‘గురుకుల’ విద్యార్థినికి గర్భం | Tribal welfare college girl impregnated | Sakshi
Sakshi News home page

‘గురుకుల’ విద్యార్థినికి గర్భం

Published Sun, Dec 29 2019 4:40 AM | Last Updated on Sun, Dec 29 2019 5:08 AM

Tribal welfare college girl impregnated - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: కుమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లోని గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని గర్భం దాల్చడం కలకలం సృష్టించింది. అయితే.. ప్రేమ వ్యవహారమే కారణమని అధికారుల విచారణలో తేలింది. వివరాలు.. గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతున్న 10 మంది విద్యార్థినులకు ఇటీవల రుతుస్రావం సమస్య ఎదురైంది. దీంతో నవంబర్‌ 21న కళాశాల సిబ్బంది ఆదిలాబాద్‌ రిమ్స్‌లో పరీక్షలు చేయించారు. ఇందులో ముగ్గురిపై అనుమానంతో గర్భనిర్దారణ పరీక్షలు చేయించారు.

వారికి మొదట పాజిటివ్‌ వచ్చింది. ధ్రువీకరణ కోసం మళ్లీ వారం తర్వాత రావాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే.. కళాశాల సిబ్బంది మళ్లీ రిమ్స్‌కు వెళ్లకుండా స్థానికంగా ఉన్న ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించారు. ఇందులో ఒక విద్యార్థిని మాత్రమే గర్భం దాల్చినట్లు తేలింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాగా, శనివారం ఆసిఫాబాద్‌ ఆర్డీఓ సిడాం దత్తు, గిరిజన సంక్షేమ శాఖ జీసీడీవో శంకుతల, డీసీపీవో మహేశ్, ఐసీడీఎస్‌ పీడీ సావిత్రి శనివారం విచారణ చేపట్టగా.. గర్భానికి ప్రేమ వ్యవహారమే కారణమని సదరు విద్యార్థిని ఒప్పుకుంది.

మా కళాశాలను బద్నాం చేస్తారా?
గురుకుల కళాశాలలో విద్యార్థిని గర్భం దాల్చడంపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆ కళాశాల విద్యార్థినులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కళాశాల పేరుప్రఖ్యాతులు భంగం కలిగేలా మీడియాలో ప్రచారం చేశారని, ఇందులో ప్రిన్సిపాల్‌ పాత్ర ఏమీ లేదని వసతిగృహ భవనం ఎదుట ధర్నాకు దిగారు. ఆసిఫాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ విద్యార్థినులతో మాట్లాడి శాంతిపజేశారు. కాగా, ఈ ఘటనపై విచారణ కోసం ఆర్డీఓ లక్ష్మయ్య ఆలస్యంగా రావడంపై విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని ఆందోళన చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement