట్లుగా తెలుస్తోంది. భద్రాచలం పట్టణం తెలంగాణలోనే ఉంచినందున ఇక్కడకి వచ్చేందుకు రహదారి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉభయ సభలకు తెలంగాణ బిల్లు రాకముందు జీవోఎం ఇదే నిర్ణయాన్ని తీసుకోగా, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో ఆఖరి నిమిషంలో కొన్ని మార్పులు చేశారు. కానీ తాజాగా చేసిన ప్రకటనతో గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు త్వరలోనే గెజిట్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉండగా, భద్రాచలం ప్రాంతంపై వస్తున్న పుకార్లు ఈ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముంపు గ్రామాలపై తేలని లెక్క పోలవరం ప్రాజెక్టు కింద అసలు ఎన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయనే దానిపై సరైన స్పష్టత లేకపోవటమే ఈ గందరగోళానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 205 గ్రామాలు మాత్రమే ముంపుకు గురవుతాయని సాగునీటి శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ లెక్కన భద్రాచలం మండలంలోని తోటపల్లి ముంపు పరిధిలోకి వస్తుండగా, ఇదే సరిహద్దు గ్రామం కానుంది. కానీ భద్రాచలానికి కూత వేటు దూరంలో గల చోడవరం గ్రామ సమీపంలో కూడా ముంపు కిందకు వస్తుందని సాగునీటి శాఖ అధికారులు రాళ్లు వేయటం గమనార్హం. దీన్ని పరిగణలోకి తీసుకున్నట్లైతే భద్రాచలం మండలం అంతా ముంపు కిందకే వస్తుంది. దీన్ని ప్రాతిపదికగా తీసుకునే కేంద్ర ప్రభుత్వం ముంపు పరిధిలో ఉన్న ఏడు మండలాలను కూడా సీమాంధ్రకు కే టాయించిందని నిపుణులు అంటున్నారు. అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వం రోజుకో విధంగా భద్రాచలంపై ప్రకటన చేస్తుండటం ప్రశ్నార్థకంగా మారింది. భగ్గుమంటున్న ఆదివాసీలు పోలవరం ప్రాజెక్టు కోసమని ఆదివాసీ గ్రామాలను ముంచేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికే ఆదివాసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. తాజా తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ వాదులు కూడా మండిపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటి వరకూ అమలైన గిరిజన చట్టాలకు భవిష్యత్‌లో ముప్పు వాటిల్లే ప్రమాదముందని భావిస్తున్న ఆదివాసీలు న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు.