భద్రాచలం : భద్రాచలం మేజర్ పంచాయతీ వివాదాల సుడిగుండ ంలో చిక్కుకుంది. ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలతో పంచాయతీలోని అడ్డగోలు పనులు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దీన్ని ధ్రువీకరిస్తూ సర్పంచ్ భూక్యా శ్వేత సైతం ఈవో, సిబ్బందిపై తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులకు తెలియకుండానే ఇంటి పర్మిషన్లు ఇస్తూ లక్షలు గడిస్తున్నారని ఆరోపించారు.
బిల్ కలెక్టర్లు ఇష్టానుసారంగా దొంగ రశీదులు జారీ చేస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటిపన్నుల వసూలు చేస్తూ సొంతానికి వాడుకుంటున్నారని, ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శి బాధ్యాతాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు సొంతానికి వాడుకుంటున్నారనే విషయాన్ని డివిజన ల్ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. పంచాయతీ వర్‌క ఇన్‌స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
పంచాయతీలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలను తాను ఎక్కడ బయట పెడతాననే భయంతోనే కార్యదర్శి, డీఎల్‌పీఓ, సిబ్బంది ఏకమై వార్డు మెంబర్లను రెచ్చగొట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ పరిధిలో సెల్‌టవర్స్ ఏర్పాటుకు తీర్మానం లేకుండా, పాలకవర్గానికి చెప్పకుండా కార్యదర్శి ఒక్కరే లక్షలాది రూపాయలు తీసుకొని అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. పంచాయతీ అధికారులంతా ఏకమై గిరిజన మహిళ అయిన తనను పరిపాలన చేయనివ్వకుండా చెక్ పవర్ రద్దు చేయించే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్‌ను కలవనున్నట్లు తెలిపారు.
దేనికైనా రెడీ..: శ్రీమన్నారాయణ, ఈఓ
సర్పంచ్ శ్వేత చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవం. డబ్బులు తీసుకుంటున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ. తీర్మానాల మేరకే సెల్‌టవర్లకు పర్మిషన్లు ఇచ్చాం. కొన్ని పనులను కట్టడి చేస్తున్నందుకే ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.
ముదిరిన భద్రాచలం ‘పంచాయితీ’
Published Sat, Nov 29 2014 3:18 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement