Tribal communities
-
గిరిజనుల ఐక్యతకు భారతీయ హార్న్‌బిల్
భారతదేశంలోని ఈశాన్యప్రాంతంలో ప్రతి డిసెంబర్లో నాగాలాండ్‌లోని రోలింగ్ కొండల మధ్య సుందరమైన కోహిమా ప్రాంతం నాగా తెగల సాంస్కృతిక వేడుకలకు కేంద్ర బిందువు అవుతుంది. అక్కడి గిరిజనులు తమ అరుదైన సంస్కృతిని ప్రదర్శించడానికి హార్న్‌బిల్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వివిధ తెగల మధ్య ఐక్యతకు, శాంతికి, సంస్కృతికి ప్రతీకగా పాతికేళ్లుగా ప్రతియేటా జరిగే ఈ వేడుకలో లక్షన్నరకు పైగా సందర్శకులు పాల్గొన్నారు. దీంతో ఈ వేడుక ప్రపంచమంతటినీ ఆకర్షించింది. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, నాగా తెగల శక్తివంతమైన గుర్తింపును వెలుగులోకి తీసుకురావం ఈ వేడుక ముఖ్య ఉద్దేశ్యం. పండుగ సందర్భంగా ఇక్కడ ప్రతి తెగ దాని స్వంత సజీవ నృత్యాలు, పాటలు, ఆచారాలను ప్రదర్శించడమే కాదు నాగా వంటకాలు విభిన్న రుచులను అందిస్తాయి. స్థానిక కళాకారులు, హస్తకళాకారులు ప్రదర్శనలో భాగం అవుతారు. తద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది. చేతితో నేసిన వస్త్రాలు, సాంప్రదాయ ఆభరణాలు, వివిధ హస్తకళలతో నిండిన స్టాల్స్ పండుగకు వెళ్లేవారికి సాంస్కృతిక ్ర΄ాముఖ్యతతో కూడిన సావనీర్లను ఇంటికి తీసుకెళ్లడానికి సరైన అవకాశాన్ని అందిస్తాయి. నిర్దిష్ట తెగలు, వారి విలక్షణమైన సంప్రదాయాలకు నివాళులు అర్పిస్తూ ప్రత్యేక నేపథ్య సాయంత్రాలను ప్లాన్ చేయవచ్చు. ఉదాహరణకు కొన్యాక్ తెగ వారు వారి సంప్రదాయ పచ్చబొట్లు, పాటలు, కథలు వారి జీవన విధానంపై అవగాహన కలిగిస్తాయి. మరొక తెగ వారి ప్రాచీన నృత్యాల ద్వారా చారిత్రక కథలను వివరిస్తాయి.ఇదీ చదవండి: టీ లవర్స్ : టీ మంచిదా? కాదా? ఈ వార్త మీకోసమే!వివిధ తెగల మధ్య శాంతిఈ ఫెస్టివల్ తెగల మధ్య ఐక్యతను పెం΄÷ందిస్తుంది. గిరిజన సంఘర్షణల చుట్టూ తరచుగా గందరగోళ చరిత్ర ఉన్నందున, ఈ పండుగ వివిధ వర్గాల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. భవిష్యత్ తరాలకు దేశీయ సంస్కృతుల పరిరక్షణకు భరోసానిస్తూ, నాగా యువకులు తమ మూలాలతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక వేదికగా మారుతుంది. వివిధ ΄ోటీలను నిర్వహించి గిరిజన యువతలో గర్వం, ప్రేరణను సృష్టిస్తుంది. రాత్రి సమయాల్లో జరిగే కచేరీలకు వివిధ ప్రాంతాల నుండి బ్యాండ్ లను ప్రదర్శిస్తారు. ప్రతి రోజు ఉత్సాహభరితమైన శ్రావ్యమైన పాటలతో ముగుస్తుంది. స్థానికులు, పర్యాటకులు, ప్రదర్శకులు కలిసి ఆనందాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది. పాతికేళ్లుగా హార్న్‌బిల్ ఫెస్టివల్ నాగా సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా దాని అభివృద్ధిని కూడా వాగ్దానం చేస్తుంది. భవిష్యత్ తరాలకు ఈ విలువైన సంప్రదాయాలను వారసత్వంగా, భాగస్వామ్యం చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇలాంటి సంప్రదాయ వేడుకలు మన భారతీయ సంస్కృతిని ఇంకా సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి అనడానికి హార్నబిల్ ఓ ఉదాహరణగా నిలుస్తుంది. View this post on Instagram A post shared by Hornbill Festival Nagaland (@hornbillfestivalofficial) -
జన జాతరలు
ఎస్ఎస్ తాడ్వాయి: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క – సారలమ్మ జాతరకు ములుగు జిల్లా ఎస్ఎస్.తాడ్వాయి మండలంలోని మేడారం ముస్తాబైంది. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోట్లాది మంది భక్తులు వన దేవతలను దర్శించుకోనున్నారు. సమ్మక్క – సారలమ్మ జాతర తరహాలోనే బీరప్ప, కోట మైసమ్మ, రేణుకా ఎల్లమ్మ వంటి స్థానిక జాతరలు ఉన్నాయి. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అనేక జాతరలు ప్రతీ ఏటా జరుగుతుంటాయి. వీటిలో ప్రధానమైన కొన్ని జాతరల విశేషాలు. జంగూబాయి: గోండు తెగకు చెందిన ఆదివాసీలు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం సమీపానికి సరిహద్దు ప్రాంతంగా కలసి ఉన్న మహారాష్ట్రలో ఈ జాతర జరుపుకుంటారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన జంగూబాయి దేవతకు ప్రతిరూపమైన పెద్దపులిని పూజిస్తారు. గోండులంతా మాఘ శుద్ద పౌర్ణమి మాసం రాగానే నెల రోజుల పాటు జంగూబాయి మాలలు వేస్తారు. జంగూమాతను టెంకాయలు మొక్కులుగా సమర్పిస్తారు. అక్కడి గుట్ట లోని గుహలో ఉండే పెద్దపులికి జంగో లింగో అంటూ జేకొడుతూ దర్శనం చేసుకుంటారు. బీరమయ్య ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజీపూర్ జిల్లాలోని బస్తర్, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని వాజేడు మండల సరిహద్దు ప్రాంతంలో ఉన్న లొటపిట గం డి కొండల్లో ఆదివాసీలు బీరమయ్య జాతర నిర్వహిస్తారు. పూర్వ కాలంలో ప్రజలను దోపిడీ దొంగలు దోచుకుపోతుంటే వారి నుంచి రక్షించేందు కు ముగ్గురు అన్నదమ్ములు పగిడిద్దరాజు, పాంబోయి, బీరమయ్య సిద్ధమవుతారు. ఈ దోపిడీ దొం గలను తరుముకుంటూ పగిడిద్దరాజు మేడారానికి, భూపాలపట్నం వైపు, బీరమయ్య లొటపిట గండికి వెళ్లి స్ధిరపడతారు. అప్పటి నుంచి బీరమయ్యకు లొటపిటగండిలో, పాం బోయికి భూపాలపట్నం లో, పగిడిద్దరాజుకు మేడా రంలో జాతరలు నిర్వహిస్తారని అక్కడి పెద్దలు చెబుతారు. ఈశాన్య రాష్ట్రాల్లో హర్నిబిల్ భారత దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాలు అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. పూర్తిగా కొండలు, అడవులతో నిండిన ఈ ప్రాంతంలో గిరిజన జనాభా ఎక్కువ. వందల సంఖ్యలో గిరిజన తెగలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇక్కడున్న ఏడు రాష్ట్రాల్లో ప్రతి తెగకు సంబంధించి వేర్వేరుగా జాతరలు ఉన్నాయి. వీటిలో నాగాలాండ్‌లో జరిగే హర్నిబిల్ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఏటా డిసెంబర్ మొదటి వారంలో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతర ప్రధాన ఉద్దేశం గిరిజన తెగలకు సంబంధించిన ప్రత్యేక సంస్కృతి , సంప్రదాయాలను కాపాడుకోవడం. ఈ పండుగ సందర్భంగా ఇక్కడి గిరిజనులు ఆటపాటలతో ఆడిపాడుతారు. సంస్కృతికి సంబంధించిన వేడుక కావడంతో ఇది కనులపండువగా సాగుతుంది. హర్నిబిల్ జాతర తర్వాత జనవరిలో మణిపూర్‌లో థీసమ్ ఫణిత్ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సహ్రుల్ ఆదివాసీల జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో సహ్రుల్ జాతర జరుగుతుంది. ఈ జాతరలో భాగంగా ప్రకృతిని పూజిస్తారు. ఇక్కడ ఉండే సాల్ అనే చెట్టుకు ప్రత్యేక పూజలు జరుపుతారు. ధర్తీ మాతగా సీతాదేవి ఇక్కడ కొలుస్తారు. ప్రకృతి విపత్తులు ఇతర కష్టాల నుంచి తమను కాపాడుతారని ఇక్కడి గిరిజనుల విశ్వాసం. మఘేపరాబ్ ఒడిశా రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల్లో గిరిజనులకు ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా అనేక జాతరలు జరుగుతాయి. ఇందులో ఏడు ప్రధానమైన జాతరలు ఉన్నాయి. వీటిలో మఘేపరాబ్ జాతర ఒకటి. ఈ జాతర సందర్భంగా తమ తెగ దేవతకు నల్లని పక్షులు బలిస్తారు. మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. నాగోబా ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర జరుగుతుంది. ఆదివాసీలకు ఇది ప్రధాన జాతర. మూడు రోజుల పాటు (ఇటీవలే జరిగింది) నిర్వ హిస్తారు. నాగోబా జాతరను మెస్రం వంశస్తులు, గోండు ఆదివాసీలు జరుపుతారు. పుష్యమాసంలో నెలవంక చంద్రుడు కనిపించగానే.. మెస్రం వంశస్తులు హస్తిన మడుగు నుంచి కలశంతో నీరు తీసుకొచ్చి నాగులమ్మ దేవతను పూజిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నాగోబా జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. దంతేశ్వరీ ఉత్సవాలు ఆదివాసీ తెగ ప్రజలు అత్యధికంగా జీవించే ఛత్తీస్‌గఢ్‌లో దసరా పండుగ సమయంలో ఇక్కడ అన్నమదేవ్ రాజవంశీయులు దంతేశ్వరీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జగదల్పూర్ కేంద్రంగా జరిగే ఈ జాతరకు అత్యధికంగా గిరిజనులు హాజరవుతారు. రాజవంశీయులు కీలక భూమిక పోషించినా ప్రధాన పాత్ర గిరిజనులదే. అదేవిధంగా రాయ్‌పూర్ సమీపంలో ఉన్న భోరమ్‌దేవ్ జాతర ప్రత్యేకతను సంతరించుకుంది. గరియ మాత త్రిపుర రాష్ట్రంలో రీంగ్ తెగకు చెందిన ఆదివాసీలు గరియ పూజ జాతరను జరుపుకుంటారు. చైత్ర సంక్రాంతి రోజున ఒక వెదురు దండాన్ని ప్రత్యేకంగా కాటన్దారం, కాటన్‌తో తయారు చేసిన పూలతో అలంకరిస్తారు. దైవత్వానికి అంకితమైన కొందరు వ్యక్తులు ఈ దండాన్ని పట్టుకుని గ్రామంలో ఇంటింటికీ తిరుగుతారు.ఆ సమయంలో దేవతను స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ నృత్యాలను చేస్తూ పంటలు బాగా పండాలని బాధలు నుంచి విముక్తి కలిగించాలని కోరుతారు. నాగోబా జాతరలో భక్తులు (ఫైల్) -
‘గురుకుల’ విద్యార్థినికి గర్భం
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లోని గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని గర్భం దాల్చడం కలకలం సృష్టించింది. అయితే.. ప్రేమ వ్యవహారమే కారణమని అధికారుల విచారణలో తేలింది. వివరాలు.. గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతున్న 10 మంది విద్యార్థినులకు ఇటీవల రుతుస్రావం సమస్య ఎదురైంది. దీంతో నవంబర్ 21న కళాశాల సిబ్బంది ఆదిలాబాద్ రిమ్స్‌లో పరీక్షలు చేయించారు. ఇందులో ముగ్గురిపై అనుమానంతో గర్భనిర్దారణ పరీక్షలు చేయించారు. వారికి మొదట పాజిటివ్ వచ్చింది. ధ్రువీకరణ కోసం మళ్లీ వారం తర్వాత రావాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే.. కళాశాల సిబ్బంది మళ్లీ రిమ్స్‌కు వెళ్లకుండా స్థానికంగా ఉన్న ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించారు. ఇందులో ఒక విద్యార్థిని మాత్రమే గర్భం దాల్చినట్లు తేలింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాగా, శనివారం ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు, గిరిజన సంక్షేమ శాఖ జీసీడీవో శంకుతల, డీసీపీవో మహేశ్, ఐసీడీఎస్ పీడీ సావిత్రి శనివారం విచారణ చేపట్టగా.. గర్భానికి ప్రేమ వ్యవహారమే కారణమని సదరు విద్యార్థిని ఒప్పుకుంది. మా కళాశాలను బద్నాం చేస్తారా? గురుకుల కళాశాలలో విద్యార్థిని గర్భం దాల్చడంపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆ కళాశాల విద్యార్థినులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కళాశాల పేరుప్రఖ్యాతులు భంగం కలిగేలా మీడియాలో ప్రచారం చేశారని, ఇందులో ప్రిన్సిపాల్ పాత్ర ఏమీ లేదని వసతిగృహ భవనం ఎదుట ధర్నాకు దిగారు. ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ విద్యార్థినులతో మాట్లాడి శాంతిపజేశారు. కాగా, ఈ ఘటనపై విచారణ కోసం ఆర్డీఓ లక్ష్మయ్య ఆలస్యంగా రావడంపై విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని ఆందోళన చేశారు. -
అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోం
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఎన్డీయే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని దళిత, గిరిజన సంఘాల ప్రతిఘటన దీక్షలో నేతలు హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ఈ దీక్షలో పలువురు నేతలు మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలు, త్యాగాలతో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వచ్చిందని, దళిత గిరిజనులకు అండగా ఉండాల్సిన కేంద్రం ఆ చట్టాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా దళిత, గిరిజనులపై జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలు కులదూషణ కేసులు కోర్టు వరకు వెళ్లడం లేదని, పోలీసు స్టేషన్లలోనే రాజీ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు వరకు వెళ్లిన కేసుల్లో బాధితులను బెదిరించి రాజీ చేయిస్తున్నారని పేర్కొన్నారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు పాత చట్టాన్ని పటిష్టం చేస్తూ బిల్లు తేవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ అధ్యక్షత వహించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ, తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు ఎర్రవళ్లి రాములు మాల, నేతలు పెబ్బె జీవ మాదిగ, రాయికంటి రాందాస్, కె.సాంబశివరావు, సింగిరెడ్డి పరమేశ్వర్, గడ్డయాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన రైతుపై విరిగిన లాఠీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గుంటపల్లి చెరువుతండాకు చెందిన రైతు నునావత్ రాజును సోమవారం పోలీసులు లాఠీ విరిగేలా కొట్టారు. వ్యవసాయ పనులు చేసిన రాజు సాయంత్రం కల్లు తాగి తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. అటుగా వెళ్తున్న వీర్నపల్లి ఎస్ఐ నరేశ్‌కుమార్ అతడిని బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించారు. మద్యం తాగినట్లు తేలడంతో సెల్‌ఫోన్ ఇచ్చి వెళ్లాలని ఆదేశించారు. తన వద్ద లేదని చెప్పడంతో ఎస్ఐ, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాఠీ విరిగే వరకు కొట్టడంతో కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గిరిజన సంఘాల నేతలు ఎల్లారెడ్డిపేట సీఐ రవీంరద్ను కలసి ఎస్ఐపై ఫిర్యాదు చేశారు. నేతలు అజ్మీరా రాజునాయక్, పుణ్యానాయక్, అజ్మీరా తిరుపతినాయక్, రాజయ్య, నునావత్ కైలాసం, సీత్యానాయక్, శంకర్‌నాయక్, ప్రభునాయక్ పోలీసులకు ఫిర్యాదు చేసినవారిలో ఉన్నారు. తమ విధులకు ఆటంకం కల్పించాడంటూ రైతు రాజుపై వీర్నపల్లి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ రవీందర్‌ను సంప్రదించగా, డ్రంకెన్ డ్రైవ్‌లో రాజు మద్యం తాగినట్లు తేలిందని, ఆ సమయంలో అతను పోలీసు విధులకు ఆటకం కల్పిం చాడన్నారు. ఆ తోపులాటలో రాజు కిందపడగా గాయాలయ్యాయని, పోలీసులు కొట్టారనే ఆరోపణలో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. -
గిరిజన యోధుడు..
ఆదర్శం: (కొమురం భీం): నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల్ని రక్షించేందుకు కొమురం భీం ఆసిఫాబాద్ పరిసరాల్లోని పన్నెండు గ్రామాలతో ‘గోండు రాజ్యం’గా ప్రకటించుకునేందుకు ప్రణాళిక రచించాడు. గోండు గూడెం వాసులతో కలిసి గె రిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ‘జల్-జంగల్ -జమీన్’ నినాదంతో గిరిజనులకు స్వయం పాలన కోసం నిజాం పాలనపై యుద్ధభేరి మోగించాడు. హైదరాబాద్, సాక్షి: దేశంలో బ్రిటిష్ పాలన రాకముందే గిరిజన సామ్రాజ్యం(క్రీ.శ 1240 - 1749) ఉండేది. ఆ గోండ్వానా (గోండు) రాజ్యాన్ని ఆ తరువాత మరాఠీలు హస్తగతం చేసుకున్నారు. సిపాయిల తిరుబాటు (1857) కంటే ముందే బ్రిటిష్ పాలకులపై గోండులు తిరుబాటు చేశారు. 1836 నుంచి 1860 వరకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఘన చరిత్ర ఆదీవాసీలది. అప్పటి గోండ్వానాలో అంతర్భాగంగా ఉన్న ఉత్తర తెలంగాణ నిజాం నిరంకుశ పాలన చవిచూసిన రోజులవి. ఇలాంటి పరిస్థితుల్లో 1931- 40 మధ్యకాలంలో నిజాం నిరంకుశత్వం, రజాకార్ల ఆగడాలపై తిరుబాటు బావుటాను యువ గోండు ధీరుడు కొమురంభీం ఎగురవేశాడు. ‘జల్-జంగల్ -జమీన్’ నినాదంతో గిరిజనుల స్వయం పాలన కోసం యుద్ధభేరి మోగించాడు. ఆదిలాబాద్ జిల్లా కెరిమరి మండలం సంకేపల్లిగూడెంలో కొమురం చిన్నూ, మోహినీబాబు దంపతులకు 1900లో కొమురం భీం పుట్టాడు. అటవీ సిబ్బంది దాడిలో తండ్రి కొమురం చిన్నూ మరణించడంతో తల్లితో కలిసి భీం మకాం సుర్ధాపూర్‌కు మారింది. భీం సాగు చేసే భూమిని నిజాం జాగీర్దార్ సిద్ధిఖ్ ఆక్రమించాడు. గోండులతో వెట్టిచాకిరీ చేయించాడు. బెదిరింపులకు, ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. గిరిజనులు అడవుల్లో పశువుల్ని మేతకు తీసుకువెళ్లినా, వంటచెరకు ఇంటికి తెచ్చినా ‘బంబ్‌రాం, దూపపెట్టి’ పేర్లతో నిజాం ప్రభుత్వం శిస్తు విధించింది. ఇదేమిటని ప్రశ్నించి పాపానికి జోడేఘాట్ పరిసరాల్లో ఇళ్లు, పంటల్ని ధ్వంసం చేశారు. దీంతో కొమురం భీం నిజాం పాలనపై ‘తుడుం’ మోగించాడు. సిద్ధిఖ్‌ను హతమార్చి అస్సాం వెళ్లి ఐదేళ్ల పాటు కూలి పనిచేస్తూ తల దాచుకున్నాడు. అక్కడే రాత్రి వేళ అక్షరాలను వంటబట్టించుకుని తిరిగొచ్చాడు. ఆసిఫాబాద్ పరిసరాల్లోని పన్నెండు గ్రామాలతో ‘గోండు రాజ్యం’గా ప్రకటించుకునేందుకు ప్రణాళిక రచించాడు. జోడేఘాట్, బాబే ఝరీ, పట్నాపూర్, చల్‌బరిడి, శివగూడ, టెకెన్నవాడ, భీమన్‌గొంది, కల్లేగావ్, నర్సాపూర్, అంకుశాపూర్, లైన్ పటల్, శోశగూడ వంటి గోండు గూడెంల వాసులతో కలిసి గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. నిజాం సైన్యం ప్రతిదాడులు చేసి కొమురంకు కుడి, ఎడమ భుజాలుగా ఉండే కొమురం సూరు, లచ్చు పటేల్‌ను బంధించింది. పలువురు ఆదివాసీలను జైళ్లల్లో పెట్టింది. అయినా కొమురం భీం వెరవలేదు. దాంతో నిజాం ఒక మెట్టు దిగి గిరిజనుల భూములకు పట్టాలిస్తామన్నాడు. అడవిపై గిరిపుత్రులకు సర్వహక్కులు కావాలన్న భీం డిమాండ్‌ను నిజాం తోసిపుచ్చాడు. నిజాం సైన్యం నిఘా మరింత పెంచింది. కొరియర్‌గా వ్యవహరించిన కుర్ధు పటేల్ ఇచ్చిన సమాచారంతో భీం రహస్య స్థావరాలను నిజాం సైన్యం తెలుసుకుని అర్ధరాత్రి వేళ జోడేఘాట్ గుట్టల్ని చుట్టుముట్టింది. హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో కొమురం భీం 1940 సెప్టెంబర్ 1న వీరమరణం పొందాడు. -
భద్రాచలంతో బంతాట..!
భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలం ప్రాంతంతో కేంద్రం బంతాట ఆడుతోంది. ఓ పక్క పోలవరం ప్రాజెక్టు వద్దని ఈ ప్రాంతంలోని ఆదివాసీ సంఘాలు గొంతెత్తి నినదిస్తున్నా...ఇవేమీ పట్టని కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని ఏడు మండలాలను నిట్టనిలువునా ముంచేందుకు కంకణం కట్టుకుంది. పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తరుణంలో ముంపు గ్రామాలు మాత్రమే సీమాంధ్రకు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. కేంద్రమంత్రి, జీవోఎంలో కీలక సభ్యుడైన జైరాంరమేశ్ శుక్రవారం నాడు చేసిన ప్రకటనతో మళ్లీ ఈ ప్రాంతవాసుల్లో కలవరం మొదలై ంది. భద్రాచలం డివిజన్లోని కూనవరం, వీఆర్‌పురం మండలాలు పూర్తిగానూ, భద్రాచలం, చింతూరు మండలాలు పాక్షికంగానూ అదే విధంగా పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగానూ, బూర్గంపాడు మండలం పాక్షికంగా ముంపునకు గురవుతున్న నేపథ్యంలో.... ముంపునకు గురవుతున్న గ్రామాలనే తెలంగాణ నుంచి వేరు చేస్తున్నట్లుగా బిల్లు ఆమోదం సమయంలో ప్రకటించారు. 2005 జూన్27న జారీ చేసిన జీవో నంబర్ 111 ప్రకారం పై మండలాల్లోని 205 గ్రామాలతో పాటు అదనంగా బూర్గంపాడు, సీతారాంనగరం, కండ్రిగ గ్రామాలను కూడా సీమాంధ్రకు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. తాజాగా జైరాంరమేష్ భద్రాచలం పట్టణం, అదే విధంగా బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలను మినహాయించి మొత్తం ఏడు మండలాలను కూడా తెలంగాణ నుంచి వేరు చేస్తున్నట్లుగా ప్రకటించటం గమనార్హం. పాల్వంచ నుంచి బూర్గంపాడు మండలంలోని పినపాక, బంజర్, లక్ష్మీపురం, మణుగూరు క్రాస్‌రోడ్, సారపాక మీదగా భద్రాచలానికి వచ్చే రహదారిలో ఉన్న గ్రామాలను తెలంగాణలో ఉంచినట్లుగా తెలుస్తోంది. భద్రాచలం పట్టణం తెలంగాణలోనే ఉంచినందున ఇక్కడకి వచ్చేందుకు రహదారి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉభయ సభలకు తెలంగాణ బిల్లు రాకముందు జీవోఎం ఇదే నిర్ణయాన్ని తీసుకోగా, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో ఆఖరి నిమిషంలో కొన్ని మార్పులు చేశారు. కానీ తాజాగా చేసిన ప్రకటనతో గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు త్వరలోనే గెజిట్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉండగా, భద్రాచలం ప్రాంతంపై వస్తున్న పుకార్లు ఈ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముంపు గ్రామాలపై తేలని లెక్క పోలవరం ప్రాజెక్టు కింద అసలు ఎన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయనే దానిపై సరైన స్పష్టత లేకపోవటమే ఈ గందరగోళానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 205 గ్రామాలు మాత్రమే ముంపుకు గురవుతాయని సాగునీటి శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ లెక్కన భద్రాచలం మండలంలోని తోటపల్లి ముంపు పరిధిలోకి వస్తుండగా, ఇదే సరిహద్దు గ్రామం కానుంది. కానీ భద్రాచలానికి కూత వేటు దూరంలో గల చోడవరం గ్రామ సమీపంలో కూడా ముంపు కిందకు వస్తుందని సాగునీటి శాఖ అధికారులు రాళ్లు వేయటం గమనార్హం. దీన్ని పరిగణలోకి తీసుకున్నట్లైతే భద్రాచలం మండలం అంతా ముంపు కిందకే వస్తుంది. దీన్ని ప్రాతిపదికగా తీసుకునే కేంద్ర ప్రభుత్వం ముంపు పరిధిలో ఉన్న ఏడు మండలాలను కూడా సీమాంధ్రకు కే టాయించిందని నిపుణులు అంటున్నారు. అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వం రోజుకో విధంగా భద్రాచలంపై ప్రకటన చేస్తుండటం ప్రశ్నార్థకంగా మారింది. భగ్గుమంటున్న ఆదివాసీలు పోలవరం ప్రాజెక్టు కోసమని ఆదివాసీ గ్రామాలను ముంచేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికే ఆదివాసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. తాజా తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ వాదులు కూడా మండిపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటి వరకూ అమలైన గిరిజన చట్టాలకు భవిష్యత్‌లో ముప్పు వాటిల్లే ప్రమాదముందని భావిస్తున్న ఆదివాసీలు న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
‘పోలవరం’ వద్దు
భద్రాచలం, న్యూస్‌లైన్ : పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలంలో ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరాం దిష్టిబొమ్మలను దహనం చేశారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించిన ఆదివాసీలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొండరెడ్ల జిల్లా సంఘం గౌరవ అధ్యక్షుడు ముర్ల రమేష్, తుడుందెబ్బ, ఏవీఎస్పీ రాష్ట్ర నాయకులు వట్టం నారాయణ, సున్నం వెంకటరమణ మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాలను జలసమాధి చేసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 205 ఆదివాసీ గూడేలను పోలవరంలో ముంచేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కేసీఆర్ అనుకూలంగా ఉండటం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక సమన్వయ కర్త మడివి నెహ్రూ, కొర్సా చినబాబు దొర, వెకంటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్పీ ఆధ్వర్యంలో దీక్షలు : మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో చేపట్టిన నిర సన దీక్షలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ దీక్షా శిబిరాన్ని భద్రాచలం టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు, ఎంఎస్పీ నాయకులు రావులపల్లి నర్సింహారావు, వైవీ రత్నంనాయుడు ప్రారంభించారు. ఎంఎస్పీ రాష్ట్ర కార్యదర్శి యాతాకుల భాస్కర్ మాదిగ, గొడ్ల మోహన్‌రావు మాట్లాడారు. ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు కొంతమంది స్వార్థపరులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. దీక్షలకు న్యూడెమోక్రసీ నాయకులు కెచ్చెల రంగారెడ్డి, న్యాయవాదుల సంఘం నాయకులు కొడాలి శ్రీనివాస్, భద్రాచలం సర్పంచ్ భూక్యా శ్వేత, ఐఎమ్ఏ నుంచి వైద్యులు శ్యాంప్రసాద్, సుదర్శన్, అజిత్ రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. దీక్షల్లో సోమయ్య, ఆనందరావు, సందీప్, రవికుమార్, కిరణ్, నరేష్, రాము, బ్రహ్మానందరావు, సాలయ్య, శ్రీను, రమణయ్య, రాజు, సుందరం, రాములు, అనీల్ కుమార్, అశోక్ తదితరులు కూర్చొన్నారు. దీక్షలకు పీఆర్ ఉద్యోగుల సంఘం నాయకులు గౌసుద్ధీన్, మందల రవి, అలవాల రాజా తదితరులు సంఘీభావం పకటించారు.