భయం
ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ
‘‘నేనెక్కడున్నాను..’’ అన్నాను మత్తుగా.. ముద్దుగా.. బద్ధకంగా.
‘‘శ్మశానంలో’’.. ఓ కోరస్ వినిపించింది.
‘‘ఎవరు మీరంతా.. ఈ తెల్లని ఏకరూప దుస్తులేంటి? చిరాకుగా ఉంది’’ మత్తుగా అన్నాను.
‘‘నీకింకా మత్తు దిగినట్టు లేదు. కల్తీ కల్లు తాగితే చస్తార్రా ఎదవల్లారా అంటే వినరు కదా’’... కోరస్‌గా గొంతు.
‘‘కల్తీ కల్లు దొరక్క చస్తుంటే.. మీ బృందగానాలొకటి’’... విసుక్కున్నాను.
‘‘నీకు మరీ భాషాభిమానంలా ఉందే. ఇంతకీ ఇక్కడికొచ్చి ఎందుకు చచ్చావు’’... మళ్లీ కోరస్.
నాకు కోపం వచ్చింది. ‘‘నేను చావలేదు.
బ్రతకలేక చస్తున్నాను. చచ్చేలా బ్రతుకుతున్నాను.’’
‘‘నాయన... ఆ పేపర్ భాష ఆపు. లేకపోతే మేము చంపుతాం.’’
‘‘ఇంతకీ ఎవరు మీరంతా. ఈ తెల్లని దుస్తులెందుకేసుకున్నారు? ఆ జుత్తెందుకు అలా వదిలేసారు?’’
‘‘మేము దెయ్యాలం. ఏమో.. సినిమాల్లో, కథల్లో ఇలాంటి డ్రస్సే వేయాలని చెప్పారు కదా..’’
‘‘అవునా.. మరి నేను..’’ అన్నాను.
‘‘అది నీవు చెప్పాలి’’ అన్నాయి దెయ్యాలు.
‘‘అవును. శ్మశానాలు ఇంకా ఉన్నాయా? అన్నీ కబ్జా అయిపోయాయి కదా. ఎవరింట్లో వారే చచ్చినవారిని తగలేసుకోవలసిన దినాలు కదా. అందుకయ్యే ఖర్చులు కూడా సబ్సిడీ మీద ఋణాలు ఇస్తున్నాయి కదా బ్యాంకులు.’’
‘‘కావచ్చు ఆ కథలు తరువాత. ముందు నీ కథ చెప్పి చావు.’’
‘‘మీ దెయ్యాల కథ చెప్పి చావండి’’... రిటార్ట్ ఇచ్చా.
‘‘ఆల్రెడీ చచ్చాం. మళ్లీ చావాలా. సరే చెబుతాం ఇను.’’
విశాఖ నగరం... అందమైన నగరం. స్మార్ట్ సిటీగా ఎంపికైంది. అంతా వెలిగిపోతున్నాదని నాయకులు ‘గంటా’ (పదం తప్పకాదు) పథంగా చెబుతున్నారు. అటువంటి నగరానికి దూరంగా ఓ పెద్ద ఫై ్ల ఓవరుంది. దాని కింద కొన్ని గుడిసెలున్నాయి. ఆ గుడిసెల్లో మనుషులు లేని వేళ పందులు, అవి లేని వేళ మనుషులుంటారు. మనుషులంతా రోజులో ప్రపంచంలో ఎన్ని రకాల పనులున్నాయో అన్ని రకాలు చేస్తారు. కొందరు ‘రాత్రి పనులు’ మాత్రమే చేస్తారు.
ఆకలి కదా మరి.
ఏది ఏమైనా వారంతా మనుషులు. మనుషులు కాని మనుషులు. విశాఖ నగరంలో... అందమైన నగరంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, ప్లీట్లు జరుగుతున్న నగరంలో ఉన్న ప్రాంతం. అక్కడ బతుకుతున్న జనం...
ఒకరోజు...
‘ఇక్కడ నుంచి మెట్రో రైలు మార్గం వేస్తున్నారు. పనులు తొందరలోనే జరుగుతాయి. వారంలోగా మీరంతా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి’ అని అధికారులు తాఖీదులిచ్చారు.
‘‘అంటే ఏమిటి?’’ అడిగారు జనం అమాయకంగా.
‘‘అభివృద్ధి.. రైలుమార్గం.. జపాన్.. సింగపూర్‌లా అన్నమాట’’ అధికార్లు బూరా ఊదారు.
‘‘అక్కడ కూడా మాలాంటి వారున్నారన్నమాట. వారిని తరిమేసి, రైళ్లు వేసారన్నమాట. మనుషుల కన్నా అవే ఎక్కువన్నమాట’’ అన్నారు మరింత అమాయకంగా.
‘‘మీకు ప్రభుత్వం భూములిస్తుంది. ఇళ్లు కట్టుకొనేందుకు బ్యాంకులు లోనిస్తాయి. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, అన్నపూర్ణ, ఆధార్, పాన్ కార్డులిస్తారు. మీ పిల్లలకు ఉద్యోగాలు...’’
‘‘మాకు పెళ్ళిళ్ళు కాలేదయ్యా. ఎవరూ పిల్లనివ్వలేదు’’ అన్నారు మగాళ్లంతా.
‘‘పెళ్ళి చేసుకోవటానికి పిల్లలు కావాలని ఓ పిటిషన్ రాసివ్వండి. కలక్టర్కిస్తాం’’ అని ఒక అధికారి నాలిక కరుచుకున్నాడు.
‘‘అలాగే సామి.. ఓ పది మందైతే సరిపోతారు. లేదా సర్దుకుపోతాం. ఎలా రాయాలో మీరే రాసియ్యండి సామి. ఏలి ముద్రగాళ్ళం... మాకేటి తెలుస్తాది. కావాలంటే నిశానీలేస్తాం’’ అన్నారు జనం.. మరింత అమాయకత్వంతో.
అధికార్లు అసహనంగా, కోపంగా ‘‘మరో వారానికి ఖాళీ చేయండి’’ అన్నారు మరేమీ అనలేక.
ప్రతిపక్షం వాళ్లు వద్దన్నారు. ప్రభుత్వం వారిని ‘అభివృద్ధి నిరోధకులంది’.
ఒకరోజు... నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోయింది. దాదాపు పదిహేను మంది చనిపోయారు. కాంట్రాక్టరు చనిపోయిన వారి కుటుంబాలకు లక్ష చొప్పున ఇచ్చాడు. తరువాత నిర్మాణ పనుల బడ్జెట్ పెంచాడు (లంచాల శాతం పెరిగింది..ట). ప్రభుత్వం ‘మానవతా దృక్పథం’తో స్పందించి బడ్జెట్‌ను అంగీకరించింది.
అలాగ జనం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసారు. కాదు... భయపెట్టి ఖాళీ చేయించారు.
ఇది జరిగి పదిహేనేళ్ళయింది. అక్కడ ఏమీ లేదు. విరిగిన ఫై ్లఓవర్ను మాత్రం అతికారు. ఆ పదిహేను మందిలో మేము కూడా ఉన్నాం.
‘‘దారుణం..’’ అన్నాను నేను.
‘‘నిజమే.. దారుణం..’’ దెయ్యాల కోరస్.
‘‘ఇప్పుడు చెప్పు నీవెందుకు చావాలనుకున్నావు. ఇంతకీ చచ్చావా లేదా?’’
‘‘తెలియదు. ప్రస్తుతానికి చస్తూ బ్రతుకుతున్నాను. బతకటానికి చస్తున్నాను.’’
‘‘ఆపు ఆ సినిమా భాష. వినలేక ఛస్తున్నాం’’ దెయ్యాల కోరస్.
‘‘అదేంటి చచ్చామన్నారు కదా. అంటే చావలేదా..?’’ నా సందేహం.
‘‘కోడిగుడ్డు మీద ఈకలు లాగటం ఆపి, అసలు విషయం చెప్పిచావు’’ అన్నాయి దెయ్యాలు కోపంగా.
దెయ్యాలు కోపాన్ని ఎల్లా ఎక్స్‌ప్రెస్ చేస్తాయి..?
సందేహాలు మానేసి.. సమాధానం చెప్పదలచాను.
‘‘నేనో మధ్యతరగతి మనిషిని. ఆశలు, భయాలు ఎక్కువ. భయాన్ని ఆశలు చంపుతాయి. కోరికలు తలెత్తుతాయి.’’ ‘‘నీకు టీవీలో బాబాలు చెప్పే సొల్లు వినే అలవాటుందా నాయనా’’ అంది ఓ దెయ్యం బాబా లెవెల్లో.
‘‘అది దెయ్యం బాబాలే నాయనా. నీవు చెప్పు’’ అన్నాయి మిగిలిన దెయ్యాలు.
‘‘అంటే.. బాబాలాంటి దెయ్యమా? దెయ్యం లాంటి బాబానా? ఇక్కడ దెయ్యాల లాంటి బాబాలే ఎక్కువ కదా.’’
‘‘అవన్నీ తరువాత. ముందు నీ కథ చెప్పు.’’
‘‘ఓ.కె. ఒకనాడు ఓ గోల్డ్ స్కీమ్ ఏజంట్ వచ్చాడు... పది వేలు కడితే ఆరు నెలలకి లక్షన్నర ఇస్తామని. నేను మరో పదిమంది చేత కట్టిస్తే రెండు లక్షలిస్తారని చెప్పాడు. బంగారం లాంటి అవకాశమన్నాడు. నేను నమ్మాను. మరో పదిమంది చేత నమ్మించాను. సంవత్సరం తిరిగే సరికి గోల్డ్ సంస్థను మూసేసారు. నిండా మునిగాను. నన్ను నమ్మినవారు మునిగారు. నన్ను తంతామన్నారు. తన్నేరు కూడా. బాధను మరవటానికి తాగాను. మా ఆవిడ నన్నొదిలేసి కన్నవారింటికి వెళ్ళిపోయింది. పోలీసు కేసు పెట్టారు. స్నేహితులు కాపుకాసి కాపాడారు. జైలుకి వెళ్ళవలసిన అవసరం తప్పిపోయింది. ఊరి నుంచి పారిపోయాను. చద్దామనుకుంటున్నాను.
చెప్పండి... చావాలా? వద్దా?’’ నాకు ఏడుపు వచ్చింది. కన్నీరు మూసీ నదిలోని మురికి నీరులా తన్నుకు వచ్చింది.
‘‘అయినా ఒరే.. పది వేలు కడితే ఆరు నెలల్లో లక్ష ఎలా ఇస్తారురా. ముష్టివాడికి పావలా వేయటానికి చెల్లదని తెలిసినా పదిసార్లు ఆలోచిస్తారు కదా. లక్షలకు లక్షలు ఎలా వాడి ఎదాన పడేస్తున్నారు. ఎర్రి సన్నాసులారా..!’’
‘‘ఆశ నాయనా. ఆశ.’’ బాబా దెయ్యం ఉవాచ.
‘‘నువ్వు కాస్త మూసుకో. అర్ధరాత్రి అమ్మాయిల సేవలను భక్తి సేవలని చెప్పే కామ బాబాలు చెప్పే మాటలంటే అసహ్యం.’’
‘‘అంటే.. మన బాబా దెయ్యం కూడా అదే టైపా?’’ అన్నాను ఆశగా.
‘‘నోర్ముయ్. వెధవ మనిషి సందేహాల నీవునూ’’ అన్నాయి దెయ్యాలు.
కొంచెం సేపు మా మధ్య నిశ్శబ్దం. తూర్పున వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి.
‘‘నాయనా.. వర్తమానంలో అధికార్లు, ప్రభుత్వం, చిట్ కంపెనీలు అన్ని ఓ మాయ. ఓ దెయ్యాల ప్రపంచం.. బాబాల కన్నా వారే కమ్మగా కబుర్లు చెబుతున్నారు. వారికి కావలసిన విధంగా జనాలను మలుచుకుంటున్నారు. జనాలు చావాలనుకోకూడదు. బ్రతకాలి. అటువంటి వారికి బుద్ది చెప్పటం కోసమైనా బతకాలి’’ బాబా దెయ్యం సలహా.
మిగిలిన దెయ్యాలు అదే నిజమన్నాయి. శ్మశానం నిశ్శబ్దమైపోయింది. నగరం లాంటి శ్మశాన నిశ్శబ్దం కన్నా శ్మశాన నిశ్శబ్దం బాగుంది. ప్రశాంతంగా ఉంది.
నేను మెల్లగా లేచాను. దెయ్యాలకున్న పాటి జ్ఞానం కూడా నాకు లేనందుకు బాధపడ్డాను.
ఇదంతా కలా..? నిజమా..? నేను దెయ్యాలను చూసానా? వాటితో మాట్లాడానా? వాస్తవంలో ఇది సాధ్యమా?
వాస్తవమే. చావు భయం.. చావలనే ధైర్యం.. దెయ్యాల వంటివి. వాటితో నేను ఎంతో కాలంగా సహజీవనం చేస్తున్నాను. కోరికలు కూడా దెయ్యాలే. మరణాన్ని అవి ఆహ్వానిస్తాయి.’’
ఏదో ఉపన్యాసంలో సద్గురు జగ్గీబాబా మాటలు గుర్తుకు వచ్చాయి.
‘‘జీవితమూ మరణమూ కలిసే వస్తాయి. జీవనం సాగాలంటే, మరణం సంభవించడానికి అవకాశం ఇచ్చి తీరాలి. భయం సహజమైనది కాదు. దాన్ని సృష్టించే వ్యక్తే, దాన్ని సృష్టించడం ఆపేస్తే సరి. భయమనేది మిమ్మల్ని మీరే ఓడగొట్టుకొనే ఆయుధం. భయాన్ని తరిమేయాలని అనుకోవటం కన్నా, అది సృష్టించబడకుండా ఉండటమెలాగో చూడాలి.
భయం లేకుండా జీవిస్తే జీవితమంతా అవకాశాలమయంగా కనిపిస్తుంది. ఆటంకాలు తొలగిపోయి జయాలు తప్పక సిద్ధిస్తాయి.’’
ఆ దిశగా నేను ప్రయాణించాలనుకొన్నాను.
నేను దెయ్యాలను చూడాలనుకోవటంలేదు.
బహుశా ఇంక అవి కనిపించకపోవచ్చు.
- భమిడిపాటి గౌరీశంకర్