సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఎన్డీయే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని దళిత, గిరిజన సంఘాల ప్రతిఘటన దీక్షలో నేతలు హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ఈ దీక్షలో పలువురు నేతలు మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలు, త్యాగాలతో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వచ్చిందని, దళిత గిరిజనులకు అండగా ఉండాల్సిన కేంద్రం ఆ చట్టాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
దేశవ్యాప్తంగా దళిత, గిరిజనులపై జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలు కులదూషణ కేసులు కోర్టు వరకు వెళ్లడం లేదని, పోలీసు స్టేషన్లలోనే రాజీ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు వరకు వెళ్లిన కేసుల్లో బాధితులను బెదిరించి రాజీ చేయిస్తున్నారని పేర్కొన్నారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు పాత చట్టాన్ని పటిష్టం చేస్తూ బిల్లు తేవాలని డిమాండ్ చేశారు.
ఈ దీక్షకు టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ అధ్యక్షత వహించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ, తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు ఎర్రవళ్లి రాములు మాల, నేతలు పెబ్బె జీవ మాదిగ, రాయికంటి రాందాస్, కె.సాంబశివరావు, సింగిరెడ్డి పరమేశ్వర్, గడ్డయాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment