300 కోట్లతో ఫౌండ్రీ పార్క్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగర్ ఫౌండ్రీస్ అసోసియేషన్ మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫౌండ్రీ పార్క్ త్వరలోనే రూపుదిద్దుకోనుంది. శివంపేట మండలం నవాబ్‌పేట వద్ద 170 ఎకరాల్లో ఇది రానుంది. రెవెన్యూ శాఖ నుంచి త్వరలోనే ఏపీఐఐసీకి స్థలాన్ని బదలాయిస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర శనివారమిక్కడ తెలిపారు.
పార్కులో శిక్షణ సంస్థ, కామన్ టెస్టింగ్ ఫెసిలిటీని పీపీపీ విధానంలో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు సదరన్ ఇండియా ఫౌండ్రీమెన్ సదస్సులో చెప్పారు. మొత్తం 50 కంపెనీలు రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయని అసోసియేషన్ కార్యదర్శి ఎం.ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 10 వేలు, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.