వచ్చామా.. తిరిగామా.. వెళ్లామా! | Ministers tour in west godavari district | Sakshi
Sakshi News home page

వచ్చామా.. తిరిగామా.. వెళ్లామా!

Published Sun, Aug 10 2014 2:00 AM | Last Updated on Wed, Aug 15 2018 7:45 PM

వచ్చామా.. తిరిగామా.. వెళ్లామా! - Sakshi

వచ్చామా.. తిరిగామా.. వెళ్లామా!

అంతకు ముందు కాలనీలకు.. పేటలకు.. బస్తీలకు ఓ ఎమ్మెల్యే వస్తున్నారంటే చాలా హడావుడి కనిపించేది. రోడ్ల వెంబడి బ్లీచింగ్ చల్లేవారు. తోరణాలు.. పూలమాలలు.. స్వాగత సత్కారాలు గట్రా నడిచేవి. ఎందుకంటే ఆ ఏరి యాకి ఎమ్మెల్యే స్థాయి నాయకుడు వచ్చాడంటే కచ్చితంగాఅభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలో లేదా శంకుస్థాపనలో పెద్దఎత్తున జరిగేవి. ఒక్కోసారి ఇలాంటివి జరగకపోయినా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చూసి వెంటనే సదరు నేతలు అక్కడి పనులకు సంబంధించి హామీలిచ్చేవారు. కొన్నాళ్లకో.. చాన్నాళ్లకో మొత్తం మీద చాలావరకు పనులు చేసేవారు. మరి మంత్రులే వస్తే.. ఏకంగా ఉప ముఖ్యమంత్రే వస్తే.. ఇప్పుడిదంతా ఎందుకంటే సమైక్యాంధ్రప్రదేశ్ విభజనతో సీమాంధ్ర 13 జిల్లాలతో ఓ రాష్ట్రంగా మిగిలిన తర్వాత కొలువుదీరిన కొత్త మంత్రులు ఎక్కడికక్కడ గిరాగిరా తిరుగుతున్నారు. ఎటుచూసినా అక్కడో మంత్రి పర్యటన.. ఇక్కడో మంత్రి టూరు.
 
 కానీ.. ఆ ప్రాంతాలకు ఏం జరుగుతోంది. అక్కడి జనానికి ఏం ఒరుగుతోంది. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. మన జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ‘ఇదిగో ఈ రెండు నెలల్లో ఇది చేశాం’ అని ఎవరూ ఏమీ చెప్పుకోలేని పరిస్థితే ఉంది. కొత్తగా వేల, వందలాది కోట్ల రూపాయల ప్రాజెక్టుల ప్రకటనల గురించి ఇప్పుడెవరూ మాట్లాడటం లేదు. కనీసం బాధితులకు, క్షతగాత్రులకు మంత్రులిచ్చిన హామీల అమలుకు కూడా దిక్కులేని పరిస్థితి నెలకొంటోంది. రెండు వారాల కిందట ఆకివీడు శివారు ధర్మాపురంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఘట నా స్థలంలోనే ఒక మహిళ.. చికిత్స పొందూతూ మరో మహిళ మృతి చెందారు.
 
 వీరి కుటుంబాల పరామర్శకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేల బృందం ఆదుకుంటామని హామీలిచ్చింది. క్షతగాత్రుల పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చేర్పించి చదివిస్తామని మంత్రులు వాగ్దానాలు చేశారు. ఆనక ఎవరూ పట్టిం చుకోలేదు. చివరకు ఓ క్షతగాత్రుడు గత సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ‘సార్.. మమ్మల్ని, మా పిల్లల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ కలెక్టర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. కలెక్టర్ కాటమనేని భాస్కర్ వెంటనే స్పందించి ఆ పిల్లలను నగరంలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో అప్పగించారు. ఇక్కడ విషయమేమిటంటే.. స్వయంగా ఉపముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు వెళ్లి ఇచ్చిన హామీలు కూడా నెరవేరని స్థితిలో బాధితులు ఏలూరు వచ్చి ప్రజావాణిలో కలెక్టర్‌కు  మొరపెట్టుకోవడం.
 
 ఒకరిద్దరి బాధితులకు సంబంధించిన సహాయ కార్యక్రమాలపైనే పాలకుల స్పందన ఇలా ఉండటం ఒకింత విమర్శలకు తావి చ్చింది. ఇదొక్క ఘటనే కాదు.. జిల్లాలో ఇటీవల మంత్రులు వెళ్లి అక్కడి జనానికి ఇస్తున్న చిన్నపాటి హామీలు కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇచ్చిన హామీలు పరిష్కారమయ్యాయో లేదోనన్న పరిశీలన ఇప్పటివరకు ఏ నేత కూడా చేస్తున్న దాఖలాలు లేవు. ఏదో వచ్చామా.. తిరిగామా.. వెళ్లామా.. అన్న తీరు కాకుండా మా గోడు కాస్త పట్టించుకోండంటూ సామాన్య జనం వేడుకుంటున్నారు. వింటున్నారా పాలకులూ!
 
 కావూరి ఎక్కడ?
 రెండుసార్లు ఎంపీగా గెలిపించిన పశ్చిమగోదావరి జిల్లా ప్రజలను, ముఖ్యంగా ఏలూరు వాసులను ఎప్పటికీ మరచిపోలేను.. అంటూ మొన్నటివరకు బీరాలు పలికిన కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు ఇప్పుడెక్కడున్నారు.. కనీసం మచ్చు కు కూడా కానరావడం లేదు. కృష్ణా జిల్లాకు చెందిన ఆయనకు వరుసగా రెండుసార్లు 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా ఇక్కడి ప్రజలు పట్టం కట్టా రు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిన తొలినాళ్లలో సమైక్య ఉద్యమ సారధిగా హడావుడి చేసిన ఆయన కేంద్రమంత్రి తాయిలం దక్కగానే ప్లేటు ఫిరాయించడం, చివరివరకు పదవిని అనుభవించి ఎన్నికల సమయం వచ్చేసరికి కాంగ్రెస్‌ను కాదనుకుని బయటకు వచ్చేయడం అందరికీ తెలిసినవే.
 
 రాష్ట్ర విభజనకు ఆమోద ముద్ర వేసిందని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన అదే విభజన అంశానికి మద్దతిచ్చిన బీజేపీలో చేరడం కేవలం ఆయన వ్యాపార ప్రయోజనాల కోసమే అన్నది బహిరంగ రహస్యం. సరే.. ఆయన ప్రయోజనాలు, పార్టీల మార్పిడి ఎలా ఉన్నా పదేళ్లు ఆదరించిన ఏలూరుకు ఇటీవలికాలంలో పూర్తిగా రావడం మానేశారు. చివరకు నగరంలోని మోతేవారి తోటలో ఎన్నో ఏళ్లుగా ఉన్న క్యాంపు కార్యాలయాన్ని రెండు నెలల కిందటే ఖాళీ చేసేశారు. ఇప్పుడు ఎటూ ఆయన ప్రజాప్రతినిధి కాదు కాబట్టి జనం కొత్త పాలకులపైనే ఆశగా చూస్తున్నారు. మరి పదేళ్ల పాటు కావూరినే నమ్ముకుని హల్‌చల్ చేసిన క్యాడర్ పరిస్థితి ఏమిటో?
 
 దుందుడుకు ఎమ్మెల్యేకి సీఎం క్లాస్
 గెలిచేవరకే పార్టీలు.. రాజకీయాలు.. ఒక్కసారి గెలిచిన తర్వాత ఆ ప్రాంతానికి ప్రజాప్రతినిధి. అంటే ఎన్నికల్లో తనకు ఓటేసిన వారికి, వేయని వారి కూడా తానే ఎమ్మెల్యే.  ఈ కనీస స్పృహ కూడా లేని ఒకాయన ఎమ్మెల్యే అయిన తర్వాత వేరే పార్టీ వాళ్లు కనిపిస్తే చాలు ఎగబడి, కలబడి గొడవ చేస్తున్నారట. అంతే కాదు అధికారులను కూడా నోటికొచ్చినంత మాట్లాడేస్తున్నారట. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదరు నేతకు గట్టిగా క్లాస్ పీకారట. ‘జాగ్రత్త.. ఆఫీసర్స్‌తో ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావ్ అని తెలిసింది. మరోసారి ఇలాంటివి నా దృష్టికొస్తే ఊరుకోను’ అని గట్టిగానే మందలించారట. మరి ఇప్పటికైనా సదరు నేతలో మార్పు వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందా.. ఏమో చూద్దాం!
 - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement