* అంగన్‌వాడీ కేంద్రానికి సరుకులు నిలిపివేత
* ఎటపాక పంచాయతీలో విలీనం..?
భద్రాచలం: భద్రాచలం మేజర్ పంచాయతీలో భాగమైన రాజుపేట కాలనీలోని కొన్ని ఇళ్లను వేరుచేసేందుకు రంగం సిద్ధమైంది. ఒక్క భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మాత్రమే మినహాయించి, మిగతా మండలం మొత్తాన్ని ఏపీలో విలీనం చేస్తూ నెల్లిపాక మండల కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది.
లక్ష్మీదేవి పేట రెవెన్యూ గ్రామ పరిధిలోకి వచ్చే రాజుపేట కాలనీలో సుమారు 210 కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను, ఆ ప్రాంతా న్ని ఇక్కడి అధికారులు భద్రాచలం పంచాయతీ నుంచి వేరు చేశారు. సమగ్ర కుటుంబ సర్వే సమయంలో ఈ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. తమను కూడా సర్వే చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు సర్వే చేశారు. ఆ సమాచారాన్ని మాత్రం కంప్యూటరీకరణ చేయకుండానే పక్కన పడేశారు. ఈ విషయం తెలీని రాజుపేట కాలనీ వాసులు తాము ఇంకా భద్రాచలంలో భాగంగానే ఉన్నామన్న భావనలో ఉన్నారు.
పింఛన్లు, ఆహార భద్రత కార్డులు, ఫాస్ట్ పథకం కోసం కూడా ఈ కాలనీ వాసులు భద్రాచలం తహశీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ లక్ష్మీదేవిపేట రెవెన్యూ గ్రామ పరిధిలోకి వచ్చే రాజుపేట కాలనీలోని 210 ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవటం లేదు. దరఖాస్తుల విభజన సమయంలో వీటిపై ‘ఏపీ’ అని రాసి, కట్టలు కట్టి పక్కన పడేశారు. కేవలం భద్రాచలం రెవెన్యూ గ్రామ పరిధిలోగల ఇళ్లలోని వారినే పరిగణలోకి తీసుకుని దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇదేమీ తెలియని కాలనీ వాసులు... తమకు భద్రాచలం మండలం నుంచే రేషన్ కార్డులు, పింఛన్లు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. అధికారులు కూడా దీనిపై స్పష్టంగా చెప్పడం లేదు. సరిహద్దుల ఏర్పాటుకు ఏపీ అధికారులు కూడా ముందుకు రావడం లేదు. దీంతో, రాజుపేట కాలనీ వ్యవహారం గందరగోళంగా మారింది.
కాలనీలో మినీ అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేసిన ప్రాంతం భద్రాచలం రెవెన్యూ గ్రామ పరిధిలో లేనందున దీనితో తమకు సంబంధం లేదని ఐసీడీఎస్ అధికారులు ప్రకటించారు. అంతేకాదు.. దీనికి పౌష్టికాహారం కూడా ఏపీ నుంచే సరఫరా అవుతుందని చెప్పి, ఈ నెలకు సంబంధించిన సరుకులను భద్రాచలం నుంచి నిలిపివేశారు. కానీ ఈ కేంద్రానికి ఇప్పటివరకు ఏపీ నుంచి కూడా సరుకులు రాలేదు.
ఎటపాక పంచాయతీలో విలీనం
లక్ష్మీదేవిపేట రెవెన్యూ గ్రామ పరిధిలోకి వచ్చే రాజుపేట కాలనీలోని ఓ భాగాన్ని ఎటపాక పంచాయతీలో విలీనం చేసేందుకు ఏపీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఎటపాక వీఆర్‌వోనే లక్ష్మీదేవి పేట రెవెన్యూ గ్రామాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి భూముల రికార్డులన్నీ సదరు అధికారి ఆధీనంలోనే ఉన్నాయి. దీనినిబట్టి రాజుపేట కాలనీని ఎటపాకలోనే కలుపుతారని అర్థమవుతోంది. జన్మభూమి కార్యక్రమం ముగిసిన తరువాత దీనిపై ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం.
సంక్షేమ పథకాలకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో..!
భద్రాచలం రెవెన్యూ గ్రామ పరిధిలోకి రాని రాజుపేట కాలనీ, శ్రీరామనగర్ కాలనీ వాసులు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సర్వేల్లో వీరికి చోటివ్వటం లేదు. దీంతో వీరిని ఏపీలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలోనైనా దరఖాస్తు చేసుకునేలా తగిన సూచనలిచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. లేనట్టయితే ఈ కాలనీ వాసులు ఎటూ కాకుండా పోయే ప్రమాదముంది. ఇప్పటికైనా అధికారులు ఈ కాలనీలపై స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.
భద్రాద్రి పంచాయతీ నుంచి ‘రాజుపేట’ ఔట్..!
Published Sun, Nov 2 2014 3:20 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement