
కావూరికి కాక కేసులో మద్దాల రాజేష్ అరెస్ట్
చింతలపూడి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును అడ్డుకున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు- ఆయనను నేడు అదుపులోకి తీసుకున్నారు. పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కావూరి ఒత్తిళ్లకు లొంగి పోలీసులు తమపై అక్రమ కేసులు పెట్టారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమైక్యవాదులపై కావూరి అనుచిత వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదని వాపోయారు.
తమపై పరుష పదజాలంతో దూషించిన కావూరి పై సంబంధిత సెక్షన్ల కేసు నమోదు చేయాలని మద్దాల రాజేష్ డిమాండ్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేసే పోలీసు స్టేషన్లోనే బైఠాయిస్తామని అన్నారు. సొంత నియోజకవర్గంలో తనను అడ్డుకున్న సమైక్యవాదులపై మంగళవారం కావూరి విరుచుకుపడ్డారు. ‘ఎవడు డబ్బులిస్తే వచ్చార్రా సన్నాసుల్లారా, చేతకాని వెధవల్లారా’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు.
కాగా, మద్దాల రాజేష్ అరెస్టుకు నిరసనగా గురువారం చింతలపూడిలో బంద్ పాటిస్తున్నారు.