Bhagyam
-
చికిత్స కోసం వెళుతూ అనంతలోకాలకు...
రోడ్డు ప్రమాదంలోమహిళ మృతి ఇద్దరికి గాయాలు గూడూరు : అనారోగ్యానికి గురైన ఓ మహిళ చికిత్స కోసం భర్త, తమ్ముడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతూ ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చిట్టిగూడూరులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కొత్తతుమ్మలపాలెం గ్రామానికి చెందినపందుల భాగ్యం (45) కొన్ని రోజులుగా అస్వస్థతకు గురైంది. స్థానికంగా ప్రథమ చికిత్స చేస్తున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో పామర్రులో ఉంటున్న తన సోదరుడు పాము బాలకు సమాచారం అందించింది. బుధవారం రాత్రి తుమ్మలపాలెం గ్రామానికి చేరుకున్న బాల గురువారం ఉదయం తన అక్క భాగ్యాన్ని ఆమె భర్త సుందరరావులను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని పర్ణశాల మీదుగా విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై మచిలీపట్నం వైపు వస్తున్నాడు. మార్గమధ్యలో చిట్టిగూడూరు సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న మట్టి ట్రాక్టర్ వీరి వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పల్టీ కొట్టగా అనారోగ్యంతో బాధపడుతున్న భాగ్యం తలకు తీవ్రగాయాలు కావడంతో పాటు ట్రాక్టర్ చక్రాలు ఆమె మీదుగా వెళ్లడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న బాలకు, సుందరరావులకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన భాగ్యం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సుందరరావు, బాలలు తలకు, చేతులకు గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నారు. భాగ్యం మృతి వార్త తెలియగానే కొత్త తుమ్మలపాలెం గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసే సుందరరావు, భాగ్యాలకు అనుకోని విపత్తు ఏర్పడటంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఏఎస్ఐ కిష్వర్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ నిర్వహించారు. -
బాలికకు విముక్తి
టంగుటూరు, న్యూస్‌లైన్ : ఓ మహిళ వద్ద బంధీగా ఉన్న 13 సంవత్సరాల బాలికకు చైల్డ్‌లైన్ (1098) చొరవతో విముక్తి లభించింది. గురువారం టంగుటూరులో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకెళ్తే... మహబూబ్‌నగర్ జిల్లా రూరల్ మండలం ఎర్తెని గ్రామంలో నివాసం ఉండే నిరుపేద అయిన నరసింహులుకు ఏడుగురు సంతానం. నాలుగేళ్ల క్రితం భార్య మరణించడంతో అతనే పిల్లలను చూసుకుంటున్నాడు. వారిలో చివరి కుమార్తె అయిన 13 ఏళ్ల భాగ్యంకు మినహా మిగిలిన వారందరికీ వివాహాలయ్యాయి. ఈ నేపథ్యంలో కూలి పనుల నిమిత్తం జిల్లాలోని టంగుటూరు నుంచి మహబూబ్‌నగర్ వలస వెళ్లిన పద్మ అనే మహిళ.. వారం రోజుల క్రితం ఇంటి ముందు ఏడుస్తూ కనిపించిన భాగ్యంను చూసి దగ్గరకు తీసుకుని ఓదార్చింది. తనతో వస్తే బాగా చూసుకుంటానని మాయచేసింది. కొత్త డ్రస్సు కొనిపిస్తానంటూ వెంటబెట్టుకుని హైదరాబాద్ తీసుకెళ్లింది. అక్కడ ఉంటున్న తనకు తెలిసిన వారింట్లో రెండు రోజులు ఉండి అనంతరం బాలికను తీసుకుని టంగుటూరులోని తన ఇంటికి చేరింది. స్థానిక పోతుల చెంచయ్య వెస్ట్‌కాలనీలోని ఒక చిన్న రేకుల గదిలో బాలికను బంధించింది. అయితే, టంగుటూరు వచ్చిన తర్వాత ఆమె అసలు రూపం బయటపడింది. స్థానిక వీధుల్లో యాచించి డబ్బు తీసుకురావాలంటూ బాలికను హింసించడం ప్రారంభించింది. మద్యం సేవించాలని చిత్రహింసలకు గురిచేసింది. పద్మ చేష్టలకు బెంబేలెత్తిన బాలిక బుధవారం అక్కడి నుంచి తప్పించుకుని ఏడుస్తూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం రోడ్డులో వెళ్తుండగా.. ఆ రోడ్డులో హోటల్ నిర్వహించే ఓ మహిళ గమనించి దగ్గరకు తీసింది. వివరాలు తెలుసుకుని ఇంటికి తీసుకెళ్లింది. ఆమె ద్వారా బాలిక విషయం తెలుసుకున్న స్థానిక అంగన్వాడీ కార్యకర్త వెంటనే ఒంగోలులోని చైల్డ్‌లైన్ (1098) ప్రతినిధి సాగర్‌కు సమాచారం అందించింది. టంగుటూరు పోలీసుల సాయంతో గురువారం రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్ ప్రతినిధి.. హోటల్ నిర్వాహకురాలి వద్ద ఆశ్రయం పొందుతున్న బాలికను తీసుకెళ్లి చైల్డ్‌లైన్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. ఆయన ఆదేశాల మేరకు నాగులుప్పలపాడు మండలం మాచవరంలోని ఆశాసదన్ హోంకు బాలికను తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పద్మ పరారవడంతో ఆమె కోసం స్థానికులు గాలిస్తున్నారు. అయితే, దీనిపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని స్థానిక ఎస్సై తిరువీధుల త్యాగరాజు తెలిపారు.