
సాంబ... ఇదేం దబ్బ!
‘పదవిని పట్టుకుని వేలాడ్డానికి నేను వెధవను కాదు. మీలో ఎవరైనా వెధవలుంటే నేనేం చేయలేను’ ఈ మాటలన్నది గల్లీ నాయకుడు కాదు. ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కాకలు తీరిన కాంగ్రెస్ నాయకుడి నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలివి. 45 ఏళ్లుగా హస్తం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతాశ్రీ విచక్షణ మరిచిపోయి వదిలిన పరుష పదజాలమిది. ఆయనెవరో కాదు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు. తనను నిలదీసిన సమైక్యవాదులపై ఆయన తిట్ల దండకం అందుకున్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయిన 49 రోజుల తర్వాత తొలిసారి సొంత జిల్లాకు వచ్చిన కావూరిని ఉద్యమకారులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన ప్రకటనకు వ్యతిరేకంగా తమతో కలిసి ఉద్యమంలోకి రావాలని అభ్యర్థించారు. కేంద్ర అమాత్య పదవికి రాజీనామా చేసి సమైక్య పోరాటంలోకి దూకాలని కోరారు. ఆందోళనకారులను సముదాయిల్సింది పోయి వారిని మరింత రెచ్చగొట్టారు.
రాజీనామాకు ససేమీరా అనడంతో సమైక్యవాదులు కావూరిని కదలనీయలేదు. 45 ఏళ్ల పొలిటికర్ కెరీర్ ఉన్న తాను నాలుగు నెలలుండే కేంద్ర మంత్రి పదవి కోసం పాకులాడే వెధవని కానని, మీలో ఎవరైనా వెధవలుంటే నేనేం చేయలేనంటూ మాట తూలారు. దీంతో విద్యార్థులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా కావూరి అనుచరులు వారిపై దాడికి పాల్పడ్డారు.
తాను పక్కా సమైక్యవాదినని చెప్పుకునే కావూరి సమైక్యాంధ్ర అనడానికి నిరాకరించడం ఆయన ద్వంద్వ వైఖరిని వెల్లడిస్తోంది. కేంద్ర మంత్రి కాగానే ఆయన సమైక్యాంధ్ర టాగ్ను వదిలేశారు. మంత్రి పదవి రాకముందు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో కలిసి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గళమెత్తిన కావూరి తర్వాత రూటు మార్చారు. కేంద్ర మంత్రిగా స్థాయికి దిగి మాట్లాడలేనంటూ గతంలో బీరాలు పలికిన కావూరి ఇప్పుడు చేసిన పరుష వ్యాఖ్యలకు ఏమని సమాధానం చెబుతారు?