bhaskar katamneni
-
‘జిల్లా’ జగడం
సాక్షి, ఏలూరు : గిరిజన జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపై వివాదం ముదురుతోంది. ఆరు మండలాలకు చెందిన గిరిజనేతరులు సోమవారం భారీ సంఖ్యలో ఏలూరులోని కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను కలిసేం దుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు రంగప్రవేశం చేసి గుంపులుగా ఉన్న గిరిజనేతరులను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. మైదాన మండలాలను గిరిజన జిల్లాలో కలపవద్దని, గిరిజన జిల్లా ఏర్పాటు అనివార్యమైతే గిరిజనేతరులను వేరే మండలంలో కలపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి గిరిజన జిల్లా ఏర్పాటు ఒక ఆలోచన మాత్రమేనని, ప్రజల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు గిరిజనేతరుల ఏజెన్సీలో గిరజనేతరుల తరపున కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆందోళన చెందవద్దు : ఎంపీ ప్రజాభిప్రాయం ప్రకారమే ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని ఏలూరు ఎంపీ మాగంటి బాబు హామీ ఇచ్చారు. క్యాంపు కార్యాలయంలో ఎంపీ బాబును, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజును జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం గ్రామాలకు చెందిన సుమారు వెయ్యిమంది రైతులు సోమవారం కలిశారు. ఏజెన్సీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు. గిరిజన జిల్లా ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని, ఏజెన్సీలో నివసిస్తున్న 80శాతం గిరిజనేతరుల జీవనం, హక్కుల విషయంలో తగు నిర్ణయం తీసుకుని గిరిజనేతరులకు రక్షణ కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామని, ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని మాగంటి బాబు చెప్పారు. అనంతరం వారిని తీసుకుని కలెక్టరేట్‌కు వచ్చారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటాం : కలెక్టర్ ఏజెన్సీ మండలాల్లో అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, ఈ విషయంలో ఎవరూ కూడా ఎటువంటి అపోహలు చెందవద్దని కలెక్టర్ కాటమనేని భాస్కర్ ప్రజాప్రతినిధులు, గిరిజనేతరులతో అన్నారు. జిల్లాలోని ఏజెన్సీ మండలాలను ప్రత్యేక గిరిజన జిల్లాలో కలిపే విషయంలో అటు గిరిజనులకు, ఇటు గిరిజనేతరులకు సమన్యాయం జరిగేలా చూడాలని ఎంపీ మాగంటి బాబు కలెక్టర్‌ను కోరారు. జీలుగుమిల్లి, బుట్టాయగూడెం ప్రజల తరఫున వినతిపత్రాన్ని కలెక్టర్‌కు ఎంపీ అందచేశారు. తనకు తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయని బాబు అసహనం వ్యక్తం చేశారు. గిరిజన జిల్లా ఏర్పాటు మంచిదేనని, అయితే గిరిజనేతరుల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా సరైన చట్టాలను రూపొందించి రక్షణ కల్పించాలని కోరారు. -
వచ్చామా.. తిరిగామా.. వెళ్లామా!
అంతకు ముందు కాలనీలకు.. పేటలకు.. బస్తీలకు ఓ ఎమ్మెల్యే వస్తున్నారంటే చాలా హడావుడి కనిపించేది. రోడ్ల వెంబడి బ్లీచింగ్ చల్లేవారు. తోరణాలు.. పూలమాలలు.. స్వాగత సత్కారాలు గట్రా నడిచేవి. ఎందుకంటే ఆ ఏరి యాకి ఎమ్మెల్యే స్థాయి నాయకుడు వచ్చాడంటే కచ్చితంగాఅభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలో లేదా శంకుస్థాపనలో పెద్దఎత్తున జరిగేవి. ఒక్కోసారి ఇలాంటివి జరగకపోయినా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చూసి వెంటనే సదరు నేతలు అక్కడి పనులకు సంబంధించి హామీలిచ్చేవారు. కొన్నాళ్లకో.. చాన్నాళ్లకో మొత్తం మీద చాలావరకు పనులు చేసేవారు. మరి మంత్రులే వస్తే.. ఏకంగా ఉప ముఖ్యమంత్రే వస్తే.. ఇప్పుడిదంతా ఎందుకంటే సమైక్యాంధ్రప్రదేశ్ విభజనతో సీమాంధ్ర 13 జిల్లాలతో ఓ రాష్ట్రంగా మిగిలిన తర్వాత కొలువుదీరిన కొత్త మంత్రులు ఎక్కడికక్కడ గిరాగిరా తిరుగుతున్నారు. ఎటుచూసినా అక్కడో మంత్రి పర్యటన.. ఇక్కడో మంత్రి టూరు. కానీ.. ఆ ప్రాంతాలకు ఏం జరుగుతోంది. అక్కడి జనానికి ఏం ఒరుగుతోంది. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. మన జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ‘ఇదిగో ఈ రెండు నెలల్లో ఇది చేశాం’ అని ఎవరూ ఏమీ చెప్పుకోలేని పరిస్థితే ఉంది. కొత్తగా వేల, వందలాది కోట్ల రూపాయల ప్రాజెక్టుల ప్రకటనల గురించి ఇప్పుడెవరూ మాట్లాడటం లేదు. కనీసం బాధితులకు, క్షతగాత్రులకు మంత్రులిచ్చిన హామీల అమలుకు కూడా దిక్కులేని పరిస్థితి నెలకొంటోంది. రెండు వారాల కిందట ఆకివీడు శివారు ధర్మాపురంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఘట నా స్థలంలోనే ఒక మహిళ.. చికిత్స పొందూతూ మరో మహిళ మృతి చెందారు. వీరి కుటుంబాల పరామర్శకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేల బృందం ఆదుకుంటామని హామీలిచ్చింది. క్షతగాత్రుల పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చేర్పించి చదివిస్తామని మంత్రులు వాగ్దానాలు చేశారు. ఆనక ఎవరూ పట్టిం చుకోలేదు. చివరకు ఓ క్షతగాత్రుడు గత సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ‘సార్.. మమ్మల్ని, మా పిల్లల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ కలెక్టర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. కలెక్టర్ కాటమనేని భాస్కర్ వెంటనే స్పందించి ఆ పిల్లలను నగరంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో అప్పగించారు. ఇక్కడ విషయమేమిటంటే.. స్వయంగా ఉపముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు వెళ్లి ఇచ్చిన హామీలు కూడా నెరవేరని స్థితిలో బాధితులు ఏలూరు వచ్చి ప్రజావాణిలో కలెక్టర్‌కు మొరపెట్టుకోవడం. ఒకరిద్దరి బాధితులకు సంబంధించిన సహాయ కార్యక్రమాలపైనే పాలకుల స్పందన ఇలా ఉండటం ఒకింత విమర్శలకు తావి చ్చింది. ఇదొక్క ఘటనే కాదు.. జిల్లాలో ఇటీవల మంత్రులు వెళ్లి అక్కడి జనానికి ఇస్తున్న చిన్నపాటి హామీలు కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇచ్చిన హామీలు పరిష్కారమయ్యాయో లేదోనన్న పరిశీలన ఇప్పటివరకు ఏ నేత కూడా చేస్తున్న దాఖలాలు లేవు. ఏదో వచ్చామా.. తిరిగామా.. వెళ్లామా.. అన్న తీరు కాకుండా మా గోడు కాస్త పట్టించుకోండంటూ సామాన్య జనం వేడుకుంటున్నారు. వింటున్నారా పాలకులూ! కావూరి ఎక్కడ? రెండుసార్లు ఎంపీగా గెలిపించిన పశ్చిమగోదావరి జిల్లా ప్రజలను, ముఖ్యంగా ఏలూరు వాసులను ఎప్పటికీ మరచిపోలేను.. అంటూ మొన్నటివరకు బీరాలు పలికిన కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు ఇప్పుడెక్కడున్నారు.. కనీసం మచ్చు కు కూడా కానరావడం లేదు. కృష్ణా జిల్లాకు చెందిన ఆయనకు వరుసగా రెండుసార్లు 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా ఇక్కడి ప్రజలు పట్టం కట్టా రు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిన తొలినాళ్లలో సమైక్య ఉద్యమ సారధిగా హడావుడి చేసిన ఆయన కేంద్రమంత్రి తాయిలం దక్కగానే ప్లేటు ఫిరాయించడం, చివరివరకు పదవిని అనుభవించి ఎన్నికల సమయం వచ్చేసరికి కాంగ్రెస్‌ను కాదనుకుని బయటకు వచ్చేయడం అందరికీ తెలిసినవే. రాష్ట్ర విభజనకు ఆమోద ముద్ర వేసిందని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన అదే విభజన అంశానికి మద్దతిచ్చిన బీజేపీలో చేరడం కేవలం ఆయన వ్యాపార ప్రయోజనాల కోసమే అన్నది బహిరంగ రహస్యం. సరే.. ఆయన ప్రయోజనాలు, పార్టీల మార్పిడి ఎలా ఉన్నా పదేళ్లు ఆదరించిన ఏలూరుకు ఇటీవలికాలంలో పూర్తిగా రావడం మానేశారు. చివరకు నగరంలోని మోతేవారి తోటలో ఎన్నో ఏళ్లుగా ఉన్న క్యాంపు కార్యాలయాన్ని రెండు నెలల కిందటే ఖాళీ చేసేశారు. ఇప్పుడు ఎటూ ఆయన ప్రజాప్రతినిధి కాదు కాబట్టి జనం కొత్త పాలకులపైనే ఆశగా చూస్తున్నారు. మరి పదేళ్ల పాటు కావూరినే నమ్ముకుని హల్చల్ చేసిన క్యాడర్ పరిస్థితి ఏమిటో? దుందుడుకు ఎమ్మెల్యేకి సీఎం క్లాస్ గెలిచేవరకే పార్టీలు.. రాజకీయాలు.. ఒక్కసారి గెలిచిన తర్వాత ఆ ప్రాంతానికి ప్రజాప్రతినిధి. అంటే ఎన్నికల్లో తనకు ఓటేసిన వారికి, వేయని వారి కూడా తానే ఎమ్మెల్యే. ఈ కనీస స్పృహ కూడా లేని ఒకాయన ఎమ్మెల్యే అయిన తర్వాత వేరే పార్టీ వాళ్లు కనిపిస్తే చాలు ఎగబడి, కలబడి గొడవ చేస్తున్నారట. అంతే కాదు అధికారులను కూడా నోటికొచ్చినంత మాట్లాడేస్తున్నారట. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదరు నేతకు గట్టిగా క్లాస్ పీకారట. ‘జాగ్రత్త.. ఆఫీసర్స్‌తో ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావ్ అని తెలిసింది. మరోసారి ఇలాంటివి నా దృష్టికొస్తే ఊరుకోను’ అని గట్టిగానే మందలించారట. మరి ఇప్పటికైనా సదరు నేతలో మార్పు వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందా.. ఏమో చూద్దాం! - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
ఏమిస్తారో..!
సాక్షి, ఏలూరు : ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలో అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లాకు ఇప్పటివరకూ చేసిందేమీ లేదు. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో స్థాపించే పరిశ్రమలు, సంస్థలపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడలో కలెక్టర్ల సమావేశం జరుగుతుండటంతో జిల్లాకు సంబంధించి కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఎటువంటి ప్రతిపాదనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి కూడా ఎలాంటి వరాలిస్తారనేదానిపైనా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లాలో ప్రభుత్వ భూముల లభ్యత, పరిశ్రమలు, సంస్థల ఆవశ్యకత, పర్యాటక అభివృద్ధి, వాస్తవ పరిస్థితులను వివరిస్తూ కలెక్టర్ నివేదికను సీఎంకు సమర్పించనున్నారు. సీఎం దృష్టికి కలెక్టర్ తీసుకువెళ్లే ప్రధానాంశాలు జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూములు ఎంపిక చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడంతో కలెక్టర్ మూడు ప్రాంతాల్లో భూములు ఉన్నట్లు గుర్తించారు. తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూములు, వెంకట్రామన్నగూడెం, చింతలపూడి అటవీ భూములు అనువుగా ఉంటాయని, ఈ మూడు చోట్ల దాదాపు 1500 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని నివేదిక తయారుచేశారు. నరసాపురం వద్ద మినీ ఫిషింగ్ హార్బర్, భీమవరం పరిసరాల్లో లేసుపార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటువ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు ద్వారా అభివృద్ధి ల్లేరు, సముద్రతీరం, చారిత్రక ప్రదేశాలు, ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం, పాలకొల్లు, భీమవరం పంచారామ క్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధితో ఆదాయం. జిల్లా కేంద్రం ఏలూరులో ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఒకే చోటికి చేర్చాలని భావిస్తున్నారు. దీనికి అవసరమైన భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని కలెక్టర్ కోరనున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ కోసం జిల్లాలో అత్యాధునిక భవన నిర్మాణం జరగనుంది. దాని కోసం రూ.కోటి నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పం చాయతీల పాత భవనాలను ఆధునీకరించడంతో పాటు కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రతి కార్యాలయానికీ కంప్యూటర్లు అందించనున్నారు. వాటిని ఆపరేట్ చేసేం దుకు తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని నియమించుకోనున్నారు. దీనికి సం బంధించిన నిధులు, అనుమతులు త్వరితగతిన ఇప్పించాల్సిందిగా కలెక్టర్ సీఎంను కోరే అవకాశం ఉంది. పరిశ్రమలు, చిన్న సంస్థల ఏర్పాటుకు కూడా భూములు ఎంపిక చేస్తున్నారు. మొదటి విడతగా భీమవరం, కొవ్వూరు, ద్వారకాతిరుమల పరిసరాలు, ఏలూరు-తణుకు మధ్య భూ ములను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో దాదాపు 50 ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఉన్నట్లు నిర్ధారించారు. వాటి విలువ సుమారు రూ.80 కోట్లుగా లెక్కించారు. గుర్తించిన ప్రభుత్వ స్థలాలు కబ్జా కోరల్లోకి వెళ్లకుండా ఉండేలా రక్షణ చర్యలు చేపట్టనున్నారు. స్థలం చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించనున్నారు. దీనికోసం దాదాపు రూ.66 లక్షలు వెచ్చించనున్నట్లు సీఎంకు వెల్లడించనున్నారు. ఏలూరు నగరం, పట్టణాల శివార్లలో గజం స్థలం ధర రూ.7వేల నుంచి రూ. 15వేలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నాన్ లే-అవుట్ స్థలాలు గజం రూ.4 వేలు, లే-అవుట్ వేసిన స్థలాలు గజం రూ.5వేలు పైబడి ఉన్నాయి. వ్యవసాయ భూముల ధరలు ఆశాశాన్నంటుతున్నాయి. గరిష్టంగా ఎకరం రూ.20 లక్షలు వరకూ ఉంది. పొలంలోకి రహదారి, సాగునీటి సౌకర్యం ఉంటే ఆ ధర మరింత భారీగా ఉంటోంది. లే-అవుట్లు, వ్యాపార, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే భూములైతే ఎకరం రూ.కోటి పైగా పలుకుతున్నాయి. ఈ పరిణామాలను ముఖ్య మంత్రి దృష్టికి కలెక్టర్ తీసుకువెళ్లనున్నారు.