ఎన్నాళ్లీ వేధింపులు? | SC, STI rape preventive law | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ వేధింపులు?

Published Mon, Aug 21 2017 2:00 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

ఎన్నాళ్లీ వేధింపులు? - Sakshi

ఎన్నాళ్లీ వేధింపులు?

ఎస్సీ, ఎస్టీలపై పెరుగుతున్న అఘాయిత్యాలు
► నేరాల్లో అత్యాచారాలు, లైంగిక వేధింపులే ఎక్కువ
► రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెరిగిన కేసుల నమోదు
►  మూడు వేల మంది బాధితులకు పరిహారం
►  అట్రాసిటీ చట్టంలో పలు సవరణలు
► బాధితులకు పెరిగిన ఆర్థిక సాయం  


రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఓ వ్యాపారి తన ఇంట్లో పనిచేస్తున్న పదిహేడేళ్ల ఎస్సీ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. విషయం బయటికి చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆవేదనకు లోనైన బాలిక ఆ ఇంట్లో పనికి వెళ్లనంటూ తల్లిదండ్రుల వద్ద మొండికేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ధైర్యం చేసి.. ఆ వ్యాపారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారు. విచారణ జరిపిన అట్రాసిటీ కమిటీ.. బాలికకు రెండు నెలల్లోనే రూ.8.25 లక్షల పరిహారం ఇప్పించింది. కేసు విచారణ వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది..

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీలపై దాడుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. గత మూడేళ్లలో ఈ కేసుల సంఖ్య రెట్టింపవడం గమనార్హం. 2016–17 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికి సంబంధించి అట్రాసిటీ కేసులను ప్రభుత్వ యంత్రాంగం పరిష్కరించింది. బాధితులకు పరిహారం అందజేసింది. ఈ మొత్తం నేరాల్లో నాలుగోవంతు కేసులు అత్యాచారాలు, లైంగిక వేధింపులకు సంబంధించినవే కావడం ఆందోళనకరం.

ఇవేగాకుండా అపరిష్కృతంగా ఉన్నవి, ఎఫ్‌ఐఆర్‌లు సైతం నమోదు కాకుండా పెండింగ్‌ దశలో ఉన్న కేసులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అసలు నమోదయ్యే కేసుల సంగతేమోగానీ... పోలీస్‌ స్టేషన్‌ వరకు రాని కేసులు పెద్ద సంఖ్యలో ఉంటాయని అంచనా. అలాంటి వాటిల్లో 35 శాతం కేసులు పంచాయితీ పెట్టి ముగించేవికాగా.. మిగతావి బెదిరింపులతో సర్దిపుచ్చేవేనని చెబుతున్నారు.

పెరుగుతున్న కేసుల సంఖ్య
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఈ చట్టం పరిధిలో గతంలో 22 కేటగిరీలకు సంబంధించిన కేసులు మాత్రమే నమోదు చేయగా.. ఇటీవలి చట్ట సవరణతో కేటగిరీల సంఖ్య 47కు పెరిగింది. అంటే చిన్నపాటి దూషణ, అవమానించడం వంటివాటిపైనా బాధితులు కేసులు పెట్టొచ్చు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా అట్రాసిటీ కేసుల నమోదు పెరుగుతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి పరిశీలిస్తే... 2014లో 284 కేసులు నమోదుకాగా, 2015లో 787, 2016లో 1,007 కేసులు, ఈ ఏడాది జూన్‌ నాటికి 913 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో మహిళలపై అత్యాచార ఘటనలకు సంబంధించి గతేడాది 203 కేసులు నమోదుకాగా.. ఈసారి జూన్‌ నాటికి 115 కేసులు నమోదయ్యాయి. చట్టంపై అవగాహన పెరగడంతోనే నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

బాధితులకు పరిహారం పెంపు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని కేంద్రం గణనీయంగా పెంచింది. తాజాగా చేసిన చట్ట సవరణల్లో కేసుల వారీగా పరిహారాన్ని నిర్దేశించింది. మహిళలపై లైంగిక దాడి, అత్యాచారాలకు సంబంధించి పరిహారాన్ని ఐదు రెట్లు పెంచింది. మహిళలపై యాసిడ్‌ దాడి, లైంగిక దాడికి సంబంధించి ఇప్పటివరకు రూ.1.80 లక్షలు ఇవ్వగా.. ప్రస్తుతం రూ.8.25 లక్షలకు పెంచారు. అత్యాచారం, సామూహిక అత్యాచారం కేసుల్లో పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి... రూ.5 లక్షలు, రూ.8.25 లక్షలకు పెంచారు.

వీటితోపాటు హత్య, అవమానం, దూషణ తదితర అంశాల్లోనూ పరిహారాన్ని పెంచారు. మహిళల పట్ల లైంగిక వేధింపుల అంశాన్ని తీవ్ర నేరం కింద పరిగణించాలని నిర్ణయించారు. ఇలా పరిహారం పెంపుతోపాటు ఎస్సీ, ఎస్టీల్లో అవగాహన కల్పించడం నేపథ్యంలో నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ చట్టం కింద కేసు నమోదైతే బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించిన నేపథ్యంలో.. అలాంటి వాటిని ప్రాథమిక విచారణ దశలోనే తొలగిస్తున్నారు.

రక్షణకు వజ్రాయుధమిదే..
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం.. వేధింపుల నుంచి రక్షణ పొందడానికి దళిత, గిరిజన వర్గాలకు వజ్రాయుధం. దాడులు, అవమానకర పరిస్థితుల్లో బాధితులకు అండగా ఉండడంతో పాటు ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని సైతం అందిస్తుంది. నిందితుడిపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేయడానికి వీలవుతుంది. 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం రూపుదిద్దుకోగా.. 1995 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. తాజాగా ఈ చట్టంలో పలు మార్పులు చేపట్టిన ప్రభుత్వం... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం–2016ను అమలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement