భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలం ప్రాంతంతో కేంద్రం బంతాట ఆడుతోంది. ఓ పక్క పోలవరం ప్రాజెక్టు వద్దని ఈ ప్రాంతంలోని ఆదివాసీ సంఘాలు గొంతెత్తి నినదిస్తున్నా...ఇవేమీ పట్టని కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని ఏడు మండలాలను నిట్టనిలువునా ముంచేందుకు కంకణం కట్టుకుంది. పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తరుణంలో ముంపు గ్రామాలు మాత్రమే సీమాంధ్రకు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. కేంద్రమంత్రి, జీవోఎంలో కీలక సభ్యుడైన జైరాంరమేశ్ శుక్రవారం నాడు చేసిన ప్రకటనతో మళ్లీ ఈ ప్రాంతవాసుల్లో కలవరం మొదలై ంది.
భద్రాచలం డివిజన్‌లోని కూనవరం, వీఆర్‌పురం మండలాలు పూర్తిగానూ, భద్రాచలం, చింతూరు మండలాలు పాక్షికంగానూ అదే విధంగా పాల్వంచ డివిజన్‌లోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగానూ, బూర్గంపాడు మండలం పాక్షికంగా ముంపునకు గురవుతున్న నేపథ్యంలో.... ముంపునకు గురవుతున్న గ్రామాలనే తెలంగాణ నుంచి వేరు చేస్తున్నట్లుగా బిల్లు ఆమోదం సమయంలో ప్రకటించారు. 2005 జూన్27న జారీ చేసిన జీవో నంబర్ 111 ప్రకారం పై మండలాల్లోని 205 గ్రామాలతో పాటు అదనంగా బూర్గంపాడు, సీతారాంనగరం, కండ్రిగ గ్రామాలను కూడా సీమాంధ్రకు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. తాజాగా జైరాంరమేష్ భద్రాచలం పట్టణం, అదే విధంగా
బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలను మినహాయించి మొత్తం ఏడు మండలాలను కూడా తెలంగాణ నుంచి వేరు చేస్తున్నట్లుగా ప్రకటించటం గమనార్హం.
పాల్వంచ నుంచి బూర్గంపాడు మండలంలోని పినపాక, బంజర్, లక్ష్మీపురం, మణుగూరు క్రాస్‌రోడ్, సారపాక మీదగా భద్రాచలానికి వచ్చే రహదారిలో ఉన్న గ్రామాలను తెలంగాణలో ఉంచినట్లుగా తెలుస్తోంది. భద్రాచలం పట్టణం తెలంగాణలోనే ఉంచినందున ఇక్కడకి వచ్చేందుకు రహదారి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉభయ సభలకు తెలంగాణ బిల్లు రాకముందు జీవోఎం ఇదే నిర్ణయాన్ని తీసుకోగా, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో ఆఖరి నిమిషంలో కొన్ని మార్పులు చేశారు. కానీ తాజాగా చేసిన ప్రకటనతో గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు త్వరలోనే గెజిట్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉండగా, భద్రాచలం ప్రాంతంపై వస్తున్న పుకార్లు ఈ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ముంపు గ్రామాలపై తేలని లెక్క
పోలవరం ప్రాజెక్టు కింద అసలు ఎన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయనే దానిపై సరైన స్పష్టత లేకపోవటమే ఈ గందరగోళానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 205 గ్రామాలు మాత్రమే ముంపుకు గురవుతాయని సాగునీటి శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ లెక్కన భద్రాచలం మండలంలోని తోటపల్లి ముంపు పరిధిలోకి వస్తుండగా, ఇదే సరిహద్దు గ్రామం కానుంది. కానీ భద్రాచలానికి కూత వేటు దూరంలో గల చోడవరం గ్రామ సమీపంలో కూడా ముంపు కిందకు వస్తుందని సాగునీటి శాఖ అధికారులు రాళ్లు వేయటం గమనార్హం. దీన్ని పరిగణలోకి తీసుకున్నట్లైతే భద్రాచలం మండలం అంతా ముంపు కిందకే వస్తుంది. దీన్ని ప్రాతిపదికగా తీసుకునే కేంద్ర ప్రభుత్వం ముంపు పరిధిలో ఉన్న ఏడు మండలాలను కూడా సీమాంధ్రకు కే టాయించిందని నిపుణులు అంటున్నారు. అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వం రోజుకో విధంగా భద్రాచలంపై ప్రకటన చేస్తుండటం ప్రశ్నార్థకంగా మారింది.
భగ్గుమంటున్న ఆదివాసీలు
పోలవరం ప్రాజెక్టు కోసమని ఆదివాసీ గ్రామాలను ముంచేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికే ఆదివాసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. తాజా తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ వాదులు కూడా మండిపడుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటి వరకూ అమలైన గిరిజన చట్టాలకు భవిష్యత్‌లో ముప్పు వాటిల్లే ప్రమాదముందని భావిస్తున్న ఆదివాసీలు న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
భద్రాచలంతో బంతాట..!
Published Sat, Feb 22 2014 1:45 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement