Bhadrachalam Major panchayat
-
ముదిరిన భద్రాచలం ‘పంచాయితీ’
భద్రాచలం : భద్రాచలం మేజర్ పంచాయతీ వివాదాల సుడిగుండ ంలో చిక్కుకుంది. ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలతో పంచాయతీలోని అడ్డగోలు పనులు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దీన్ని ధ్రువీకరిస్తూ సర్పంచ్ భూక్యా శ్వేత సైతం ఈవో, సిబ్బందిపై తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులకు తెలియకుండానే ఇంటి పర్మిషన్లు ఇస్తూ లక్షలు గడిస్తున్నారని ఆరోపించారు. బిల్ కలెక్టర్లు ఇష్టానుసారంగా దొంగ రశీదులు జారీ చేస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటిపన్నుల వసూలు చేస్తూ సొంతానికి వాడుకుంటున్నారని, ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శి బాధ్యాతాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు సొంతానికి వాడుకుంటున్నారనే విషయాన్ని డివిజన ల్ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. పంచాయతీ వర్క ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పంచాయతీలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలను తాను ఎక్కడ బయట పెడతాననే భయంతోనే కార్యదర్శి, డీఎల్పీఓ, సిబ్బంది ఏకమై వార్డు మెంబర్లను రెచ్చగొట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ పరిధిలో సెల్‌టవర్స్ ఏర్పాటుకు తీర్మానం లేకుండా, పాలకవర్గానికి చెప్పకుండా కార్యదర్శి ఒక్కరే లక్షలాది రూపాయలు తీసుకొని అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. పంచాయతీ అధికారులంతా ఏకమై గిరిజన మహిళ అయిన తనను పరిపాలన చేయనివ్వకుండా చెక్ పవర్ రద్దు చేయించే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్‌ను కలవనున్నట్లు తెలిపారు. దేనికైనా రెడీ..: శ్రీమన్నారాయణ, ఈఓ సర్పంచ్ శ్వేత చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవం. డబ్బులు తీసుకుంటున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ. తీర్మానాల మేరకే సెల్‌టవర్లకు పర్మిషన్లు ఇచ్చాం. కొన్ని పనులను కట్టడి చేస్తున్నందుకే ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. -
‘ఇంటి’దొంగల ఆటకట్టిస్తాం..
భద్రాచలం : భద్రాచలం మేజర్ పంచాయతీ లో నకిలీ ఇంటిపన్నుల వ్యవహారంపై ‘ఇంటి దొంగలు’ అనే శీర్షికన బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన పరిశోధనాత్మక కథనం స్థానికంగా పెద్ద సంచలనం కలిగించింది. ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడిచేలా పంచాయతీ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును పాల కమండలి సైతం తప్పుపట్టింది. ప్రస్తుతానికి ఆరు నకిలీ ఇంటిపన్ను రశీదులు బయట పడగా, ఇవిఇంకా ఎక్కువగానే ఉంటాయనే చర్చ సాగుతోంది. దీనిపై ఉన్నతాధికారుల కూడా రంగప్రవేశం చేశారు. డివిజనల్ పంచాయతీ అధికారిణి ఆశాలత ఈ విషయమై ఆరా తీశారు. ఇప్పటికే తన దృష్టికి ఒక నకిలీ రశీదు వచ్చిందని, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తామన్నారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా దీనిపై సీరియస్‌గానే ఉన్నట్లుగా తెలిసింది. సాక్షి కథనంలో పేర్కొన్నవన్నీ వాస్తవమే: సర్పంచ్ భూక్యా శ్వేత ‘నకిలీ ఇంటిపన్నులు బయటపడిన మాట వాస్తవం. ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తలోని అన్ని అంశాలూ కరెక్టే. ఆ నకిలీ రశీదులు ఎవరు ఇచ్చారనే దానిపై సమగ్ర విచారణ చేయాలని పంచాయతీ అధికారుల ను ఆదేశించాం. బాధ్యులపై క్రిమినల్ చర్య లు తీసుకునేలా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిందిగా ఈవోకు సూచించాం. నాకు తెలియకుండానే పంచాయతీలో పనులు జరిగిపోతున్నాయి. ఎటువంటి వర్క్ ఆర్డర్ లేకుండా 8, 9, 10 వార్డులలో పనులు చేస్తున్నారు. దీనిలో వర్క్ ఇన్స్‌స్పెక్టర్ ప్రమేయం ఉంది. అతనిపై తగు చర్యలు తీసుకుంటాం. పాలకమండలిలోనూ చర్చిస్తాం. వర్క్ఇన్స్పెక్టర్ పంచాయతీకి భారమే అతన్ని తొలగించి పీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. ఈ ఏడాది ఇంటిపన్నుల వసూళ్లకు త్వరలోనే డిమాండ్ నోటీసులు ఇస్తాం. గతంలో అధికారుల పాలనలో ఎక్కువగా నకిలీ ఇంటిపన్నుల రశీదులు జారీ అయినట్లుగా గుర్తించాం. పట్టణ ప్రజలు వారి ఇంటిపన్ను రశీదులను ఓసారి పరిశీలించుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. ఈ విషయంలో ప్రజలు నేరుగా నన్ను సంప్రదించవచ్చు’ అని సర్పంచ్ భూక్యా శ్వేత అన్నారు. బుధవారం తన నివాసగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూనెం కృష్ణ, బాణోత్ కృష్ణ, సోడె లక్ష్మితో కలిసి ఆమె మాట్లాడారు. -
భద్రాద్రి పంచాయతీ నుంచి ‘రాజుపేట’ ఔట్..!
* అంగన్వాడీ కేంద్రానికి సరుకులు నిలిపివేత * ఎటపాక పంచాయతీలో విలీనం..? భద్రాచలం: భద్రాచలం మేజర్ పంచాయతీలో భాగమైన రాజుపేట కాలనీలోని కొన్ని ఇళ్లను వేరుచేసేందుకు రంగం సిద్ధమైంది. ఒక్క భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మాత్రమే మినహాయించి, మిగతా మండలం మొత్తాన్ని ఏపీలో విలీనం చేస్తూ నెల్లిపాక మండల కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. లక్ష్మీదేవి పేట రెవెన్యూ గ్రామ పరిధిలోకి వచ్చే రాజుపేట కాలనీలో సుమారు 210 కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను, ఆ ప్రాంతా న్ని ఇక్కడి అధికారులు భద్రాచలం పంచాయతీ నుంచి వేరు చేశారు. సమగ్ర కుటుంబ సర్వే సమయంలో ఈ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. తమను కూడా సర్వే చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు సర్వే చేశారు. ఆ సమాచారాన్ని మాత్రం కంప్యూటరీకరణ చేయకుండానే పక్కన పడేశారు. ఈ విషయం తెలీని రాజుపేట కాలనీ వాసులు తాము ఇంకా భద్రాచలంలో భాగంగానే ఉన్నామన్న భావనలో ఉన్నారు. పింఛన్లు, ఆహార భద్రత కార్డులు, ఫాస్ట్ పథకం కోసం కూడా ఈ కాలనీ వాసులు భద్రాచలం తహశీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ లక్ష్మీదేవిపేట రెవెన్యూ గ్రామ పరిధిలోకి వచ్చే రాజుపేట కాలనీలోని 210 ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవటం లేదు. దరఖాస్తుల విభజన సమయంలో వీటిపై ‘ఏపీ’ అని రాసి, కట్టలు కట్టి పక్కన పడేశారు. కేవలం భద్రాచలం రెవెన్యూ గ్రామ పరిధిలోగల ఇళ్లలోని వారినే పరిగణలోకి తీసుకుని దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇదేమీ తెలియని కాలనీ వాసులు... తమకు భద్రాచలం మండలం నుంచే రేషన్ కార్డులు, పింఛన్లు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. అధికారులు కూడా దీనిపై స్పష్టంగా చెప్పడం లేదు. సరిహద్దుల ఏర్పాటుకు ఏపీ అధికారులు కూడా ముందుకు రావడం లేదు. దీంతో, రాజుపేట కాలనీ వ్యవహారం గందరగోళంగా మారింది. కాలనీలో మినీ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసిన ప్రాంతం భద్రాచలం రెవెన్యూ గ్రామ పరిధిలో లేనందున దీనితో తమకు సంబంధం లేదని ఐసీడీఎస్ అధికారులు ప్రకటించారు. అంతేకాదు.. దీనికి పౌష్టికాహారం కూడా ఏపీ నుంచే సరఫరా అవుతుందని చెప్పి, ఈ నెలకు సంబంధించిన సరుకులను భద్రాచలం నుంచి నిలిపివేశారు. కానీ ఈ కేంద్రానికి ఇప్పటివరకు ఏపీ నుంచి కూడా సరుకులు రాలేదు. ఎటపాక పంచాయతీలో విలీనం లక్ష్మీదేవిపేట రెవెన్యూ గ్రామ పరిధిలోకి వచ్చే రాజుపేట కాలనీలోని ఓ భాగాన్ని ఎటపాక పంచాయతీలో విలీనం చేసేందుకు ఏపీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఎటపాక వీఆర్వోనే లక్ష్మీదేవి పేట రెవెన్యూ గ్రామాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి భూముల రికార్డులన్నీ సదరు అధికారి ఆధీనంలోనే ఉన్నాయి. దీనినిబట్టి రాజుపేట కాలనీని ఎటపాకలోనే కలుపుతారని అర్థమవుతోంది. జన్మభూమి కార్యక్రమం ముగిసిన తరువాత దీనిపై ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. సంక్షేమ పథకాలకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో..! భద్రాచలం రెవెన్యూ గ్రామ పరిధిలోకి రాని రాజుపేట కాలనీ, శ్రీరామనగర్ కాలనీ వాసులు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సర్వేల్లో వీరికి చోటివ్వటం లేదు. దీంతో వీరిని ఏపీలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలోనైనా దరఖాస్తు చేసుకునేలా తగిన సూచనలిచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. లేనట్టయితే ఈ కాలనీ వాసులు ఎటూ కాకుండా పోయే ప్రమాదముంది. ఇప్పటికైనా అధికారులు ఈ కాలనీలపై స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.